ప్రొఫెసర్‌కు గుండెపోటు.. సాయం చేసిన విద్యార్థులపై కేసు నమోదు.. ఎందుకంటే..

గుండెపోటుతో బాధపడుతున్న ప్రొఫెసర్‌ను కాపాడేందుకు జడ్జి కారును తీసుకెళ్లారు కొందరు విద్యార్థులు. దాంతో సదరు విద్యార్థులపై హైజాక్ ఆరోపణలతో కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో చోటు చేసుకుంది.

New Update
ప్రొఫెసర్‌కు గుండెపోటు.. సాయం చేసిన విద్యార్థులపై కేసు నమోదు.. ఎందుకంటే..

Bhopal News: ఒక్కోసారి మంచి చేసినా.. అది తిరిగి మనకు చెడు చేస్తుందని అంటారు. కొందరు యువకుల విషయంలో అచ్చం అలాగే జరిగింది. ఓ వ్యక్తి ప్రాణాలు కాపాడేందుకు 20 మంది యువకులు చేసిన ప్రయత్నం.. వారిని న్యాయపరమైన చిక్కుల్లో పడేసింది. సదరు విద్యార్థులుపై దోపిడీ నిరోధక చట్టం, ఐపీసీలోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు అయ్యాయి. ఇందుకు సంబందించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

గ్వాలియర్ రైల్వే స్టేషన్‌లో ఓ వ్యక్తి ప్రాణాలను కాపాడే క్రమంలో హైకోర్టు న్యాయమూర్తి కారును లాక్కెళ్లిన ఘటనలో దాదాపు 20 మంది విద్యార్థులు న్యాయపరమైన చిక్కుల్లో పడ్డారు. ఝాన్సీలోని ఓ ప్రైవేట్ యూనివర్సిటీకి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ రంజిత్ సింగ్ యాదవ్ (59) గుండెపోటుకు గురయ్యారు. ఆదివారం రాత్రి ఆయన ఢిల్లీ నుంచి దక్షిణ్ ఎక్స్‌ప్రెస్ రైలులో ఝాన్సీకి ప్రయాణిస్తున్నారు. మొరెనాకు చేరుకున్న తర్వాత అతని ఆరోగ్య పరిస్థితి క్షీణించింది. తక్షణ వైద్యం అవసరం. ఆయన పరిస్థితిని గమనించిన కొందరు విద్యార్థులు.. గ్వాలియర్ స్టేషన్ వెలుపల అంబులెన్స్ కోసం ప్రయత్నించారు. అయితే.. ఒక్క అంబులెన్స్ కూడా అందుబాటులోకి రాలేదు. దాంతో ప్రత్యామ్నాయ మార్గం కోసం విద్యార్థులు ప్రయత్నించారు.

ఇంతలో విద్యార్థులు ఒక కారును చూశారు. అది న్యాయమూర్తికి చెందినదని వారికి తెలియదు. అత్యవసర పరిస్థితుల నేపథ్యంలో.. దానిని ఉపయోగించాలని నిర్ణయించుకున్నారు. కారు డ్రైవర్‌ను, సెక్యూరిటీ సిబ్బందిని బలవంతంగా బయటకు పంపించి కారును స్వాధీనం చేసుకున్నారు. ప్రొఫెసర్‌ రంజిత్ సింగ్‌ను ఆసుపత్రిలో చేర్చారు. అయితే, వారి ప్రయత్నం ఫలించలేదు. కొద్దిసేపటికే చికిత్స పొందుతూ మృతి చెందాడు అసిస్టెంట్ ప్రొఫెసర్.

మరోవైపు, న్యాయమూర్తి డ్రైవర్ కారు చోరీ గురించి పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేశాడు. దాంతో సదరు విద్యార్థులపై దోపిడీ నిరోధక చట్టం, ఐపీసీలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. వాహన చోరీకి సంబంధించిన ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు.. ఆ కారును పట్టుకునేందుకు నగరం అంతటా విస్తృతంగా సోదాలు చేపట్టారు. ఏకంగా అసిస్టెంట్ ఎస్పీ పర్యవేక్షణలో ఈ తనిఖీలు నిర్వహించారు. విద్యార్థులను పట్టుకునేందుకు తీవ్రంగా శ్రమించారు. అయితే, చివరకు ఆ కారు ఆస్పత్రి బయట ఆగి ఉండటాన్ని గమనించారు. ప్రొఫెసర్‌కు గుండెపోటు వచ్చినట్లు పోలీసులు నిర్ధారించారు.

ఫిర్యాదు ప్రకారం.. పోర్చ్ ప్రాంతంలో పార్క్ చేసిన న్యాయమూర్తి కారు వద్దకు విద్యార్థులు వచ్చారు. ఒక వ్యక్తికి తక్షణ వైద్య సహాయం అవసరమని న్యాయమూర్తికి తెలియజేశారు. దాంతో సదరు న్యాయమూర్తి.. ప్రభుత్వ వాహనాన్ని ఉపయోగించి రోగిని ఆసుపత్రికి తరలించడానికి వీలు కల్పించాలని తన భద్రతా సిబ్బందిని ఆదేశించారు. అనంతరం జడ్జి వెయిటింగ్ రూమ్‌కి వెళ్లారు. అంబులెన్స్ వచ్చినప్పటికీ, భద్రతా బృందం, డ్రైవర్ బాధిత ప్రొఫెసర్‌ని అంబులెన్స్ ఎక్కించాలని అభ్యర్థించినప్పటికీ.. విద్యార్థులు ప్రభుత్వ వాహనాన్ని ఎత్తుకెళ్లారు. బలవంతంగా కీ తీసుకుని.. కారులో ప్రొఫెసర్‌ని తరలించారు. అంబులెన్స్‌ను ఉపయోగించమని చేసిన అభ్యర్థనలను పట్టించుకోకుండా రోగిని తరలించారు.' అని ఫిర్యాదులో పేర్కొన్నారు న్యాయమూర్తి భద్రతా సిబ్బంది.

Also Read:

శ్రీరంగం ఆలయంలో ఏపీ భక్తులపై దాడి.. వీడియో ఇదిగో..!

పోస్టుమార్టంలో యువతి ‘కళ్లు’ మాయం.. కంగుతిన్న అధికారులు

Advertisment
Advertisment
తాజా కథనాలు