గత కొన్ని రోజులుగా ఏపీలో మార్మోగుతున్న పేర్లు.. పల్నాడు, పిన్నెల్లి, మాచర్ల. ఎన్నికల తర్వాత ఈ ప్రాంతంలో భారీగా హింస, విధ్వంసం చోటు చేసుకోవడమే ఇందుకు కారణం. ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంను పగలగొట్టిన వీడియో బయటకు రావడం తెలుగు రాష్ట్రాలనే కాకుండా.. యావత్ దేశాన్నే షాక్ కు గురి చేసింది. ఇక ఏపీలో ఈ అంశం తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపింది. ఈ ఘటనపై ఈసీ సీరియస్ కావడంతో ఎమ్మెల్యే అరెస్ట్ కావడం ఖాయమన్న ప్రచారం జరిగింది. ఎమ్మెల్యే అరెస్ట్ చుట్టూ రెండు రోజుల పాటు హైడ్రామా సాగింది. అయితే... హైకోర్టు ఆయనను జూన్ 5 వరకు అరెస్ట్ చేయవద్దని ఆదేశాలు ఇచ్చింది. దీంతో కాస్త ఊపిరి పీల్చుకున్నారు పిన్నెల్లి, వైసీపీ నేతలు
పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విషయానికి వస్తే.. గత నాలుగు ఎన్నికల్లో (2004, 09, 14, 19) ఆయన వరుస విజయాలు సాధించి.. ప్రస్తుతం మరోసారి వైసీపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. మొదటి రెండు సార్లు ఆయన కాంగ్రెస్ అభ్యర్థిగా.. ఆ తర్వాత వైసీపీ నుంచి విజయం సాధించారు. దీంతో 20 ఏళ్లుగా ఆయన ఈ ప్రాంతంలో తిరుగులేని నేతగా ఎదిగారు. ముఖ్యంగా 2019 లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పిన్నెల్లి ఇంకా పవర్ ఫుల్ గా మారారు. వ్యవస్థలన్నీ ఆయన కనుసన్నల్లోనే నడిచాయన్న ఆరోపణలు ఉన్నాయి. గత స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో నియోజకవర్గంలోని అన్ని ఎంపీటీసీ, సర్పంచ్, జడ్పీటీసీ స్థానాలతో పాటు మున్సిపల్ వార్డుల్లో వైసీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాష్ట్రంలో మరే నియోజకవర్గంలోనూ ఇలా జరగలేకపోవడం గమనార్హం.
అయితే.. ఈ ప్రాంతంపై తమకు ఉన్న పట్టు, ప్రజల అభిమానమే ఇందుకు కారణమని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, వైసీపీ నేతలు ఆ సమయంలో చెప్పారు. కానీ పిన్నెల్లి రౌడీ రాజకీయానికి భయపడే ఇతర పార్టీల నుంచి పోటీ చేసేందుకు ఎవరూ సాహసం చేయలేదని ప్రతిపక్షాలు ఆరోపించాయి. ఎవరైనా సాహసం చేసి నామినేషన్ వేసినా.. పోలీసులు, ఇతర వ్యవస్థతల సహకారంతో వారిని బెదిరించి వారిని విత్ డ్రా చేయించారన్న ఆరోపణలు ఉన్నాయి. మరికొందరిని అసలు నామినేషన్ కేంద్రాలకే వెళ్లనివ్వలేదన్న ప్రచారం జరిగింది. ఇందుకు సంబంధించి టీడీపీ రాష్ట్ర నాయకత్వం తరఫున పరిశీలించడానికి వెళ్లిన ఆ పార్టీ నేతలు బోండా ఉమ, బుద్ధా వెంకన్న తదితరుల వాహనాలను వెంబడించి మరీ దాడి చేశారు వైసీపీ నేతలు.
ఇనుప రాడ్లతో అద్దాలు పగలగొట్టి భయానక వాతావరణం సృష్టించారు. ఈ వీడియోలు ఇప్పడు ఈవీఎం పగలగొట్టిన ఘటనకు మాదిరిగానే ఆ సమయంలో ఈ దాడుల వార్తలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. అయితే.. తమను చంపేందుకు పిన్నెల్లి ప్రయత్నించారంటూ టీడీపీ నేతలు ఆ సమయంలో ఆరోపించారు. అయితే.. పిన్నెల్లి మాత్రం ఇక్కడి ప్రశాంతమైన వాతావరణాన్ని దెబ్బతీసేందుకే వారు అచ్చి అలజడులు సృష్టించారని ఫైర్ అయ్యారు. పది కార్లలో వారు వస్తుంటే.. పోలీసులు ఎలా అనుమతించారంటూ ఫైర్ అయ్యారు.
నేర చరిత్ర..
పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై మాచర్ల టౌన్ తో పాటు, గురజాల, మాచవరం పోలీస్ స్టేషన్లలో 4 కేసులు ఉన్నాయి. ఇందులో అటెమ్ట్ మర్డర్ కు సంబంధించిన 307 తదితర తీవ్రమైన సెక్షన్లు ఆయనపై ఉన్నాయి. ఇటీవల జరిగిన ఈవీఎం విధ్యంసం అంశంపై పిన్నెల్లిపై ఐపీసీ143, 147, 448, 427, 353, 453, 452, 120 (బి) సెక్షన్లతో పాటు ఆర్‌పీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ కేసులు న్యాయస్థానాల్లో ఎంత వరకు నిలబడుతాయి? ఆయనకు శిక్ష పడుతుందా? అన్నది తేలాలంటే మరికొన్ని ఏళ్లు ఆగాల్సిందే!