Veturi :తెలుగు పాటల తోటలో పాటసారి..మన వేటూరి

వేణువై వచ్చాను భువనానికి అంటూ ఏడిపించినా, ఆకు చాటు పిందె తడిసె అంటూ డబుల్ మీనింగ్ పాటలు పాడించినా...పిల్లన గ్రోవికి నిలువెల్ల గాయాలు అంటూ తత్వం చూపించినా అది ఒక్క వేటూరి వల్లనే సాధ్యమయింది. తెలుగు సినిమాకు పాటసారిగా నిలిచిన వేటూరి సుందర్రామ్మూర్తి జయంతి ఈరోజు.

Veturi :తెలుగు పాటల తోటలో పాటసారి..మన వేటూరి
New Update

Veturi Sundara Ramamurthy: వేటూరి సుందరరామ్మూర్తి...తెలుగు సినిమా ప్రేక్షకులు కలకాలం గుర్తుంచుకునే రచయిత. ఆయన అక్షరం..అక్షయం. తెలుగు అక్షరాలను జలపాతంలా పారించి జీవనదిలా విస్తరించి మహా సముద్రమై స్థిరపడి ప్రతి తెలుగు గుండెలోనూ ఘోషించే పాటలైనాయి వేటూరి గీతాలు. ఆనంతకోటి భావాల కెరటాలు ఎగసిపడే సాహితీ సముద్రం ఆయన కలం. జీవితంలో ప్రతీ అడుగులో, ప్రతీ సందర్భానికీ ఆయన పాట ఉంది. అలలు కదిలినా పాటే, ఆకు మెదిలినా పాటూ అంటూ ఆయనే సీతామహాలక్ష్మి అనే సినిమాలో పాట రాశారు. అది వేటూరి పాటల్లో అక్షరాలా నిజం. ఎవరి సామర్ధ్యాన్ని బట్టి వారికి రంజన కల్పించగల శక్తి ఆయన పాటలకి సొంతం. వేదాంతం, భక్తి, రక్తి, విరక్తి, శృంగారం, ప్రణయం, కలహం, ప్రేరణ, దేశభక్తి, విప్లవం, హరికథ ఇలా ఆయన సృశించని వస్తువు లేదు. రాయని పాట లేదు.

Also Read: USA:సాయం చేసిన వ్యక్తినే దారుణంగా చంపేశాడు..యూఎస్‌లో బలయిన భారతీయ విద్యార్ధి

కృష్ణాజిల్లా పెదకళ్ళేపల్లి గ్రామంలో 1936వ సంవత్సరంలో పుట్టారు వేటూరి. జంట కవులుగా పేరు పొందిన తిరుపతి వేంకట కవులు, దైతా గోపాలం ఆ తర్వాత మల్లాది వద్ద శిష్యరికం చేశారు. తొలినాళ్ళలో పాత్రికేయునిగా పనిచేసిన వేటూరి కె.విశ్వనాథ్ దర్శకతం వహించిన ఓ సీత కథ (O Seeta Katha) ద్వారా సినీ రంగ ప్రవేశం చేశారు. దేవులపల్లి, మల్లాది, శ్రీశ్రీ ఇలా పెద్ద కవులందరూ సినీ రంగాన్ని వదిలి వెళ్ళపోయారు. తరువాత ఎవరు మళ్ళీ అంత గొప్ప పాటులు రాస్తారా అనుకున్నారు. అప్పుడు వచ్చారు వేటూరి. ఆ తర్వాత కాలం మారింది. కాలంతో పాటూ అభిరుచులూ మారాయి. దానికి తగ్గట్టుగా పాటలూ మారాయి. ఆ ప్రవాహాన్ని తట్టుకున్నారు వేటూరి. ఎవరికి ఎలా కావాలంటే అలా గీతాలను రాశారు. అద్భుతమైన సాహిత్యంలో ముంచి తేల్చారు...అర్ధవంతమైన భావం వినిపించారు...డబుల్ మీనింగ్ పాటలతో జనాలను పిచ్చెక్కించినా అది ఒక్క వేటూరి వల్లనే సాధ్యమైంది.

వేటూరి కొన్ని వేల పాటలను రాశారు. 8 నంది అవార్డులతో పాటు మొత్తం 14 అవార్డులు, ఒక జాతీయ పురస్కారం అందుకున్నారు. తెలుగు పాటకు శ్రీశ్రీ తర్వాత జాతీయ ఖ్యాతిని ఆర్జించి పెట్టింది వేటూరియే. వేటూరి అనగానే వెంటనే స్ఫురించేది అడవి రాముడు (Adavi Ramudu), శంకరాభరణం. ఇంకా సిరిసిరిమువ్వ, సాగరసంగమం, సప్తపది, సీతాకోకచిలుక, ముద్దమందారం, సితార, అన్వేషణ, స్వాతిముత్యం... ఇలా ఎన్నో సినిమాలు. సంప్రదాయ కవిత్వం నుంచి జానపద గీతాల వరకూ అన్నింటిలోనూ తన ప్రతిభను నిరూపించుకున్నారు. ఉచ్ఛ్వాస నిశ్వాసములు వాయులీనాలు స్పందించు నవనాడులే వీణాగానాలు, పిల్లన గ్రోవికి నిలువెల్ల గాయాలు,,అల్లన మ్రోవి తాకితే గేయాలు లాంటి అపురూప పదవిన్యాసాలు ఆయన పాటల్లో అడుగడుగునా కనిపిస్తాయి. ఇక మాతృదేవోభవ సినిమాలో వేటూరి రాసిన ఒక్కో పాట ఒక్కో ఆణిముత్యం. ఇందులో రాలిపోయ పువ్వా పాటకు జాతీయ పురస్కారం వచ్చింది. అయితే తెలుగుకు ప్రాచీన భాషా హోదా ఇవ్వలేదని వేటూరి దాన్ని వెనక్కి తిరిగి ఇచ్చేశారు. ఆయన గొప్ప వ్యక్తిత్వానికి ఇదొక మచ్చుతునక.

అరుదైన‌ గ్రాంధిక, వ్యావహారిక భాషలో పట్టున్న‌ వేటూరి...తెలుగువారి అభిరుచులను గ్రహించి వ్యాపార అవసరాలకు అనుగుణంగా పని చేశారు. ఏ ఎండకా గొడుగు పట్టడం అంటే వేటూరిని చూసి తెలుసుకోవాల్సిందే. సిరి సిరి మువ్వ లతో ఆడుకున్నారు.. శంకరాభరణంతో సరిగమలు పాడించారు...అడవి రాముడు లో డాన్స్ చేయించారు... సప్తపది కి అడుగులో అడుగు వేసారు, వేటగాడు తో వినోదం పంచారు వేటూరి. వేటూరి ప్రేమను, అందాన్ని సుకుమారం గా వర్ణిస్తూ పాటలు రాశారు. అన్ని కోణాల్లో త‌ర‌చి త‌ర‌చి అన్నిర‌కాల ర‌సాల్ని పాట ద్వారా విహ‌రింప‌జేసిన గొప్ప ర‌చ‌యిత వేటూరి. 75 సంవత్సరాల వయస్సులో మే 22, 2010న హైదరాబాదులో గుండెపోటుతో మరణించారు.

#veturi-sundara-ramamurthy #songs #movies #telugu
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe