Love Cinema: జోనర్ ఏదైనా లవ్ తప్పనిసరి.. సినిమాకు సిరులు కురిపించే ప్రేమ 

ప్రేమ కథలతో వచ్చిన సినిమాలు చాలావరకూ హిట్. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా మన సినిమాల్లో పేమ కథల తీరు తెన్నులపై కథనం ఇది. లవ్ సెంట్రిక్ సినిమాల మీద ఈ విశ్లేషణాత్మక కథనం పూర్తిగా చదవండి. 

New Update
Love Cinema: జోనర్ ఏదైనా లవ్ తప్పనిసరి.. సినిమాకు సిరులు కురిపించే ప్రేమ 

Love Story Cinemas Tollywood: ప్రేమ.. నిత్యం మనం ఉపయోగించే మాటల్లో ఈ పదం లేకుండా ఉండదు. ఇక యువతీయువకుల మధ్య ఇది వచ్చి చేరిందంటే అది తెచ్చే గిలిగింతలు వర్ణించడానికి మాటలు చాలవు. మనకు అందుబాటులో ఉన్న చరిత్ర లేదా పురాణ కథల నుంచి.. ఇప్పటి ఆధునిక సినిమా కథనాల వరకూ ఈ రెండక్షరాల మాట సృష్టించే వైబ్రేషన్స్ ని ఏ పదమూ తీసుకురాలేదు. అసలు ఒక కథ పుట్టినా.. గిట్టినా అందులో ప్రేమ కోణం లేకుండా ఉండదు. ఆనాటి రామాయణ,భారతాల నుంచి ఇప్పటి హనుమాన్ సినిమా (Hanuman Movie) వరకూ ప్రేమ కథ లేని ఇతిహాసమూ లేదు. ప్రేమ కథ పెనవేసుకోని చిత్రమూ లేదు. మన సినిమా కథల్లో ప్రేమను ఎంత అందంగా చూపిస్తారో.. అదే ప్రేమను అంత క్రూరంగానూ తెర మీద పరిచేస్తారు. రేపు (ఫిబ్రవరి 14) వాలెంటైన్స్ డే అంటే ప్రేమికుల దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. ఈ సందర్భంగా మన సినిమా ప్రేమ కథల గురించి ఓసారి మాట్లాడుకుందాం. 

తెలుగు సినిమాల్లో ఎన్ని రకాల సినిమాలు వచ్చినా ప్రేమ కథలు(Love Stories) హిట్ అయినట్టు మిగిలిన జోనర్స్ సినిమాలు హెట్ కావు. ఒక్కోసీజన్ ఒక్కోరకం సినిమాల హవా ఉంటుంది. ఒక్కోసారి హారర్ జోనర్.. ఇంకోసారి కామెడీ సినిమాలు.. మరోసారి ఆధ్యాత్మిక కథలు.. ఇంకా థ్రిల్లర్స్.. యాక్షన్ ఇలా రకరకాల జోనర్స్ సీజన్ బట్టి నడుస్తాయి. కానీ ప్రేమ కథలకు మాత్రం అలా సీజన్ ఏదీ ఉండదు. సంవత్సరంలో వంద సినిమాలు వస్తే వాటిలో కనీసం 75 సినిమాలు పూర్తి ప్రేమకథలతో వస్తాయి. మిగిలినవి రకరకాల జానర్స్ లో తీసుకువస్తారు. అయితే, ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏమిటంటే.. సినిమా జానర్ ఏదైనా దానిలో కచ్చితంగా లవ్ ట్రాక్ ఉండి తీరుతుంది. ఒక మర్డర్ జరిగింది.. దాని ఇన్వెస్ట్ గేషన్ కోసం హీరో వచ్చాడు.. అక్కడ హీరోకి సహాయం చేసే అమ్మాయితో లవ్ కచ్చితంగా ఉండాల్సిందే. లేదూ అంటే ఆ మర్డర్ వెనుక ప్రేమ కోణం ఉంటుంది. అంతెందుకు.. దానవీరశూరకర్ణ సినిమాలో ఎన్ఠీఆర్ రావణాశురుడికే లవ్ సీన్స్.. సాంగ్ పెట్టి మెప్పించేశారు. వందల కోట్లు పెట్టి సినిమా తీసినా సరే అందులో ప్రేమ ఉంటుంది. ప్రేమ పాటలు ఉంటాయి. ఎందుకంటే మన ప్రజల్లో ప్రేమ  అంటే ఉండే అద్భుతమైన ఆకర్షణ క్యాష్ చేసుకోవాలి కదా. అవును.. మనకి ప్రేమ అంటే పిచ్చి ఆకర్షణ. ముందే చెప్పినట్టు ప్రేమలో పడ్డ యువతీయువకుల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 

అన్నట్టు సినిమాల్లో ప్రేమ గురించి చెప్పుకుంటున్నాం కదా.. మనోళ్లు సరైన ప్రేమకథ సినిమాగా వస్తే దానిని భాషతో సంబంధం లేకుండా డబ్బింగ్ సినిమాలైనా సరే వందరోజులు ఆడించేస్తారు. అవును.. అప్పట్లో టి.రాజేందర్ తమిళ దర్శకుడు. ప్రేమసాగరం (Prema Sagaram) పేరుతో పదోతరగతి పూర్తయిన అమ్మాయి.. అబ్భాయిల మధ్య ప్రేమను చూపిస్తే.. అది డబ్బింగ్ సినిమా అయినా సరే మన ప్రేక్షకులు లక్షలు కురిపించేశారు. ఇక బాలచందర్ మరోచరిత్ర తెలుగు సినిమా తెరపై కూడా కొత్త చరిత్ర సృష్టించింది.  డబ్బింగ్ సినిమాలనే అంత ఆదరించిన మనోళ్లు స్ట్రైట్ సినిమాలను వదులుతారా చెప్పండి. అప్పటి ఏఎన్నార్ దేవదాసు నుంచి మొన్న మొన్నటి నానీ హాయ్.. నాన్న వరకూ అచ్చమైన ప్రేమ కథలు ఎన్నో వచ్చాయి. వాటిలో చాలావరకూ హిట్స్. 

ప్రేమ అనేది ఒక అనిర్వచనీయమైన అనుభూతి. దానిని వెండితెర మీద  అద్భుతంగ ఆవిష్కరించిన సినిమాలు చాలా వచ్చాయి. అయితే, ప్రేమను ఒక్కో దర్శకుడు ఒక్కోరకంగా ప్రెజెంట్ చేశారు. చేస్తూ వస్తున్నారు. ఎవరు ఎలా ప్రెజెంట్ చేసినా కంటెంట్ చెప్పేవిధంగా చెబితే ప్రేమ కథలకు మంచి ఆదరణ ఎప్పుడూ ఉంటుంది. విజయ్ దేవరకొండ హీరోగా చేసిన అర్జున్ రెడ్డి (Arjun Reddy).. గీతాగోవిందం సినిమాలు దీనికి ఉదాహరణ. రెండూ ప్రేమకథలే. ఒకటి వైల్డ్ గా ఉంటుంది. రెండోది ఆహ్లాదంగా ఉంటుంది. 

ఇక ప్రేమను పంచినా.. పెంచినా.. తుంచినా.. అది సినిమా కథావస్తువే. కాసులు తీసుకువచ్చే హిట్ ఫార్ములానే. తెలుగు సినిమాల్లో మరీ వెగటుగా వచ్చిన సినిమాలు తప్పితే.. ప్రేమకథలను నమ్ముకుని సినిమాగా వచ్చిన మిగిలినవి అన్నీ డబ్బులు చేసుకున్నాయి.  అయితే, ప్రేమ కథలను చూపించే విధానం మాత్రం అప్పటికీ ఇప్పటికీ బాగా మారిపోయింది. కాలాన్ని బట్టి వచ్చిన మార్పు అది. ప్రేమ కథలలో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే.. దానికి ఒకరకమైన ఫార్ములా ఉంటుంది. యువతి, యువకుడు వారి మధ్య ప్రేమ. దాని సక్సెస్ కోసం ప్రయత్నం. అడ్డువచ్చే విలన్స్ (ఎవరైనా కావచ్చు) చివరికి ప్రేమను గెలిచి ఒక్కటి కావడం. లేదా ఓడిపోయి ప్రాణం వదలడం. దీనినే అందమైన కథనం.. సంఘటనల కూర్పు.. అన్నిటినీ జాగ్రత్తగా ఫ్రేమ్ చేసుకోవడమే దర్శకుడి ప్రతిభ. ఆ ఫ్రేమ్ వర్క్ కుదిరితే సినిమా హిట్. లేదంటే ఫట్. అంతే. 

Also Read: డ్రోన్ కి ఎక్కువ.. హెలికాఫ్టర్ కి తక్కువ.. మారుతి ఎగిరే కారు వచ్చేస్తోంది!

డబ్బులను తెచ్చిపెడుతుంది కదా అని ప్రేమను ఇష్టం వచ్చినట్టు చుట్టేసి వదిలేస్తే సినిమా ఎంత పెద్ద స్టారింగ్ ఉన్నా.. బాక్సాఫీస్ వద్ద ఎదురు తన్నుతుంది. అందుకు ఉదాహరణ కూడా చాలా సినిమాలు ఉన్నాయి. సీతారామం (Sita Ramam) లాంటి సినిమాలను ఎంతగా నెత్తిన పెట్టుకున్నారో.. ఖుషి (విజయ్ దేవరకొండ) లాంటి సినిమాలను  నిర్మొహమాటంగా పక్కకు నెట్టేశారు. 

ఏది ఏమైనా సినిమాల్లో ప్రేమ కొబ్బరి చెట్ల మధ్య నుంచి కింద ఉన్న మల్లెపందిరిమీద పడుతున్న పండు వెన్నెలలా ఆహ్లాదంగా ఉంటే.. విషాదాంతం అయినా సరే.. ప్రేక్షకులు ఆ సినిమా మీద ప్రేమలో పడిపోతారు. అలాకాకుండా ప్రేమ పేరుతో వికృతాన్ని సృష్టిస్తే ఆ సినిమాలు కచ్చితంగా నిర్మాతలను ముంచేస్తాయి. ఇప్పటి ట్రెండ్ లో పూర్తిగా ప్రేమకథా చిత్రాలు రావడం తగ్గింది. కానీ.. మంచి సినిమా వస్తే.. దానిని అక్కున చేర్చుకుని ఆదరించి ప్రేమ కురిపించడానికి ప్రేక్షకులు సిద్ధంగానే ఉన్నారు. ఆ ప్రేమ కాసులను కురిపిస్తుంది అనడానికి సీతారామం, హాయ్ నాన్న తాజా ఉదాహరణలు. 

Watch this Interesting Video :

Advertisment
Advertisment
తాజా కథనాలు