KCR : కడియం కావ్య(Kadiyam Kavya) వరంగల్(Warangal) బీఆర్ఎస్(BRS) అభ్యర్థిగా పోటీ నుంచి తప్పుకోవడంతో.. గులాబీ బాస్ కేసీఆర్ రంగంలోకి దిగారు. గెలుపే లక్ష్యంగా కొత్త అభ్యర్థి ఎవరైతే బాగుంటుందనే అంశంపై దృష్టి సారించారు. ఇందులో భాగంగా మాజీ మంత్రి బాబు మోహన్(Mohan Babu), చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బల్కా సుమన్(Balka Suman) పేర్లను ఆయన పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. వరంగల్ ఎంపీగా పోటీ చేస్తానని బాబుమోహన్ ఇప్పటికే అనేక సార్లు ప్రకటించారు.
బీజేపీలో టికెట్ దక్కదని భావించి.. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలను కూడా ఆయన గతంలో సంప్రదించారు. వారి దగ్గరి నుంచి స్పందన రాకపోవడంతో ప్రజాశాంతి పార్టీ నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే.. రాత్రి బాబుమోహన్ కు కేసీఆర్ ఫోన్ చేసి వరంగల్ ఎంపీ అభ్యర్థి విషయంలో చర్చించినట్లు పార్టీ వర్గాల నుంచి సమాచారం. ఒకటి రెండు రోజుల్లో కేసీఆర్ ఈ మేరకు నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.
బాల్క సుమన్ పేరు కూడా..
వరంగల్ బిఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ ఉద్యమకారుడు బాల్క సుమన్ పేరును కూడా కేసీఆర్ పరిశీలిస్తున్నట్లు వార్గలు వస్తున్నాయి. ఈ మేరకు వరంగల్ జిల్లాలోని ముఖ్యనేతలతో కేసీఆర్ చర్చిస్తున్నట్లు కూడా ప్రచారం సాగుతోంది. ఈ మేరకు సర్వే కూడా చేయించి నిర్ణయం తీసుకోవాలని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.