Vanteru Pratap Reddy : మెదక్(Medak) బీఆర్‌ఎస్(BRS) అభ్యర్థిగా ఒంటేరు ప్రతాప్‌రెడ్డిని(Vanteru Pratap Reddy) పోటీకి నిలపాలని ఆ పార్టీ అధినేత కేసీఆర్(KCR) నిర్ణయించినట్లు తెలుస్తోంది. నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డితో పాటు అనేక మంది పేర్లను పరీశీలించిన గులాబీ బాస్ ప్రతాప్ రెడ్డి వైపే మొగ్గు చూపినట్లు సమాచారం. కేసీఆర్ తో పాటు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు(Harish Rao) అసెంబ్లీ నియోజకవర్గాలు కూడా మెదక్ పార్లమెంట్ పరిధిలోనే ఉన్నాయి. గత మూడు సార్లు కూడా ఈ స్థానం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థులే విజయం సాధించారు. దీంతో మరో సారి ఈ సీటును దక్కించుకోవాలన్న లక్ష్యంతో సీఎం కేసీఆర్, హరీశ్ రావు ఉన్నారు.
ఇది కూడా చదవండి: Danam Nagender : టార్గెట్ దానం నాగేందర్.. యాక్షన్ మొదలుపెట్టిన బీఆర్ఎస్!
ఈ నేపథ్యంలో ప్రతాప్ రెడ్డి సరైన అభ్యర్థి అని వారు నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 2014 ఎన్నికల్లో టీడీపీ గజ్వేల్ అభ్యర్థిగా బరిలోకి దిగిన ప్రతాప్ రెడ్డి.. కేసీఆర్ కు గట్టి పోటీ ఇచ్చారు. ఆ తర్వాత కాంగ్రెస్ లో చేరి 2018 ఎన్నికల్లో కేసీఆర్ పై పోటీ చేశారు. ఆ తర్వాత బీఆర్ఎస్ లో చేరారు. గత ఎన్నికల్లో ప్రతాప్ రెడ్డి గజ్వేల్ నుంచి బీఆర్ఎస్ తరఫున పోటీ చేస్తారన్న ప్రచారం కూడా సాగింది.
కానీ కేసీఆర్ మరో సారి ఇక్కడి నుంచి పోటీ చేయడంతో ఆయనకు అవకాశం దక్కలేదు. తాజాగా ఎంపీ అభ్యర్థిగా ఆయనకు అవకాశం కల్పించారు కేసీఆర్. మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో మెదక్ మినహా మిగతా 6 అసెంబ్లీ సెగ్మెంట్లలో బీఆర్ఎస్ అభ్యర్థులే విజయం సాధించారు. దీంతో ఈ ఎంపీ సీటుపై గులాబీ జెండా మరోసారి ఎగరడం ఖాయమని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉంటే.. బీజేపీ(BJP) నుంచి మరో సారి ఆ పార్టీ ఫైర్ బ్రాండ్ రఘునందన్ రావు(Raghunandan Rao) బరిలోకి దిగుతున్నారు. కాంగ్రెస్ కూడా బలమైన అభ్యర్థి కోసం వెతుకుతోంది. ఇటీవల పార్టీలో చేరిన చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డిని బరిలోకి దించాలని హస్తం నేతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరో ఒకటి లేదా రెండు రోజుల్లో కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది.