Khammam Politics : ఖమ్మంలో పొంగులేటి Vs భట్టి.. ఎంపీ అభ్యర్థి పరిస్థితి ఏంటి?

ఖమ్మం ఎంపీ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డి ప్రచారానికి భట్టి విక్రమార్క దూరంగా ఉండడం జిల్లా పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది. తన సతీమణికి టికెట్ దక్కకపోవడంతో భట్టి అసంతృప్తికి గురవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.

New Update
Khammam Politics : ఖమ్మంలో పొంగులేటి Vs భట్టి.. ఎంపీ అభ్యర్థి పరిస్థితి ఏంటి?

Congress : ఖమ్మం(Khammam) కాంగ్రెస్‌లో విభేదాలు మళ్లీ బయటపడ్డాయి. పార్లమెంట్ స్థాయి సమావేశానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) దూరం కావడం జిల్లా పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా రామసహాయం రఘురాంరెడ్డిని ఎంపిక చేయడంపై భట్టి అసంతృప్తిగా ఉన్నట్లు ఈ వ్యవహారంతో మరో సారి స్పష్టమైంది. రామసహాయం నామినేషన్‌ కార్యక్రమానికి కూడా భట్టి విక్రమార్క హాజరుకాలేదు. ఖమ్మం ఎంపీగా తన సతీమణి మల్లు నందినిని పోటీకి దించాలని భట్టి విక్రమార్క భావించారు. కానీ మరో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నందినికి టికెట్ రాకుండా విశ్వప్రయత్నం చేశారన్నది భట్టి వర్గం ఆవేదన. ఈ క్రమంలోనే తన వియ్యంకుడు రామసహాయం రఘురాంరెడ్డికి టికెట్ దక్కేలా చక్రం తిప్పారని భట్టి అనుచరులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: Nalgonda Politics: నల్లగొండ కాంగ్రెస్ లో కొత్త లొల్లి.. ఆ చేరికలు చెల్లవన్న పీసీసీ!

భట్టి వర్గీయులు సైలెంట్:
ఈ నేపథ్యంలోనే తీవ్ర అసంతృప్తికి గురైన భట్టి వర్గీయులు సైలెంట్ అయిపోయారు. అయితే.. భవిష్యత్ లో రామసహాయం గెలుపు కోసం భట్టి వర్గం కృషి చేస్తుందా? లేదా? అన్నది జిల్లా పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది. రామ సహాయం తరఫున మంత్రులు పొంగులేటి, తుమ్మల మాత్రం ఇప్పటికే ప్రచారం ప్రారంభించారు. అయితే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Ponguleti Srinivas Reddy) మాత్రం భట్టి విక్రమార్క త్వరలోనే ప్రచారంలో పాల్గొంటారని చెబుతున్నారు.

జిల్లాలో తగ్గిన భట్టి ఆధిపత్యం:
గత ఎన్నికలకు ముందు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ పార్టీలో చేరారు. అప్పటివరకు భట్టి విక్రమార్క జిల్లా కాంగ్రెస్ లో కీలకంగా వ్యవహరించారు. కీలక నేతలు ఓటమి పాలవడం, పార్టీని వీడడంతో సీఎల్పీ నేతగా ఉన్న భట్టి అన్నీతానై వ్యవహరించారు. అయితే.. పొంగులేటి, తుమ్మల చేరికతో భట్టి ఆధిపత్యానికి అడ్డుకట్ట పడింది. ఎమ్మెల్యే టికెట్ల నుంచి మొదలుకుని, నేడు ఎంపీ టికెట్ వరకు అన్నింటిలోనూ పొంగులేటి చక్రం తిప్పుతూ వచ్చారు.

భట్టి సహకారం ఉంటుందా?
చివరికి తన సతీమణికి టికెట్ రాకుండా పొంగులేటి అడ్డుకోవడాన్ని భట్టి జీర్ణించుకోలేకపోతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే పొంగులేటి పట్టుబట్టి టికెట్ ఇప్పించుకున్న రామసహాయం రఘురాంరెడ్డికి భట్టి సహకారం ఏ మేరకు ఉంటుందన్న అంశం ఉత్కంఠగా మారింది. డిప్యూటీ సీఎంగా ఉన్న భట్టి సహాయ నిరాకరణ చేస్తే ఎంపీ అభ్యర్థికి ఇబ్బందులు తప్పవనే చర్చ జోరుగా సాగుతోంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు