Pawan Kalyan And His Wife Casted Vote: మంగళగిరిలో జనసేన అధినేత పవన్ కల్యాణ్, సతీమణి అన్నా లెజినోవా (Anna Lezhneva) పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. తెలుగు సంప్రదాయ చీరకట్టు, బొట్టుతో వచ్చిన పవన్ సతీమణి పోలింగ్ స్టేషన్ వద్ద స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. గతంలో పవన్ సతీమణి పబ్లిక్ గా బయటకు వచ్చిన సందర్భాలు చాలా తక్కువ. పవన్ ఎన్నికల ప్రచారం, ఇతర కార్యక్రమాల్లోనూ ఆమె ఎక్కడా కనిపించలేదు. దీంతో ఆమెను చూసేందుకు పవన్ అభిమానులు, ఓటర్లు ఆసక్తి చూపారు. పవన్ దంపతులు వచ్చారన్న విషయం తెలుసుకున్న అభిమానులు పోలింగ్ కేంద్రం వద్దకు భారీగా తరలివచ్చారు.
ఓ దశలో పోలింగ్ కేంద్రంలోకి చొచ్చుకుని వెళ్లేందుకు యత్నించగా వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఓటు వేసిన అనంతరం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. అన్ని పార్టీలు ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు సహకరించాలని కోరారు. పోలింగ్ కేంద్రాల వద్ద గుంపులుగా ఉండొద్దని అభిమానులకు సూచించారు పవన్.
అయితే.. గత క్రిస్మస్ సమయంలో అనాథాశ్రమంలో పిల్లలతో కలిసి వేడుకలు జరుపుకుని వార్తల్లో నిలిచారు అన్నా లెజ్నోవా. ఇందుకు సంబంధించిన ఫొటోలు బయటకు రావడంతో పవన్ ఫ్యాన్స్ ఖుషీ అయ్యారు. తమ అభిమాన హీరోలాగానే ఆయన సతీమణికి సైతం సేవాగుణం ఉందంటూ సోషల్ మీడియాలో సంతోషం వ్యక్తం చేశారు. దీంతో ఆ ఫొటోలు వైరల్ అయ్యాయి.
తీన్మార్ తో తొలి పరిచయం..
రష్యన్ పౌరురాలైన అన్నా లెజినోవా 2011లో తీన్మార్ సినిమా చిత్రీకరణ సమయంలో ఆమె పవన్ కల్యాణ్‌ను తొలిసారి కలిశారు. ఈ చిత్రంలో అన్నా లెజినోవా చిన్న పాత్రను పోషించారు. ఆ సినిమా చిత్రీకరణలో మొదలైన పవన్, అన్నా స్నేహం ప్రేమగా మారింది. అనంతరం కొన్ని రోజుల తర్వాత వీరు మతాంతర వివాహం చేసుకున్నారు. పవన్ కళ్యాణ్ హిందువు కాగా.. అన్నా లెజినోవా క్రిస్టియన్. స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద వీరు వివాహం చేసుకున్నారు.
వివాహం తర్వాత అన్నా లెజినోవా రష్యా సంప్రదాయాన్ని పూర్తిగా వీడారు. భారతీయ మహిళగా ఆమె మారిపోయారు. ఇక్కడి సంప్రదాయ వస్త్రధారణతో పాటు ఇక్కడి పద్ధతులను అలవాటు చేసుకున్నారు. ఓ వైపు క్రిస్టియన్ గా ఆ మతానికి చెందిన కార్యక్రమాలు, పండుగల్లో పాల్గొంటూనే.. పవన్ తో కలిసి అనేక పూజల్లో కనిపించి అందరినీ ఆశ్చర్య పరిచారు అన్నా.