Hyderabad : హైదరాబాద్ బీజేపీ(BJP) ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన కొంపెల్ల మాధవీలత(Kompella Madhavi Latha) నామినేషన్ దాఖలు చేశారు. హైదరాబాద్ ఎంపీ స్థానానికి ఆమె పేరును బీజేపీ ప్రకటించిన నాటి నుంచి.. తనదైన శైలిలో ప్రచారం చేస్తూ వార్తల్లో నిలిచారు మాధవీలత. అయితే.. ఆమె నామినేషన్ సందర్భంగా సమర్పించిన అఫిడవిట్ లో ఆస్తులకు సంబంధించిన అనేక ఆసక్తికర అంశాలు ఉన్నాయి. తన కుటుంబ ఆస్తుల విలువ రూ.221.40 కోట్లుగా పేర్కొన్నారు మాధవీలత. వాటిలో స్థిరాస్తుల విలువ రూ.55.92కోట్లు కాగా.. చరాస్తుల విలువ రూ.165.47కోట్లుగా ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Khammam: ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి RRR.. హీరో వెంకటేష్ కు దగ్గరి బంధువు.. ఎలాగో తెలుసా?
ఆమె పేరుతో విరించి లిమిటెడ్, వివో బయోటెక్‌లలో రూ.8.92కోట్ల విలువైన షేర్లు ఉన్నట్లు అఫిడవిట్ లో తెలిపారు. ఇక అన్‌లిస్టెడ్ కంపెనీలైన గజ్వేల్ డెవలపర్స్, పీకేఐ సొల్యూషన్స్, విరా సిస్టమ్స్‌లలో రూ.16.27కోట్ల షేర్లున్నాయి. ఇక ఆమె భర్త కొంపెల్ల విశ్వనాథ్ పేరుతో విరించి లిమిటెడ్, వివో బయోటెక్‌లలో 56.19కోట్ల విలువైన షేర్లు, అన్‌లిస్టెడ్ కంపెనీలైన గజ్వేల్ డెవలపర్స్, పీకేఐ సొల్యూషన్స్, విరా సిస్టమ్స్, శ్రీ శ్రీ రిసార్ట్స్లో రూ.29.56 కోట్ల షేర్లు ఉన్నాయి. ఇక తన చేతిలో రూ.20 వేల నగదు.. భర్త చేతిలో మరో రూ.20 వేలు ఉన్నట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు మాధవీలత. ఇక బ్యాంక్‌లో తన పేరు మీద 8,34,201 రూపాయలు, తన భర్త పేరు మీద రూ.33,33,614 ఉన్నట్లు వెల్లడించారు.
ఇక ఆమెకు 3.9 కిలోలు, భర్తకు 1.11కిలోల బంగారు ఆభరణాలు ఉన్నాయని అఫిడవిట్లో వెల్లడించారు. ఐతే సొంతంగా ఎలాంటి వ్యవసాయ భూములు, వాహనాలు లేవని అఫిడవిట్‌లో పేర్కొన్నారు మాధవీలత. ఇక షేక్‌పేట, కీసర, సికింద్రాబాద్, ఏపీ(Andhra Pradesh) లోని మొగల్తూరులలో వ్యవసాయేతర స్థలాలు, హిమాయత్‌నగర్‌లో వాణిజ్య స్థలం, మల్కాజ్‌గిరి, ఈస్ట్ మారేడ్‌పల్లి, షేక్‌పేట్ లో ఇళ్లు ఉన్నాయి. ఇక 27.03 కోట్ల అప్పులున్నాయి. ఆమెపై ఓ క్రిమినల్ కేసు(Criminal Case) కూడా ఉంది.