సీనియర్ జర్నలిస్ట్ రజత్ శర్మ నిర్వహించే 'ఆప్ కీ అదాలత్' కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (TS CM Revanth Reddy) అనేక అంశాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌పై (KCR) ప్రతీకారం తీర్చుకోవడం తాను ఇంకా ప్రారంభించనే లేదన్నారు. దీంతో ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో (Telangana Politics) హాట్ టాపిక్ గా మారాయి. తనను జైలుకు పంపించిన కేసీఆర్, ఆయన ఫ్యామిలీపై రేవంత్ ఎలా ప్రతీకారం తీర్చుకుంటారనే అంశంపై జోరుగా చర్చ సాగుతోంది. ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం, గొర్ల పంపిణీ స్కీమ్ తదితర అనేక విషయాలపై రేవంత్ ప్రభుత్వం విచారణ ప్రారంభించింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే అనేక మంది పోలీస్ అధికారులు జైలుకు వెళ్లారు. ఈ కేసులో కేసీఆర్ కుటుంబ సభ్యులు కూడా జైలుకు వెళ్లే అవకాశం ఉందంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. కాళేశ్వరం కేసు కూడా చివరికి కేసీఆర్ ఫ్యామిలీనే చుట్టుముట్టే అవకాశం ఉందన్న చర్చ కూడా ఉంది. ఈ కేసుల్లో వారు జైలుకు వెళ్తారా? రేవంత్ రెడ్డి టార్గెట్ అదేనా అన్నది తేలాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.
ఇది కూడా చదవండి: TS: రైతులను మోసం చేస్తే కఠిన చర్యలుంటాయి.. సీఎం రేవంత్ వార్నింగ్!
2014, 2018 ఎన్నికల్లో విజయం తర్వాత కేసీఆర్ భారీగా వలసలను ప్రోత్సహించారు. ఎమ్మెల్యేలను చేర్చుకోవడం, వివిధ పార్టీల శాసనసభా పక్షాలను విలీనం చేసుకోవడం ద్వారా టీడీపీ, కాంగ్రెస్ లను భారీగా దెబ్బకొట్టారు. 2018 తర్వాత కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా కోల్పోయే పరిస్థితిని తీసుకువచ్చారు. కేసీఆర్ ఆపరేషన్ తో.. ఆ పార్టీ ఎమ్మెల్యేల బలం సింగిల్ డిజిట్ కు పడిపోయింది. ఇంకా.. టీడీపీ నుంచి గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలను కూడా చేర్చుకుని.. ఆ పార్టీకి ఒక్క ఎమ్మెల్యే కూడా లేకుండా చేశారు కేసీఆర్. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ కు కూడా అదే పరిస్థితిని తీసుకువచ్చి.. కోలుకోలేని దెబ్బ కొట్టాలన్నది రేవంత్ స్కెచ్ అన్న చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా సాగుతోంది.
ఇటీవలి ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి 39 మంది ఎమ్మెల్యేలు గెలుపొందగా.. అందులో ముగ్గురు ఇప్పటికే కాంగ్రెస్ గూటికి చేరిపోయారు. బీఆర్ఎస్ నుంచి గెలిచిన వారిలో అత్యధిక మంది గ్రేటర్ పరిధిలోని వారే. ఎంపీ ఎన్నికల నోటిఫికేషన్ మరో ఐదు రోజుల్లో విడుదల కానున్న నేపథ్యంలో.. గ్రేటర్ పరిధిలో బలం పెంచుకోవడం కోసం అక్కడి ఎమ్మెల్యేలను చేర్చుకోవాలని కాంగ్రెస్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ రెండు మూడు రోజుల్లో పదికి పైగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హస్తం గూటికి చేరే అవకాశం ఉందని సమాచారం. ఎన్నికల తర్వాత కేసీఆర్ ను రేవంత్ కొట్టబోయే తొలి రాజకీయ దెబ్బ ఇదేనన్న చర్చ సాగుతోంది.
దశల వారీగా.. మూడింట రెండు వంతుల ఎమ్మెల్యేలను చేర్చుకుని.. బీఆర్ఎస్ శాసనసభా పక్షాన్ని కాంగ్రెస్ లో విలీనం చేసుకోవడమే రేవంత్ బిగ్ స్కెచ్ అన్న చర్చ గాంధీభవన్ లో సాగుతోంది. ఇలా చేయడం ద్వారా ఆయా ఎమ్మెల్యేలపై అనర్హత వేటు కూడా పడే అవకాశం ఉండదు. గతంలో ఏ వ్యూహంతో అయితే బీఆర్ఎస్ ప్రతిపక్షాలను దెబ్బ కొట్టిందో.. అదే వ్యూహంతో బీఆర్ఎస్ ను రేవంత్ దెబ్బ కొట్టనున్నారా? అన్నది మరికొన్ని రోజుల్లేనే తేలే అవకాశం ఉంది.