Rahul Gandhi: తుక్కుగూడ జనజాతర సభలో పాల్గొన్న ఎంపీ రాహుల్ గాంధీ 'న్యాయపత్రం' పేరుతో కాంగ్రెస్ లోక్ సభ మేనిఫెస్టోను విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఎన్నికల సమయంలో ఆరు గ్యారెంటీలతో ఇక్కడే మేనిఫెస్టో విడుదల చేశామని.. ఈసారి కూడా ఇక్కడి నుంచే లోక్ సభ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేస్తున్నామని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రూ.500 లకే గ్యాస్ సిలిండర్, మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత కరెంట్ వంటి పథకాలను అమలు చేశామని... త్వరలో దేశవ్యాప్తంగా ఈ పథకాలను అమలు చేస్తామని అన్నారు. తెలంగాణలో అధికారంలోకి రాగానే 30 వేల ఉద్యోగాలు ఇచ్చామని.. త్వరలో మరో 50 వేల ఉద్యోగాలు ఇవ్వనున్నట్లు తెలిపారు.
దేశంలో నిరుద్యోగ సమస్య పెరిగిందని.. కాంగ్రెస్ పార్టీ దేశంలో అధికారంలోకి రాగానే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని అన్నారు. రూ.1 లక్ష వచ్చేలా ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. నారీన్యాయ్ పథకం కింద ప్రతీ పేద మహిళకు ఏడాదికి రూ. లక్ష ఆర్థిక సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. నేరుగా ఆ నగదు వారి ఖాతాల్లో పడుతుందని అన్నారు. రాబోయే రోజుల్లో రూ. లక్షకు తక్కువ ఆదాయం ఉండే ఇల్లు ఉండదని అన్నారు.
దేశంలో ప్రతి రోజు 30 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అన్నారు. ధనవంతులకు ప్రధాని మోడీ రూ.16 లక్షల కోట్ల ఋణం మాఫీ చేశారని ఫైర్ అయ్యారు. రైతులకు మాత్రం ప్రధాని మోడీ ఒక్క రూపాయి కూడా మాఫీ చేయలేదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతులకు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. రైతులకు మద్దతు ధర కోసం ప్రత్యేక చట్టం తీసుకొస్తామని అన్నారు. స్వామినాథన్ ఫార్ములా ప్రకారం మద్దతు ధర ఇస్తామని పేర్కొన్నారు.