T-Congress: కాంగ్రెస్ పార్టీలో చేరికల కుంపటి.. నేతల మధ్య పోరు

New Update
Telangana Congress: పార్లమెంట్ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ కమిటీ భేటీ

MLA Megha Reddy: ఎంపీ ఎన్నికల వేళ కాంగ్రెస్‌లో కొట్లాటలు అధిష్టానానికి తలనొప్పిగా మారాయి. మొన్న వరంగల్‌, నిన్న గద్వాల, తాజాగా వనపర్తిలో హస్తం నేతలు కుస్తీకి దిగారు. ఎంపీ ఎన్నికల్లో 14సీట్లు గెలుస్తామని కాంగ్రెస్‌పార్టీ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నా.. క్షేత్రస్థాయిలో పరిస్థితులు మాత్రం ఆ పార్టీకి ఆందోళన కలిగిస్తున్నాయి. బీఆర్‌ఎస్‌ నేతలను పార్టీలోకి తీసుకుని టికెట్ ఇచ్చిన నియోజకవర్గాల్లో సొంత క్యాడర్ నుంచే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మరోవైపు ప్రతిపక్ష బీఆర్ఎస్‌కు అనుకూలంగా సర్వేల ఫలితాలు రావడం కాంగ్రెస్‌ను మరింత కలవరపెడుతోంది. తాజాగా వనపర్తి జిల్లా కాంగ్రెస్‌ పార్టీలో చేరికల చిచ్చు రాజుకుంది.

బీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి కాంగ్రెస్‌లో పలువురు చేరడంతో ఆ పార్టీ సీనియర్ నేత చిన్నారెడ్డి వర్గీయులు హల్‌చల్‌ చేశారు. చేరికలను నిరసిస్తూ తాడిపర్తి గ్రామానికి చెందిన చిన్నారెడ్డి వర్గీయుడు, మాజీ సర్పంచ్‌ గణేష్‌గౌడ్ అనుచరులు ఎమ్మెల్యే మేఘారెడ్డి ఇంటి ముందు ఆందోళనకు దిగారు. గణేష్ గౌడ్ తన ఒంటిపై పెట్రోల్‌ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టారు.

వనపర్తిలో ఉద్రిక్తత..

వనపర్తి ఎమ్మెల్యే మేఘా రెడ్డి ఇంటి ముందు గురువారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గోపాల్ పేట మండలానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఇద్దరు నాయకులను పార్టీలో చేర్చుకునే విషయంపై మండలానికి చెందిన కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యేతో సంప్రదింపులు జరుపగా.. ఎంపీ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ ఎస్ నాయకులను పార్టీలోకి తీసుకోవాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలియడంతో గోపాల్ పేట మండల పార్టీ అధ్యక్షుడు గుంట్రాతి గణేష్ గౌడ్, మరి కొంతమంది ఎమ్మెల్యే ఇంటి వద్దకు వెళ్లి బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మమ్మల్ని ఇబ్బందులకు గురి చేశారు.

కేసులు పెట్టారు. ఇప్పుడు అధికారంలోకి రాగానే వాళ్లు పార్టీలోకి వస్తే మా పరిస్థితి ఏంటి..!? వాళ్లను పార్టీలోకి చేర్చుకోవద్దు అంటూ వాదనకు దిగారు. ఈ నేపథ్యంలో గణేష్ గౌడ్ తన ఒంటిపై పెట్రోల్ పోసుకొని అగ్గిపెట్టె తెచ్చి నన్ను అంటు పెట్టండి అంటూ ఎమ్మెల్యే మెఘా రెడ్డికి అగ్గిపెట్టె ఇవ్వబోయాడు. పోలీసులు వెంటనే స్పందించి గణేష్ గౌడును దూరం తప్పించి అగ్గిపెట్టె తీసేసుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణుల మధ్య కొంతసేపు తోపులాట జరిగింది. పోలీసులు కలుగజేసుకొని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

Advertisment
తాజా కథనాలు