Etela Rajender Comments on Cm Revanth Reddy: లోక్‌సభ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ రాష్ట్రంలో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఇటీవల బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన కడియం శ్రీహరి ఆయన కుమార్తెకు వరంగల్ ఎంపీ టికెట్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనపై బీఆర్‌ఎస్ నేతలతో పాటు బీజేపీ నేతలు సైతం విరుచుకుపడుతున్నారు. గతంలో కడియం శ్రీహరి దళితుడే కాదని ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి అన్నారని గుర్తుచేస్తున్నారు.
దళితుడు కాని వ్యక్తిని పార్టీలోకి ఎలా తీసుకున్నారని, ఆయన కుమార్తెకు వరంగల్ టికెట్ ఎలా కేటాయించారని బీజేపీ మల్కాజ్‌గిరి ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ మండిపడ్డారు. అలాగే కడియం తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా పార్టీలో ఎలా చేర్చుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం నాడు తుక్కుగూడ సభ వేదికగా రాజీనామా చేయకుండా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే వారిపై వేటు వేస్తామని రాహుల్ గాంధీ ప్రకటించారని.. మరి పార్టీ మారిన ఎంత మంది తమ పదవులకు రాజీనామా చేశారని.. వారిని ఎందుకు వదిలేశారని ప్రశ్నించారు.
Also Read: ఉపఎన్నిక.. ఎమ్మెల్యే అభ్యర్థిని ప్రకటించిన కేసీఆర్
మల్కాజ్‌గిరికి ఈటలకు ఏం సంబంధమని రేవంత్ అంటున్నారని.. మరి రేవంత్‌కు మల్కాజ్‌గిరికి ఏం సంబంధముందని ప్రశ్నించారు. రేవంత్ ఎంపీగా గెలిచిన స్థానం కాబట్టి బయట రెండు సీట్లు ఓడిపోయినా పర్లేదు.. మల్కాజ్‌గిరిలో కాంగ్రెస్ గెలవాలని డబ్బులు ఖర్చుపెడుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్ లాగే.. రేవంత్ కూడా నాయకులు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, వ్యాపారులను కొంటున్నారని.. లేదంటే వ్యాపారాలు మూసివేస్తామని బెదిరిస్తున్నారని మండిపడ్డారు.
ఇప్పుడు మీ మాట చెల్లొచ్చు కానీ.. సమయం వచ్చినప్పుడు ప్రజలు కర్రుకాల్చి వాత పెడతారని హెచ్చరించారు. ఫోన్ ట్యాపింగ్‌లో మొదటి బాధితుడిని తానేనని.. నా కుటుంబ సభ్యులు, డ్రైవర్, వంట మనుషుల నుంచి ప్రతి ఒక్కరి ఫోన్ ట్యాప్ చేశారన్నారు. దానివల్లే తాను ప్రస్తుతం ఈ పరిస్థితిలో ఉన్నానని ఈటల వెల్లడించారు. ఫోన్ ట్యాపింగ్ వల్ల ఎన్నో కాపురాలు
కూలిపోయాయని సంచలన వ్యాఖ్యలు చేశారు.