Congress Second List - Lok Sabha Elections 2024: లోక్ సభ ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల రెండో జాబితాను కాంగ్రెస్ హైకమాండ్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 43 మంది అభ్యర్థులతో రెండో జాబితాను ప్రకటించారు కేసీ వేణుగోపాల్. అసోం, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలకు చెందిన ఎంపీ అభ్యర్థులను కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. కాంగ్రెస్ విడుదల చేసిన రెండో జాబితాలో అస్సాం మాజీ సీఎం తరుణ్ గొగోయ్ కుమారుడు గౌరవ్ గొగోయ్, అశోక్ గెహ్లాట్ తనయుడు వైభవ్ గెహ్లాట్, కమల్ నాథ్ కొడుకు నకుల్ నాథ్‌లకు చోటు దక్కింది.
ALSO READ: కొత్త రేషన్ కార్డులపై కీలక ప్రకటన
* జోర్హాట్ నుంచి ఎంపీగా గౌరవ్ గొగోయ్
* ఛింద్వారా ఎంపీ అభ్యర్థిగా నకుల్ నాథ్,
* రాజస్థాన్ జలోర్ ఎంపీ అభ్యర్థిగా వైభవ్ గెహ్లాట్,
* బీజేపీ టికెట్ నిరాకరించిన ఎంపీ రాహుల్ కశ్వాన్‌ను కాంగ్రెస్ రాజస్థాన్‌లోని చురు నుంచి బరిలో దింపింది.
* మరోవైపు కమల్‌నాథ్, అశోక్ గెహ్లాట్‌లు లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేనట్టు తెలుస్తోంది.
39 మందితో తొలి జాబితా..
దేశంలో బీజేపీని గద్దె దించి మరోసారి అధికారంలోకి రావాలని వ్యూహాలు రచిస్తోంది కాంగ్రెస్. ఈ క్రమంలో రానున్న లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులపై కసరత్తు చేస్తోంది. ఇప్పటికే బీజేపీ 195 మందితో తొలి జాబితాను ప్రకటించిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ చర్చలు అనంతరం మొదటగా ఏకగ్రీవంగా ఎన్నికైన అభ్యర్థులను ప్రకటించాలని ఆ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఇటీవల ఛత్తీస్ గఢ్, కేరళ, కర్ణాటక, తెలంగాణ, మేఘాలయ, సిక్కిం, త్రిపుర, లక్షద్వీప్ రాష్ట్రాల్లో నుంచి పోటీ చేసే 39 మంది అభ్యర్థులను తొలి జాబితాలో ప్రకటించింది. అయితే ఇండియా కూటమిలో భాగంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ కూటమిలోని ఇతర పార్టీలతో చర్చించి మిగతా అభ్యర్థులను త్వరలో ప్రకటించనుంది.
రాహుల్ గాంధీ పోటీ అక్కడి నుంచే..
లోక్ సభ ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల తొలి జాబితాను కాంగ్రెస్ ప్రకటించింది. మొత్తం 39 మందితో ఫస్ట్ లిస్టును విడుదల చేసింది. ఈ జాబితాలో 15 స్థానాల్లో జనరల్ క్యాటగిరి అభ్యర్థులు.. మిగితా 24 స్థానాల్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ అభ్యర్థులకు టికెట్ కేటాయించింది. అయితే.. మొదటి జాబితాలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పేరు కూడా ఉంది. ఆయన మరోసారి వయనాడ్ నుంచి పోటీ చేయనున్నారు.