మణిపూర్ పై అదే రభస.. పార్లమెంట్‌లో వాయిదాల పర్వం

మణిపూర్‌ అంశంపై పార్లమెంట్‌లో రగడ కొనసాగుతూనే ఉంది. ముగ్గురు మహిళలను వివస్త్రలుగా చేసి ఊరేగించి..అందులో ఒకర్ని అత్యాచారం చేసిన ఘటనపై అధికార బీజేపీ సమాధానం చెప్పాలని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తోంది. ప్రభుత్వంపై తామిచ్చిన అవిశ్వాస తీర్మానంపై సాధ్యమైనంత త్వరగా చర్చ చేబట్టాలని విపక్ష ఎంపీలు కోరుతుండగా..సభ పలుమార్లు వాయిదా పడింది.

మణిపూర్ పై అదే రభస.. పార్లమెంట్‌లో వాయిదాల పర్వం
New Update

మణిపూర్ అంశంపై మంగళవారం కూడా పార్లమెంట్ లో ప్రతిపక్షాలు సభలను స్తంభింపజేశాయి. లోక్ సభ ప్రారంభమైన 15 నిముషాలకే వీరి నినాదాల ఫలితంగా మధ్యాహ్నం 2 గంటలవరకు వాయిదా పడింది. ఉదయం 11 గంటలకు స్పీకర్ ఓంబిర్లా ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని చేపట్టడానికి యత్నిస్తుండగానే మణిపూర్ అంశంపై విపక్ష ఎంపీలు నినాదాలు చేయడం ప్రారంభించారు. మంగళవారానికి సభలో సవరించిన లిస్టెడ్ బిజినెస్ ప్రకారం ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లును హోమ్ మంత్రి అమిత్ షా ప్రతిపాదించవలసి ఉంది. దీనిపై ఈ శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ ఓ ప్రకటన చేయవలసి ఉంది కూడా. . ఈ ఆర్డినెన్స్ స్థానే బిల్లును ఎందుకు తేవలసి ఉందో వివరించాల్సి ఉంది. అయితే మణిపూర్ పరిస్థితిపై ప్రధాని మోదీ సభకు వచ్చి ప్రకటన చేయాలన్న తమ డిమాండును విపక్ష ఎంపీలు పునరుద్ఘాటించారు. ప్రభుత్వంపై తామిచ్చిన అవిశ్వాస తీర్మానంపై సాధ్యమైనంత త్వరగా చర్చ చేబట్టాలని కూడా వారు కోరారు. స్పీకర్ పలు మార్లు చేసిన విజ్ఞప్తిని పట్టించుకోకుండా వారు రభసను కొనసాగించడంతో ఆయన సభను మధ్యాహ్నం 2 గంటలవరకు వాయిదా వేశారు.

రాజ్యసభలోనూ అదే తంతు

మణిపూర్ అంశం రాజ్యసభను కూడా కుదిపివేసింది. 267 కింద దీనిపై వెంటనే చర్చ జరపాలని విపక్ష ఎంపీలు డిమాండ్ చేశారు. అలాగే కీలకమైన ఈ అంశంపై మోదీ దీనిపై ప్రకటన చేయాలని కోరారు. లిస్ట్ చేసిన అంశాలను పక్కన బెట్టి మణిపూర్ పరిస్థితిపై చర్చ చేబట్టాలంటూ తాము ఇది వరకే వాయిదా తీర్మానం నోటీసులిచ్చామని చెప్పారు. ప్రశ్నోత్తరాల కార్యక్రమం సందర్భంలో వారు 'మణిపూర్', 'మణిపూర్' అంటూ నినాదాలు చేశారు. దీంతో చైర్మన్ జగదీప్ ధన్ కర్ సభను మధ్యాహ్నం 12 గంటలవరకు వాయిదా వేశారు. సభ తిరిగి సమావేశమైన తరువాత కూడా ఇదే ధోరణి కొనసాగింది. పార్లమెంటు నిబంధన 267 కింద, చర్చ, ఓటింగ్ చేపట్టాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. దీనికింద విపక్షాలు ఇచ్చిన 60 నోటీసులను తిరస్కరిస్తున్నానని ఛైర్మన్ ప్రకటించారు, అలాగే 176 రూల్ కింద స్వల్పకాలిక చర్చకు మాత్రమే అంగీకరిస్తామని ప్రకటించారు. దీనిపైన ప్రతిపక్ష ఎంపీలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఇక ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లు రాజ్యాంగ విరుద్ధమైనదని ఉభయసభల్లోనూ విపక్ష సభ్యులు ఖండించారు. దీన్ని తాము వ్యతిరేకిస్తామన్నారు.

అవిశ్వాస తీర్మానంపై మూడు రోజులపాటు చర్చ

విపక్షాలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానం మీద ఈ నెల 8, 9, 10 తేదీల్లో చర్చ జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. 10న లోక్ సభలో జరిగే చర్చకు ప్రధాని మోదీ సమాధానమివ్వనున్నట్టు తెలుస్తోంది. ఆయన ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తున్న విపక్ష కూటమి సభ్యుల స్పందన దీనిపై ఇంకా తెలియాల్సి ఉంది.

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి