Ratan Tata : రతన్ టాటా మూగ జీవాలను అమితంగా ఇష్టపడేవారు. ముఖ్యంగా ఆయనకు పెంపుడు కుక్కలంటే మహా ఇష్టం. చిన్నప్పటి నుంచి ఆయన పెంపుడు కుక్కలతో ఎక్కువ సమయం గడిపేవారు. కొన్ని ఇంటర్వ్యూల్లో నా పెంపుడు కుక్కలే నా పార్ట్‌నర్స్ అని కూడా చెప్పారంటే ఎంత ఇష్టమో తెలుస్తోంది. రతన్ టాటా శునకాలపై ప్రేమతో పెంపుడు కుక్కలకు తోడు టాటా ప్రధాన కార్యాలయమైన ముంబై హౌస్‌లో వందల సంఖ్యలో వీధి కుక్కలను సైతం పోషిస్తున్నారు. హోటల్ నుంచి సెపరేట్ గా ఫుడ్ తెప్పిస్తారు. వాటి సంరక్షణ చూసుకోవడానికి ప్రత్యేక సిబ్బంది కూడా ఉన్నారు. రతన్ టాటాకు గోవాలో ఓ శునకం కనిపిస్తే దానిని తీసుకొచ్చి ఆయన ఇష్టంగా పెంచుకున్నారు. ఆ శునకానికి టాటా గోవా అని పేరు కూడా పెట్టారు. రతన్ టాటా ఏమైనా సమావేశాలకు వెళ్తే ఆ పెంపుడు కుక్క ఆయనతో కూడా వెళ్లేది.
కింగ్ చార్లెస్ మీటింగ్ వాయిదా..
ఓ సందర్భంలో రతన్ టాటా శునకాలపై ఉన్న ప్రేమతో కింగ్ చార్లెస్‌ను కలిసే కార్యక్రమాన్ని సైతం వాయిదా వేసుకున్నారట. వ్యాపారాన్ని చూసుకుంటూనే జంతువులపై ప్రేమను చాటుకున్నందుకు 2018లో రతన్ టాటాకు జీవితకాల సాఫల్య పురస్కారాన్ని అందించారు. తన పెంపుడు కుక్క ఒకటి అనారోగ్యంతో ఉందని, అందుకే దానిని వదిలి అవార్డు తీసుకోవడానికి కూడా రతన్‌టాటా వెళ్లలేదని ఆయన సన్నిహితులు చెప్పారు. ఈ విషయం తెలిసి కింగ్ చార్లెస్ సైతం రతన్‌టాటాను అభినందించారట. శునకాలపై ఇష్టంతో ఈ ఏడాది జూలైలో రతన్ టాటా ముంబైలో చిన్న జంతు ఆసుపత్రిని కూడా ప్రారంభించారు. ఆసుపత్రిలో అత్యాధునిక సాంకేతిక సౌకర్యాలు ఉన్నాయి. సంక్లిష్ట వ్యాధులకు చికిత్స అందేలా నిపుణులైన వైద్యులు ఇక్కడ సేవలందిస్తున్నారు.
పెంపుడు కుక్కకు టాటా గోవా పేరు..
రతన్ టాటా అస్తమయం తర్వాత ఆయన అపురూపంగా చూసుకునే టాటా గోవా అనే పెంపుడు కుక్క ధీనంగా కూర్చొని కనిపించింది. దీంతో పోలీసులు దానిని టాటా భౌతికకాయం దగ్గరకు తీసుకెళ్లారు. రతన్ టాటా భౌతికకాయాన్ని చూస్తూ ఆ శునకం ధీనంగా కూర్చుంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Also Read : అల్లు అర్జున్ పై సీఎం చంద్రబాబు ప్రశంసల వర్షం.. వైరల్ అవుతున్న వీడియో!