Y Chromosome: పురుషుల మనుగడకే ముప్పు? 'Y' క్రోమోజోమ్ కథేంటి!

పురుషులకు మాత్రమే ఉండే 'Y' క్రోమోజోమ్ క్రమంగా అదృశ్యమవుతోందని, అలాగే వీర్యకణాల సంఖ్య, టెస్టోస్టెరాన్ స్థాయిలు గణనీయంగా తగ్గుతున్నాయని అనేక అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. అసలు ఈ 'Y' క్రోమోజోమ్ కథేంటి! తెలుసుకోవడానికి ఆర్టికల్ చదవండి.

New Update
y chromosome disappearing sperm counts

y chromosome disappearing sperm counts

Y Chromosome: ప్రస్తుతం  పురుషుల ఆరోగ్యంపై ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పురుషులకు మాత్రమే ఉండే 'Y' క్రోమోజోమ్ క్రమంగా అదృశ్యమవుతోందని, అలాగే వీర్యకణాల సంఖ్య, టెస్టోస్టెరాన్ స్థాయిలు గణనీయంగా తగ్గుతున్నాయని అనేక అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఈ మార్పులు పురుషుల ఆరోగ్యంపై, సంతానోత్పత్తిపై, చివరకు మానవజాతి భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతాయో అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

'Y' క్రోమోజోమ్ అదృశ్యం 

 'Y' క్రోమోజోమ్ అనేది  పురుషుడి లింగాన్ని నిర్ణయిస్తుంది. అలాగే  పురుషుల అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుంది. అయితే  తాజా పరిశోధకుల ప్రకారం.. ఈ  'Y' క్రోమోజోమ్  దాని జన్యు పదార్థాన్ని కాలక్రమేణా కోల్పోతోంది. మానవులు ప్లాటిపస్ వంటి జంతువుల నుంచి వేరుపడిన తర్వాత..  సుమారు 166 మిలియన్ సంవత్సరాలు నుంచి  'Y' క్రోమోజోమ్ ప్రతి మిలియన్ సంవత్సరాలకు ఐదు జన్యువులను కోల్పోయిందని శాస్త్రవేత్తల అంచనా. ఈ వేగం ఇలాగే కొనసాగితే, మరో 11 మిలియన్ సంవత్సరాలలో ఇది పూర్తిగా కనుమరుగయ్యే అవకాశం ఉందని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి.

అయితే గతంలో జపనీస్ స్పైనీ ఎలుక ,  కొన్ని మోల్ వోల్స్ వంటి జాతులు 'Y' క్రోమోజోమ్ లేకుండానే సంతానోత్పత్తి చేస్తున్నట్లు కనుగొనబడింది. ఈ పరిణామం భవిష్యత్తులో  ప్రత్యామ్నాయ మార్గం  దొరకవచ్చని సూచిస్తుంది.

వయసుతో పాటు 'Y' క్రోమోజోమ్ నష్టం

 చాలా మంది పురుషులు  వయస్సు పెరిగే కొద్దీ కొన్ని కణాలలో 'Y' క్రోమోజోమ్ కోల్పోతున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. దీనిని "మొజాయిక్ లాస్ ఆఫ్ Y (LOY)" అని పిలుస్తారు. 50 సంవత్సరాల వయస్సు నుంచి  ఎముక మజ్జలోని(bone marrow)  స్టెమ్ సెల్స్ అసాధారణంగా విభజన చెందడం మొదలవుతుంది. దీని వల్ల  'Y' క్రోమోజోమ్ లేని తెల్ల రక్త కణాలు ఏర్పడతాయి. ఇలా  80 సంవత్సరాల నాటికి, 40% మంది పురుషులలో వారి రక్త కణాలలో  'Y' క్రోమోజోమ్ కోల్పోతున్నట్లు కనిపిస్తుంది.

'Y' క్రోమోజోమ్ ప్రభావం 

గుండెజబ్బుల ప్రమాదం 

1,153 మంది వృద్ధ స్వీడిష్ పురుషులపై జరిపిన అధ్యయనంలో.. 'Y' క్రోమోజోమ్ కోల్పోయిన వారికి ఆయుర్దాయం(Life expectancy)  తక్కువగా ఉందని, గుండె జబ్బులు,  క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని తేలింది. అలాగే   అల్జీమర్స్ వచ్చే అవకాశం ఏడు రెట్లు ఎక్కువగా ఉందని కనుగొన్నారు.

రోగనిరోధక శక్తి,  క్యాన్సర్‌

'Y' క్రోమోజోమ్‌లో ఉన్న UTY అనే జన్యువు రోగనిరోధక వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. కావున ఈ జన్యువు లోపించినప్పుడు, కొన్ని రోగనిరోధక కణాలు తక్కువ ప్రభావవంతంగా మారతాయి. అలాగే  మరికొన్ని కణాలు మచ్చ కణజాలాన్ని( scar tissue) అధికంగా  ఉత్పత్తి చేస్తాయి. మచ్చ కణజాలం అంటే గాయం అయిన తర్వాత చర్మాన్ని సాధారణంగా మార్చే టిస్యూ.  అలాగే 'Y' క్రోమోజోమ్ కోల్పోయిన వారి ఎలుకలలో క్యాన్సర్  ట్యూమర్లు రెండు రెట్లు వేగంగా పెరిగినట్లు గుర్తించారు. అంతేకాదు 'Y' క్రోమోజోమ్ లోపం కారణంగా వచ్చిన మూత్రాశయ క్యాన్సర్‌లు మరింత ప్రమాదకరమైనవిగా గుర్తించినప్పటికీ, కొన్ని చికిత్సలకు బాగా స్పందిస్తున్నాయని కనుగొన్నారు. 

'Y' క్రోమోజోమ్‌ తగ్గుదలకు కారణాలు 

2017 లో  జరిపిన ఓ అధ్యయనం ప్రకారం.. పురుషులలో 'Y' క్రోమోజోమ్ అదృశ్యంతో పాటు, పారిశ్రామిక దేశాలలోని పురుషులలో వీర్యకణాల సంఖ్య గత నాలుగు దశాబ్దాలుగా గణనీయంగా పడిపోయిందని  వెల్లడైంది. అలాగే వీర్యకణాల ఉత్పత్తికి అవసరమయ్యే టెస్టోస్టెరాన్ హార్మోన్ స్థాయిలు కూడా తగ్గుతున్నాయని పరిశోధకులు గుర్తించారు. ఊబకాయం, వ్యాయామం లేకపోవడం, తీవ్రమైన ఒత్తిడి,  పర్యావరణ కాలుష్య కారకాలకు గురికావడం వంటివి వీర్యకణాలు,  టెస్టోస్టెరాన్   తగ్గుదలకు ప్రధాన కారణాలుగా పేర్కొన్నారు.

ఆరోగ్యకరమైన జీవనశైలి

సిగరెట్ తాగడం, వాయు కాలుష్యం,  విషపూరిత రసాయనాలకు గురికావడం వంటివి 'Y' క్రోమోజోమ్ నష్టాన్ని వేగవంతం చేస్తాయి. ధూమపానం మానేయడం, కలుషిత వాతావరణాల నుంచి దూరంగా ఉండడం, క్రమం తప్పకుండా వ్యాయామం, పోషకాహారం తీసుకోవడం ద్వారా  'Y' క్రోమోజోమ్ ఉన్న కణాలను రక్షించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. 

'Y' క్రోమోజోమ్ అదృశ్యం భవిష్యత్తులో తీవ్ర పరిణామాలను కలిగి ఉండవచ్చని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నప్పటికీ, ప్రతి  పరిణామం ప్రత్యామ్నాయ మార్గాలను కనుగొంటుందని గుర్తుంచుకోవాలి. ప్రస్తుతానికి, ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడం ద్వారా  పురుషులు తమ ఆరోగ్యాన్ని రక్షించుకోవచ్చు.

Also Read: Viral News: పదిహేనేళ్ల సంసారంలో ఊహించని ట్విస్ట్ ! చంపుతుందనే భయంతో లవర్ తో భార్యకు పెళ్లి!

Advertisment
Advertisment
తాజా కథనాలు