/rtv/media/media_files/2025/07/10/cancer-2025-07-10-19-17-07.jpg)
Cancer
CANCER RISK: భారతదేశంలో క్యాన్సర్ అతి పెద్ద ఆరోగ్య సమస్యగా మారింది. గత కొన్ని సంవత్సరాలుగా క్యాన్సర్ తో చనిపోతున్న వారి సంఖ్య వేగంగా పెరుగుతోంది. ప్రతి ఏడాది లక్షల్లో మంది క్యాన్సర్ కి బలవుతున్నారు. అయితే ఇటీవలే భారతదేశంలో క్యాన్సర్ కేసులకు సంబంధించి నిర్వహించిన ఓ పరిశోధనలో షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి.
2015-2019 మధ్య కాలానికి సంబంధించి 43 పాపులేషన్-బేస్డ్ క్యాన్సర్ రిజిస్ట్రీ (PBCRs) నివేదికల నుంచి సేకరించిన డేటా ప్రకారం కొన్ని ముఖ్యమైన విషయాలు బయటపడ్డాయి. ఈ డేటా ప్రకారం భారతదేశంలో ప్రతి 100 మందిలో 11 మందికి జీవితంలో ఏదో ఒక సమయంలో క్యాన్సర్ వచ్చే అవకాశం ఉన్నట్లు తేలింది.
2024లో భారతదేశంలో సుమారు 15.6 లక్షల కొత్త క్యాన్సర్ కేసులు నమోదు కాగా, 8.74 లక్షల మంది ఈ వ్యాధి కారణంగా మరణించారు. ఈ రిజిస్ట్రీలు 23 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని జనాభాలో కేవలం 10% నుంచి 18% మందిని మాత్రమే కవర్ చేస్తున్నప్పటికీ, క్యాన్సర్ వ్యాప్తి, మరణాలు గురించి షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి.
ఈ డేటా ప్రకారం మహిళలు ఎక్కువగా క్యాన్సర్ బారిన పడుతున్నట్లు తెలిసింది. అయినప్పటికీ వారిలో మరణాల సంఖ్య తక్కువని నివేదికలు చెబుతున్నాయి. మహిళల్లో క్యాన్సర్ కేసులు 51.1% నమోదవగా.. మరణాలు రేటు 45% మాత్రమే. పురుషులతో పోలిస్తే ఇది చాలా తక్కువ.
ICMRలోని నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ ఇన్ఫర్మాటిక్స్ అండ్ రీసెర్చ్ డైరెక్టర్ డాక్టర్ ప్రశాంత్ మాథుర్ ప్రకారం, మహిళల్లో వచ్చే క్యాన్సర్లలో సుమారు 40% రొమ్ము క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్లు. ఈ రెండింటినీ చాలా తొందరగా గుర్తించవచ్చు. దీనివల్ల చికిత్స సులభమై, ఫలితాలు మెరుగ్గా ఉంటాయని తెలిపారు.
పురుషుల్లో ఊపిరితిత్తులు, కడుపు క్యాన్సర్ల ప్రభావం ఎక్కువ
AIIMS ఆంకాలజిస్ట్ డాక్టర్ అభిషేక్ శంకర్ ప్రకారం, పురుషుల్లో ఎక్కువగా ఊపిరితిత్తులు, కడుపు క్యాన్సర్లు వస్తాయి. వీటిని ప్రారంభ దశలోనే గుర్తించడం కష్టం. చాలావరకు చివరి దశల్లోనే బయటపడతాయి. ఈ ఆలస్యం వల్ల పురుషుల్లో మరణాల రేటు ఎక్కువగా ఉందని తేలింది.
ఈశాన్య భారతదేశంలో అత్యధిక క్యాన్సర్ రేట్లు
PBCRs నుంచి సేకరించిన నివేదికల ప్రకారం.. ఈశాన్య రాష్ట్రాల్లో క్యాన్సర్ కేసులు ఎక్కువగా ఉన్నాయని తెలిసింది. ముఖ్యంగా మహిళల్లో గర్భాశయ, ఊపిరితిత్తులు, నోటి క్యాన్సర్లు ఎక్కువని తేలింది. దీనికి కొన్ని సామాజిక-సాంస్కృతిక కారణాలు ఉన్నట్లు పరిశోధకులు కనుగొన్నారు.
పురుషులు, మహిళలు ఇద్దరిలో పొగాకు వాడే అలవాటు ఉండడం.
మసాలా, పొగబెట్టిన లేదా ఎండబెట్టిన మాంసం, చేపలు వంటి సాంప్రదాయ ఆహారపు అలవాట్లు కూడా క్యాన్సర్ కి కారణం కావచ్చు.
హెలికోబాక్టర్ పైలోరి, హెపటైటిస్, HPV వంటి ఇన్ఫెక్షన్ల వల్ల వచ్చే వ్యాధులు ఈ ప్రదేశాల్లో ఎక్కువగా ఉన్నట్లు తెలిసింది. ఇవి క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా పెంచుతాయి.