Friendship Day 2025: ''ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే".. చిన్నప్పుడు ఇసుకలో ఆడుకోవడం నుంచి మొదలయ్యే స్నేహం.. అక్కడి నుంచి స్కూల్, కాలేజ్, ఆఫీస్ ఇలా ప్రతీ దశలో మన జీవితంలో ఫ్రెండ్స్ అనేవాడు కామన్. చెప్పాలంటే మన సగం జీవితం ఫ్రెండ్స్ తోనే గడిచిపోతుంది. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు దోస్త్ మేరా దోస్త్ అంటూ ఫ్రెండ్స్ చుట్టే గడిపేస్తాం. అక్కా చెల్లి, అన్నా తమ్ముడు లేని వారుంటారేమో కానీ, జీవితంలో ఫ్రెండ్ లేని వారు మాత్రం ఉండరు. అందుకే మన జీవితంలో స్నేహితుల ప్రాముఖ్యతను గుర్తుచేసుకోవడానికి ప్రతీ ఏడాది ఆగస్టు 3న ఫ్రెండ్షిప్ డే జరుపుకుంటారు. ఈరోజు ఫ్రెండ్షిప్ డే సందర్భంగా స్నేహ బంధం నేపథ్యంలో వచ్చిన సినిమాలేంటో ఇక్కడ చూద్దాం..
ఫ్రెండ్షిప్ సినిమాలు
హ్యాపీ డేస్
ఫ్రెండ్షిప్ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం అప్పట్లో సంచలనం సృష్టించింది. డిఫరెంట్ బ్యాక్ గ్రౌండ్స్ నుంచి వచ్చిన 8 మంది ఇంజనీరింగ్ కాలేజీలో ఫ్రెండ్స్ అవ్వడం.. ఆ తర్వాత వారి అనుభవాలు, సరదాలు, ప్రేమలు, గొడవలను ఈ సినిమాలో చూపించారు. కష్టాల్లో ఉన్నప్పుడు ఫ్రెండ్స్ ఒకరికోసం ఒకరు ఎలా తోడుగా ఉండాలి అనే అంశాన్ని కూడా చక్కగా తెరకెక్కించారు. స్నేహబంధానికి ఈ సినిమా ఒక నిదర్శనంగా నిలిచింది.
లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్
మధ్యతరగతి యువకుల స్నేహం, వారి అనుబంధాలు, జీవిత ప్రయాణాన్ని అందంగా చూపించింది ఈ సినిమా. ఫ్రెండ్షిప్ డే వస్తే.. ఇందులో పాటలు, సన్నివేశాలు ఇప్పటికీ ట్రెండ్ అవుతూనే ఉంటాయి.
కేరింత
కాలేజ్ లైఫ్ ఫ్రెండ్షిప్, ప్రేమ, భావోద్వేగాల నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపొందించారు.
ఈ నగరానికి ఏమైంది
నలుగురు స్నేహితుల కథ, వారి కలలు అనుబంధాల నేపథ్యంలో ఒక ఫన్ రైడ్ గా ఈ సినిమా సాగుతుంది. ఫ్రెండ్స్ ఉండే సన్నివేశాలను ఈ సినిమాలో ఎంతో సహజంగా చూపించారు.
ఉన్నది ఒకటే జిందగీ
ఇద్దరు ప్రాణ స్నేహితుల చుట్టు ఈ సినిమా కథ తిరుగుతుంది. ఇందులోని "ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే" ఫుల్ పాపులర్. ఫ్రెండ్షిప్ డే రోజు ఈ పాట ఖచ్చితంగా అందరి వాట్సాప్ స్టేటస్ లో కనిపిస్తుంది.
స్నేహం కోసం
చిరంజీవి- విజయ్ కుమార్ ప్రధాన పాత్రలో వచ్చిన ఈ చిత్రంలో.. స్నేహం కోసం ప్రాణాలిచ్చే బంధాన్ని అద్భుతంగా చూపించారు. ఈ సినిమా మెగాస్టార్ చిరంజీవి నటనకు ఉత్తమ నటుడిగా ఫిల్మ్ ఫెయిర్ అవార్డు లభించింది.
మహర్షి
స్నేహితుడిని గెలిపించడానికి మరో స్నేహితుడు ఎంత దూరం వెళ్తాడో ఈ చిత్రంలో చూపించారు. ఇందులో మహేష్ బాబు- అల్లరి నరేష్ ఫ్రెండ్స్ గా నటించారు.
వసంతం
అబ్బాయి, అమ్మాయి కలిసుంటే ప్రేమ అనుకునే ఈ సమాజంలో.. వారిద్దరి మధ్య ప్రేమ మాత్రమే కాదు అంతకు మించిన స్నేహ బంధం కూడా ఉంటుందని చూపించారు.
స్నేహితుడు
కాలేజీలో ముగ్గురు స్నేహితుల స్నేహ బంధం, వారి జీవిత ప్రయాణాన్ని ఈ సినిమాలో చూపించారు.