సాధారణంగా వర్షాకాలంలో వాతావరణ మార్పుల కారణంగా వ్యాధుల వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా డెంగ్యూ కేసులు ఎక్కువగా కనిపిస్తాయి. అటువంటి పరిస్థితుల్లో ఇంట్లో పిల్లలను సురక్షితంగా చూసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే పిల్లల రోగనిరోధక శక్తి చాలా బలహీనంగా ఉంటుంది. పిల్లలు డెంగ్యూ బారిన పడకుండా రక్షించేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
పిల్లల ఆహారం పట్ల శ్రద్ద
పిల్లల రోగనిరోధక శక్తి చాలా బలహీనంగా ఉంటుంది. దీని వల్ల వారు త్వరగా వ్యాధులకు గురయ్యే ప్రమాదం ఎక్కువ. ఇటువంటి పరిస్థితుల్లో పిల్లల రోగనిరోధక శక్తి పై ప్రత్యేక శ్రద్ద వహించాలి. రోగనిరోధక శక్తిని పెంచడానికి పిల్లలు తినే ఆహారంలో ఆకుపచ్చ కూరగాయలు, పండ్లు ఎక్కువగా చేర్చండి. నారింజ, కివి, నిమ్మ, స్ట్రాబెర్రీ, టొమాటో మొదలైన వాటిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది.
ఫుల్ స్లీవ్ దుస్తులు
రాత్రి సమయాల్లో దోమల దాడిని నివారించడానికి పిల్లలకు ఎల్లప్పుడూ ఫుల్ స్లీవ్ దుస్తులు ధరింపజేయడం ఉత్తమం. పిల్లలు బయట ఆడుకోవడానికి వెళ్లినా, బడికి వెళ్లాలన్నా.. ఫుల్ స్లీవ్స్ దుస్తులు మాత్రమే వేయించి బయటకు పంపాలి.
దోమతెర ఉపయోగించండి
సాధారణంగా పిల్లలు నిద్రపోతున్నప్పుడు దోమలు ఎక్కువగా కుడతాయి. కావున పిల్లలు నిద్రించే సమయంలో దోమతెరలను ఉపయోగించండి. అలాగే పిల్లలను ఆరుబయట ప్రదేశాల్లో పడుకోబెట్టకూడదని గుర్తించుకోండి. అయితే చాలా మంది దోమలను నివారించడానికి దోమతెరలకు బదులుగా జెట్ కాయిల్స్, ఆల్ ఔట్ వాడుతుంటారు. కానీ ఇవి ఆరోగ్యానికి అంత సురక్షితంగా పరిగణించబడవు. దోమతెరను ఉపయోగించడం ఉత్తమం.
పరిశుభ్రత
వర్షాకాలంలో ఇల్లు, ఇంటి చుట్టు పక్కల పరిసరాల పై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. వర్షపు నీరు నిల్వ ఉండే చోట్లలో దోమలు త్వరగా వృద్ధి చెందుతాయి. అందుచేత ఇంటి చుట్టు పక్కల నీరు ఎక్కువ కాలం నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అంతేకాదు ఎప్పటికప్పుడు పురుగుమందులు పిచికారీ చేయాలి. దోమలు ఇంట్లోకి రాకుండా సాయంత్రం కాగానే ఇంటి తలుపులు, కిటికీలు మూసివేయాలి.
వ్యక్తిగత పరిశుభ్రత
పిల్లలను దోమలు, బ్యాక్టీరియా నుంచి రక్షించడానికి వారి వ్యక్తిగత పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. తినేముందు చేతులను శుభ్రంగా కడుక్కోమని పిల్లవాడికి నేర్పండి.