ఎయిడ్స్ ఉందనుకొని AIని మందులు అడిగాడు.. లేని రోగం వచ్చింది!

డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా అనారోగ్య సమస్యకు AIని మెడిసిన్ సూచించమని కోరాడు. వైద్య నిపుణుల సలహా లేకుండా, AI టెక్నాలజీ ఇచ్చిన సమాచారంతో మందులు వాడటం ఆ వ్యక్తిని చావు అంచుల్లోకి నెట్టింది. వైద్యులు ఆయనకు స్టీవెన్స్-జాన్సన్ సిండ్రోమ్ సోకినట్లు నిర్ధారించారు.

New Update
prevent AIDS

కొండ నాలుకకి మందు వేస్తే ఉన్న నాలుక ఊడిపోయినట్లు అయింది ఓ వ్యక్తి పరిస్థితి. డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా తనకున్న అనారోగ్య సమస్యకు AIని మెడిసిన్ సూచించమని కోరాడు. వైద్య నిపుణుల సలహా లేకుండా, AI టెక్నాలజీ ఇచ్చిన సమాచారంతో మందులు వాడటం ఆ వ్యక్తిని చావు అంచుల్లోకి నెట్టింది. 45 ఏళ్ల ఒక ఢిల్లీ నివాసి, తాను HIV బారిన పడే అవకాశం ఉందని భావించి, దాని నివారణ కోసం AI చాట్‌బాట్‌ను సంప్రదించాడు. ఆ AI ప్లాట్‌ఫారమ్ సూచించిన విధంగా, వైద్యుని ప్రిస్క్రిప్షన్ లేకుండానే స్థానిక మెడికల్ షాపులో 28 రోజుల కోర్సు కలిగిన PEP (Post-Exposure Prophylaxis) మెడిసిన్ కొనుగోలు చేశాడు.

ప్రాణాంతకమైన ‘స్టీవెన్స్-జాన్సన్ సిండ్రోమ్’

బాధితుడు ఆ మందులను ఏడు రోజుల పాటు వాడిన తర్వాత, అతని శరీరమంతా తీవ్రమైన దద్దుర్లు, కంటి సమస్యలు తలెత్తాయి. పరిస్థితి విషమించడంతో ఆయనను ఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు ఆయనకు స్టీవెన్స్-జాన్సన్ సిండ్రోమ్ సోకినట్లు నిర్ధారించారు. ఇది ఔషధాల వికటించడం వల్ల వచ్చే అరుదైన, అత్యంత ప్రమాదకరమైన చర్మ వ్యాధి. దీనివల్ల చర్మం పొరలు ఊడిపోవడం, అంతర్గత అవయవాలు దెబ్బతినడం జరుగుతుంది. ప్రస్తుతం ఆయన ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై స్పందించిన వైద్యులు కొన్ని కీలక అంశాలను వెల్లడించారు.

కాలం చెల్లిన ప్రోటోకాల్స్: అతను వాడిన మందులు పాత పద్ధతికి చెందినవి. ప్రస్తుత ఆధునిక వైద్యంలో వాటిని వాడటం లేదు. AI ప్లాట్‌ఫారమ్‌లు అప్డేట్ కాని సమాచారాన్ని ఇవ్వడం వల్ల ఇలాంటి పొరపాట్లు జరుగుతాయి.
పర్యవేక్షణ లేకపోవడం: HIV నిరోధక మందులు వాడే ముందు రక్త పరీక్షలు, కిడ్నీ, కాలేయ పనితీరును పరీక్షించాలి. వైద్యుని పర్యవేక్షణ లేకుండా వీటిని వాడటం వల్ల అవయవాలు విఫలమయ్యే అవకాశం ఉంది.
రెగ్యులేటరీ లోపాలు: ప్రిస్క్రిప్షన్ లేకుండా అటువంటి తీవ్రమైన మందులను విక్రయించిన కెమిస్ట్ తీరుపై కూడా అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు