సీడబ్ల్యూసీ సమావేశంలో రసాభాస
ఖమ్మంలో సీడబ్ల్యూసీ సమావేశాలు నేపథ్యంలో ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా మహారాష్ట్ర పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ నజీర్, సీఎల్పీనేత భట్టి విక్రమార్క, కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరి, ప్రచార కమిటీ రాష్ట్ర కోకన్వీనర్ మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్‌తో పాటు భారీసంఖ్యలో కార్యకర్తలు హాజరైయ్యారు.
పొంగులేటి విజ్ఞప్తి
అయితే ఈ సమావేశం రసాభాసగా మారింది. పొంగులేటి, భట్టి వర్గీయుల మధ్య నినాదాలు నెలకొంది. జై పొంగులేటి, జైభట్టి, జైపోట్ల, జైరాయల అంటూ కార్యకర్తల పోటా పోటీ నినాదాలు చేశారు. దీంతో ఒక్కసారిగా రసాభాసగా సన్నాహక సమావేశం మారింది. సమావేశంలో రేణుకా చౌదరి వర్గీయులు ఆందోళనకు చేశారు. కార్యకర్తలను పొంగులేటి శ్రీనివాసరెడ్డి సముదాయించారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లడుతూ..అధికారం రాకముందు కాదు.. వచ్చాక కొట్టుకుందాం అని అన్నారు. అభ్యర్థిత్వాన్ని ఏఐసీసీ డిసైడ్ చేస్తోందన్నారు. రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో..? మనందరికీ తెలుసు అన్నారు. చేతులు ఎత్తి మొక్కుతున్నా..!! మనలో మనం కొట్టుకోవొద్దని పొంగులేటి విజ్ఞప్తి చేశారు.తుక్కుగూడ సభను విజయవంతం చేద్దాం అని ఆయన పిలుపునిచ్చారు.
రాబోయేది కాంగ్రెస్
ఇక ఈ సమావేశంలో రేణుకాచౌదరి హాట్ కామెంట్స్ చేశారు. పార్టీ కోసం ప్రాణాలు పెట్టి పని చేసినవారికి సరైన గుర్తింపు లేదన్నారు. తప్పుడు రిపోర్ట్‌లు, సర్వేలతో నేతలకు అన్యాయం చేశారని ఆమె మండిపడ్డారు. చేదు నిజాలు చెప్పే అలవాటు నాకుందని.. ఏది ఏమైనా ఖమ్మం జిల్లా కాంగ్రెస్ జిల్లాగా అని నిరూపిద్దామన్నారని రేణుకా చౌదరి అన్నారు. గతంలో పార్టీని మోసం చేసిన వారికి మనమేంటో చూపిద్దాం అన్నారు. అలాంటి వాళ్లకి మళ్లీ తిరిగి పార్టీలో స్థానం కల్పించకూడదన్నారు. మంత్రి పువ్వాడ అజయ్‌పై రేణుకాచౌదరి ఘాటు వ్యాఖ్యలు చేశారు. అరేయ్ అజయ్‌గా అంటూ మంత్రి పువ్వాడపై రేణుకాచౌదరి ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ కార్యకర్తలపై మంత్రి దౌర్జన్యం నశించాలి అంటూ నినాదాలు చేశారు. రాబోయేది కాంగ్రెస్.. ఉండబోయేది కాంగ్రెస్ అని ఆమె దీమా వ్యక్తం చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ రెండూ ఒకటే..కల్వకుంట్ల కవితమ్మ జాతకం ఏమైందని రేణుకాచౌదరి పశ్నించారు. మీకు ఏం చేసినా..కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం తథ్యమని రేణుక చౌదరి జోస్యం చెప్పారు.
సభకు విజయవంతం చేయాలి
ఈనెల 15 నుంచి 17వ తేదీ వరకు హైదరాబాద్ వేదికగా సీడబ్ల్యూసీ సమావేశాలు జరుగుతాయని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తెలిపారు.ఈ సమావేశంలోనే కాంగ్రెస్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటుందని వెల్లడించారు. సోనియా చారిత్రక డిక్లరేషన్‌ను ప్రకటిస్తారని భట్టి చెప్పారు. ఈ నెల17న హైదరాబాద్‌లో బహిరంగ సభను ప్రజలు విజయవంతం చేయాలని భట్టి పిలుపునిచ్చారు. తెలంగాణకు సీఎం కేసీఆర్ చేసిందేమీ లేదన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అవినీతిపై ఛార్జ్ షీట్ ప్రకటిస్తామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తెలిపారు.