Srinivasa Ramanujan Birthday: ప్రపంచానికి సున్నాను పరిచయం చేసిన వ్యక్తి. లెక్కల్లో గమ్యం తెలియకుండా నడుస్తున్న భారతాన్ని ఒక దోవలో పెట్టిన మహనీయుడు. ఎవ్వరూ సాధించలేని సమస్యలను కూడా అలవోకగా సాధించి ప్రపంచాన్ని తనవైపు తిప్పుకున్న ఘనుడు శ్రీనివాస రామానుజన్. ప్రస్తుతం ప్రపంచం అనుసరిస్తున్న దశాంశమాన పద్దతిని వేల సంవత్సరాల కిందటే భారతీయులు వినియోగించారు. మూడో శతాబ్దంలోనే ఈ పద్దతి వినియోగంలో ఉంది. అయితే, భారతీయులు దీన్ని ఎలా ఆవిష్కరించారో తెలియదు కానీ నిర్దిష్టమైన గణిత విధానాన్ని మాత్రం రూపొందించారు. ప్రపంచమంతా ఇప్పుడు వినియోగిస్తున్న 1 నుంచి 9 వరకు అంకెలతో పునాదులేసి ఆ తరువాత కొత్తగా సున్నా(0)ను సైతం కనుగొని గణిత ప్రపంచాన్ని ఒక మలుపు తిప్పారు. అప్పటి వరకు చుక్కానీలేని నావలా ఉన్న గణితానికి భారతీయులు సున్నాను కనిపెట్టి కొత్త రూపునిచ్చారు. తొలిసారి శూన్య భావనకు ఒక అంకెను ఆవిష్కరించిన భారతీయులు ప్రపంచ గణితాన్ని కొత్తపుంతలు తొక్కించారు.
Also Read:బాడీలో చెత్తను తొలగించే డీటాక్స్ వాటర్…ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
ఇవన్నీ ఒకెత్తైతే భారతదేశ గణిత పితామహుడు శ్రీనివాస రామానుజమ్ మరొక ఎత్తు. 20 వ శతాబ్దంలో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన గణిత మేధావుల్లో ఒకరిగా గుర్తింపు సాధించిన భారతీయుడు శ్రీనివాస రామానుజన్ (Srinivasa Ramanujan). తమిళనాడులో ఈరోడ్‌లోని కోమలమ్మాళ్, శ్రీనివాస అయ్యంగార్ దంపతులకు 1887 డిసెంబరు 22 న రామానుజన్ జన్మించారు. చిన్న వయసులోనే అసాధారణ ప్రతిభను ప్రదర్శించి ఆయిలర్ నియమాలు, త్రికోణమితికి చెందిన సమస్యలను సాధించారు. పదమూడేళ్లకే ఎస్ఎల్ లోనీ త్రికోణమితిపై తానే సొంతంగా సిద్ధాంతాలు తయారు చేసిన వ్యక్తి.
మహా మేధావులకు మాత్రమే సాధ్యమయ్యే పరిశోధన ఫలితాలను చిన్న వయసులోనే రామానుజమ్ చేయడం చూసిన హార్టీ,ఆయనను కేంబ్రిడ్జి యూనివర్శిటీకి ఆహ్వానించారు. 1914 మార్చిలో లండన్ వెళ్లిన రామానుజన్ అక్కడ నిరంతరం గణితంపై పరిశోధనలు చేసి కొత్త సిద్ధాంతాలను కనిపెట్టారు. ఫెలో ఆఫ్ ద ట్రినిటీ కాలేజి గౌరవం పొందిన తొలి భారతీయుడిగానూ, ఫెలో ఆఫ్ ద రాయల్ సొసైటీ గౌరవం పొందిన రెండో భారతీయుడిగానూ ఆయన చరిత్రకెక్కారు.
అపారమైన తన గణిత పరిజ్ఞానంతో భారతీయ ప్రతిభను ప్రపంచానికి చాటిన చెప్పిన రామానుజన్ అనారోగ్యంతో తన 33వ ఏట 1920 ఏప్రిల్ 26న కుంభకోణంలో కన్నుమూశారు. బ్రిటన్‌లో ఉన్న సమయంలో ఆరోగ్యం గురించి ఏమాత్రం లెక్కచేయకుండా గణిత పరిశోధనలకు ప్రాధాన్యత ఇవ్వడంతో తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆయన ఇండియాకు వచ్చిన ఏడాది తర్వాత అంటే 1920 ఏప్రిల్ 26న చనిపోయారు. జీవిత అవశానదశలో రామానుజన్ రాసిన మ్యాజిక్ స్క్వేర్, ప్యూర్ మాథ్స్‌కు చెందిన నెంబర్ థియరీ, మాక్ తీటా ఫంక్షన్స్ చాలా ప్రసిద్ధి పొందాయి.
వీటిని ఆధారంగా చేసుకుని కనుగొన్న స్వింగ్ థియరీ, క్యాన్సర్‌పై పరిశోధనలు ఇప్పటికీ కొనసాగుతున్నాయని 1986-87 రామానుజన్ శతజయంత్యుత్సవాల్లో గణిత శాస్త్రవేత్తలు ప్రకటించారు. గణితశాస్త్రంలో రామానుజన్ సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం ఆయన పుట్టినరోజును జాతీయ గణిత దినోత్సవంగా ప్రకటించింది.
జాతీయ గణితదినోత్సవం రోజు (National Mathematics Day) జరుపుకోవడం వెనుక ఉన్న ప్రధాన లక్ష్యం గణితశాస్త్రం ప్రాముఖ్యతను తెలియజేయడం. దానితో పాటూ గణితానికి, మనిషికి ఎంత దగ్గర సంబంధం ఉందో కూడా తెలియజేయడమే దీని లక్ష్యం. ఉదయం మనం లేచిన దగ్గర నుంచీ లెక్కలు లేకుండా ఏ పనీ జరగదు. మనం చేసే ప్రతీ పనిలో కాలిక్యులేషన్ ఉంటుంది. అందుకే ప్రతీ గణితజ్ఞుడూ చెప్పే మాట ఏంటంటే..లెక్కలను ఒక స్బజెక్ట్ గా చూడొద్దు అని. మనరోజు వారీ జీవితంతో దాన్ని అనుసంధానించుకుంటే అదొక అద్భుతంగా కనిపిస్తుంది. చాలా సులువుగా ఉంటుందని అంటారు. ఇలా చేస్తే గణితశాస్త్ర పరిజ్ఞానం పొందడం పట్ల సానుకూల ధోరణి కలిగి ఉంటారని అంటున్నారు. జాతీయ గణిత దినోత్సం ముఖ్య ఉద్దేశ్యం అదేనని చెబుతున్నారు.