Arshad Nadeem: మట్టిలో మాణిక్యం ఈ పదం తరచూ మనం వింటూ ఉంటాం. అటువంటి వాడే పాకిస్థాన్ కి చెందిన అర్షద్ నదీమ్. తండ్రి నిరుపేద కూలీ. రెండుపూటలా తిండి దొరకడమే కష్టం. కానీ, ఇప్పుడు క్రీడా ప్రపంచంలో చరిత్ర సృష్టించాడు. అవును. పాకిస్థాన్‌కు (Pakistan) చెందిన అర్షద్ నదీమ్ పారిస్ ఒలింపిక్స్ 2024 (Paris Olympics 2024) జావెలిన్ త్రోలో స్వర్ణం (Javelin Gold) సాధించి చరిత్ర సృష్టించాడు. ఒలింపిక్స్ చరిత్రలో జావెలిన్ త్రోలో పాకిస్థాన్‌కు తొలి స్వర్ణం దక్కడం ఇదే తొలిసారి. ఇంకా విశేషమేమిటంటే అర్షద్ నదీమ్ జావెలిన్ ను 92.97 మీటర్ల దూరం విసిరి ఈ స్వర్ణం సాధించాడు. భారతదేశానికి చెందిన నీరజ్ చోప్రా ద్వితీయ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ స్వర్ణ పతక విజయంతో ప్రపంచవ్యాప్తంగా అర్షద్ నదీమ్ ప్రశంసలు అందుకుంటున్నాడు. కానీ.. ఈ విజయం అతనికి అంత ఈజీగా రాలేదు. సినిమా కథలా అనిపించే అర్షద్ కథను తెలుసుకుంటే.. ఎవరు కూడా అర్షద్ ను అభినందించకుండా ఉండలేరు.
కూలీ కొడుకు..
Arshad Nadeem: పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లోని మియాన్ చన్ను ప్రాంతం నుండి వచ్చిన అర్షద్ తండ్రి ఒక కూలీగా పనిచేసేవాడు. చిన్నతనంలో నదీమ్ తన తండ్రితో కలిసి నెజాబాజీ ఆటలు చూడటానికి వెళ్లేవాడు. ఇది పాకిస్తాన్ ప్రసిద్ధ గేమ్. ఈ గేమ్‌లో, చాలా మంది ఆటగాళ్ళు తమ చేతుల్లో పొడవాటి కర్రతో నేలపై ఉంచిన గుర్తును ఏకకాలంలో తీసుకోవడానికి పోటీ పడతారు. ఇలా చూస్తూ చూస్తూ నదీమ్‌కి ఈ ఆట బాగా నచ్చడంతో రోజూ ఒక కర్రతో శిక్షణ ప్రారంభించాడు. అయితే, కొన్ని రోజుల తర్వాత అర్షద్‌కి టేప్ బాల్ క్రికెట్‌పై ఆసక్తి ఏర్పడింది. ఒకరోజు స్కూల్‌లో అతనికి జావలిన్ త్రో పై ఆసక్తి ఏర్పడింది. అది అతని జీవితాన్ని కొత్త మలుపు తిప్పింది. నెజాబాజీ శిక్షణ సహాయంతో, అతను జావెలిన్ త్రోలో పాల్గొనడం ప్రారంభించాడు. పాఠశాలలో అథ్లెటిక్స్ ఈవెంట్లలో, చాలా మంది సీనియర్లు అతని జావెలిన్ త్రో నైపుణ్యాలను గుర్తించారు. దీని తర్వాత, నదీమ్ తన స్కూల్ టీమ్ కోచ్ రషీద్ అహ్మద్ సాకీతో కలిసి జావెలిన్ త్రోయింగ్‌కు సిద్ధమయ్యాడు.
Arshad Nadeem: ఎనిమిది మంది తోబుట్టువుల్లో మూడో వ్యక్తి అయిన అర్షద్ తండ్రి కూలీ. ఇంట్లో పరిస్థితులు బాగాలేనప్పటికీ, అతని తండ్రి మహ్మద్ అష్రఫ్ తన కొడుకు ఆహారంలో ఎటువంటి లోటూ రానీయలేదు. అర్షద్‌లో ఏదో అద్భుతం ఉందని అష్రాఫ్‌కు ముందుగానే గుర్తించాడు. నదీమ్‌కు పాలు - నెయ్యి లభించేలా చూడడం కోసం నిత్యం ప్రయత్నించేవాడు అష్రాఫ్. 400-500 కూలీతో అర్షద్ తండ్రి కుటుంబాన్ని పోషించేవాడు. ఆ డబ్బుతోనే అందరినీ బాగా చూసుకునేవాడు. పిల్లలు తనలా ఇలా పేదరికంలో గడపకూడదని కోరుకున్నాడు. ఇక జావెలిన్‌పై నదీమ్ తన ఆసక్తిని చూపించినా.. ఈ క్రీడా ప్రపంచంలో పెద్దగా పేరు తెచ్చుకోవాలని ఎప్పుడూ భావించలేదు. చిన్నప్పటి నుంచి కుటుంబ ఆర్థిక సంక్షోభాన్ని చూస్తున్న నదీమ్‌కు ఇలా ఆటలు ఆది పేరు తెచ్చుకుంటే.. స్పోర్ట్స్ కోటాలో ప్రభుత్వోద్యోగి కావచ్చనేది ఒకటే కలగా ఉండేది.
గుర్తింపు ఇలా వచ్చింది..
Arshad Nadeem: ప్రభుత్వ ఉద్యోగం కోసం, అతను స్పోర్ట్స్ కోటా కింద పాకిస్తాన్ వాటర్ అండ్ పవర్ డెవలప్‌మెంట్ అథారిటీకి ట్రయల్స్ కూడా ఇచ్చాడు. ఈ ట్రయల్స్ సమయంలో, ఐదుసార్లు పాకిస్తాన్ జాతీయ ఛాంపియన్ - మాజీ ఆసియా పతక విజేత జావెలిన్ త్రోయర్ సయ్యద్ హుస్సేన్ బుఖారీ అర్షద్ ప్రతిభను గుర్తించాడు. ఈ అవకాశం అర్షద్‌ను ప్రభుత్వ ఉద్యోగానికి మరింత ముందుకు తీసుకెళ్లింది. స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం ఇవ్వాలని ప్రభుత్వానికి ఆయన సూచించారు.
అర్షద్ సరైన శిక్షణ పొందితే చాలా ఎత్తుకు ఎదుగుతాడని బుఖారీకి తెలుసు. శిక్షణతో పాటు తనకు హాస్టల్, మంచి ఆహారం అందించి పాకిస్థాన్‌కు పతకం తీసుకురావాలనుకున్నాడు. బుఖారీ అర్షద్‌ను ఎంపిక చేసుకున్నప్పుడు అతను 55 మీటర్ల మార్కు వరకూ జావలిన్ త్రో చేస్తున్నాడు. కేవలం రెండు నెలల శిక్షణ తర్వాత, అతను 60 మీటర్ల మార్కును తాకాడు. కేవలం 18 సంవత్సరాల వయస్సులో నాలుగు నెలల తర్వాత, అతను 70 మీటర్లను కూడా చేరుకున్నాడు. 2015లో 70మీటర్ల మార్కును తాకిన తర్వాత మూడేళ్లలోనే నదీమ్ 80మీ వరకూ చేరుకోగలిగాడు.
2018లో జకార్తాలో జరిగిన ఆసియా క్రీడల్లో అతను 80.75 మీటర్ల త్రో తో ఈ రికార్డు సృష్టించాడు. దీని తర్వాత, ఇరాన్‌లో జరిగిన ఇమామ్ రెజా కప్‌లో అతను 86.38 మీటర్ల త్రో విసిరాడు. ఇక కామన్వెల్త్ గేమ్స్ 2022లో జావెలిన్ త్రోలో స్వర్ణం సాధించి చరిత్ర సృష్టించాడు. ఈ గేమ్స్ లో జావెలిన్ ను 90.18 మీటర్ల దూరం విసిరి రికార్డ్ సృష్టించాడు. దీంతో నదీమ్ ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన గుర్తింపు పొందాడు.
నదీమ్.. నీరజ్ అనుబంధం..
Arshad Nadeem: జావలిన్ త్రోలో నీరజ్-నదీమ్ ఇద్దరూ ఇద్దరే. ఇద్దరూ దాయాది దేశాల వారైనా.. ఆటల్లో ఎంత పోటీ ఉన్నా వ్యక్తిగతంగా మంచి స్నేహితులు. నిజమైన క్రీడా స్ఫూర్తి చూపించే ఆటగాళ్లు. నిజానికి ఈ ఇద్దరూ పోటీ పడిన పోటీల్లో చాలాసార్లు నీరజ్ పైచేయి చూపించాడు. అయినా ఇద్దరి మధ్యలో మంచి స్నేహం ఉంది. వీరి అనుబంధాన్ని తెలిపే సంఘటన ఒకటి ఉంది. పాకిస్థాన్ లో క్రీడాకారులకు గడ్డు పరిస్థితులే ఉంటాయి. అలానే నదీమ్ కు కూడా చాలా కష్టమైన కాలం ఉంది. ఒకానొక దశలో పాడైపోయిన తన జావలిన్ కొత్తది కొనుక్కోవడానికి కూడా నదీమ్ చాలా కష్టపడాల్సి వచ్చింది. ఈ ఏడాది మర్చి నెలలో మీడియాతో మాట్లాడుతూ నదీమ్ “నా జావలిన్ దెబ్బతినే దశకు చేరుకుంది.. పారిస్ ఒలింపిక్స్ కు ముందు దాని గురించి ఏదైనా సహాయం చేయాలని నేను జాతీయ సమాఖ్యను, నా కోచ్ ను కోరాను” అని చెప్పాడు. అత్యున్నత స్థాయి పోటీలకు సిద్ధం అవుతున్న అథ్లెట్ కు ఈ పరిస్థితి చాలా కఠినమైనది అని చెప్పవచ్చు.
తన స్నేహితుడు నదీమ్ దీనస్థితిని తెలుసుకున్న నీరజ్ ఆందోళన చెందాడు. చోప్రా మాట్లాడుతూ.. "అతను కొత్త జావెలిన్ కోసం కష్టపడుతున్నాడంటే నమ్మడం కష్టం, అతని అర్హతలను బట్టి, ఇది పెద్ద సమస్య కాదు." అని చెప్పాడు. నదీమ్ క్యాలిబర్ ఉన్న అథ్లెట్. తన జాతీయ సమాఖ్య, సంభావ్య స్పాన్సర్‌ల నుండి అత్యుత్తమ పరికరాలు.. మద్దతు పొందడానికి అర్హుడు అంటూ స్పష్టం చేస్తూ అతనికి నైతిక మద్దతు ఇచ్చి క్రీడా స్ఫూర్తి చాటుకున్నాడు.
ఇదిలా ఉంటే.. నీరజ్ చోప్రా రజత పతకం గెలిచిన తరువాత అతని తల్లి చెప్పిన మాటలు మరింత స్ఫూర్తిదాయకంగా ఉన్నాయి. “గాయంతో నీరజ్ ఆడాడు. అతనికి రజత పతకం వచ్చినా.. అది నాకు స్వర్ణంతో సమానమే” అని ఆమె చెప్పారు. అదే సందర్భంలో అర్షద్ నదీమ్ స్వర్ణం సాధించడంపై కూడా మీడియా ముందు స్పందించారు. నదీమ్ స్వర్ణం సాధించడం పై మీరేమీ విచారంగా లేరా అని అడిగితే.. “మరేమీ ఫర్వాలేదు. అతను (నదీమ్) కూడా మా బిడ్డే.” అని చెప్పారు.