Crisil Report: వచ్చే ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ వృద్ధిరేటు 6.8 శాతంగా ఉంటుందని రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్(Crisil Report) అంచనా వేసింది. అలాగే 2031 నాటికి ఎగువ మధ్యతరగతి అధిక ఆదాయ దేశంగా అవతరిస్తుందని చెబుతోంది. అంతేకాదు, మన దేశ ఆర్థిక వ్యవస్థ కూడా రెట్టింపు అవుతుందని.. ఏడు లక్షల కోట్ల డాలర్లుగా మారుతుందని క్రిసిల్ పేర్కొంది. క్రిసిల్ రేటింగ్స్ తన 'ఇండియా ఔట్‌లుక్' నివేదికలో భారత ఆర్థిక వ్యవస్థకు దేశీయ నిర్మాణాత్మక సంస్కరణలు అలాగే సైక్లిక్ (చక్రీయ) పరిస్థితులు మద్దతు ఇస్తాయని చెప్పింది. 2031 నాటికి మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగడానికి భారత్ తన వృద్ధి అవకాశాలను కొనసాగించగలదని అలాగే మరింత మెరుగుపరచగలదని ఆ రిపోర్ట్ పేర్కొంది.
CRISIL నివేదిక ప్రకారం, 'ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 7.6 శాతం వృద్ధి అంచనాల తర్వాత, భారతదేశ వాస్తవ GDP వృద్ధి 2024-25 ఆర్థిక సంవత్సరంలో 6.8 శాతానికి మధ్యస్థంగా ఉంటుందని అంచనా. ' వచ్చే 7 ఆర్థిక సంవత్సరాల్లో (2024-25 నుంచి 2030-31 వరకు) భారత ఆర్థిక వ్యవస్థ 5 ట్రిలియన్ డాలర్ల మార్కును దాటి 7 లక్షల కోట్ల డాలర్లకు చేరుకుంటుందని నివేదిక(Crisil Report) పేర్కొంది.
Also Read: క్రెడిట్ కార్డు యూజర్లకు గుడ్ న్యూస్.. నచ్చిన నెట్‌వర్క్ ఎంచుకోవచ్చు..
క్రిసిల్ రిపోర్ట్ ప్రకారం, 'ఈ కాలంలో అంచనా వేసిన సగటు వృద్ధి 6.7 శాతం భారతదేశాన్ని ప్రపంచంలోని మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుస్తుంది. 2030-31 నాటికి దేశ తలసరి ఆదాయం ఎగువ-మధ్యతరగతి ఆదాయ వర్గానికి కూడా చేరుకుంటుంది.' అని స్పష్టం అవుతోంది.
భారతదేశం ప్రస్తుతం $3.6 ట్రిలియన్ల స్థూల దేశీయోత్పత్తి (GDP)తో ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది. ఇందులో అమెరికా, చైనా, జపాన్, జర్మనీ ముందున్నాయి. 2030-31 ఆర్థిక సంవత్సరం నాటికి భారత ఆర్థిక వ్యవస్థ పరిమాణం 6.7 ట్రిలియన్ డాలర్లకు చేరుతుందని క్రిసిల్ (Crisil Report)అంచనా వేసింది. ఆ సమయానికి దేశ తలసరి ఆదాయం కూడా US $ 4,500కి పెరుగుతుంది. ఎగువ-మధ్య ఆదాయ దేశాల సమూహంలో భారతదేశం చేరుతుంది.
ప్రపంచ బ్యాంకు నిర్వచనం ప్రకారం, ఎగువ-మధ్య ఆదాయ దేశాల విభాగంలో తలసరి ఆదాయం 4,000-12,000 US డాలర్ల మధ్య ఉన్న దేశాలు ఉన్నాయి. CRISIL మేనేజింగ్ డైరెక్టర్ - చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అమిష్ మెహతా మాట్లాడుతూ, 2030-31 ఆర్థిక సంవత్సరం నాటికి, భారతదేశం మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అలాగే, ఎగువ మధ్య-ఆదాయ దేశంగా అవతరించనుందని, ఇది దేశీయ వినియోగానికి పెద్ద సానుకూలత వైపుగా ఉంటుందని అన్నారు.