KTR: తలసరి ఆదాయంలో తెలంగాణ నంబర్ వన్‌గా ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు. తొమ్మిదిన్నరేళ్ల తెలంగాణ ప్రగతి ప్రస్థానంపై హైదరాబాద్‌లోని హోటల్ కాకతీయ (ITC Grand Kakatiya)లో గురువారం ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ (KTR Presentation on a Few Crucial Topics) ఇచ్చారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి తాగునీరు అందిస్తున్నామని, ఇందుకోసం రూ.37 వేల కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పారు.
మిషన్ భగీరథను ఇతర రాష్ట్రాలు కూడా అనుసరిస్తున్నాయని, దీని స్ఫూర్తితోనే కేంద్ర ప్రభుత్వం హర్ ఘర్ జల్ పథకాన్ని ప్రారంభించిందన్నారు. ప్రాజెక్టుల కోసం రూ.1.70 లక్షల కోట్టు ఖర్చు పెట్టడమే కాకుండా.. నాలుగేళ్లలో ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకం కాళేశ్వరాన్ని నిర్మించినట్లు మంత్రి కేటీఆర్ వివరించారు. కాలువలు తవ్వి పాలమూరు ఎత్తిపోతల పథకాన్నీ పూర్తి చేశామన్నారు.
ఇది కూడా చదవండి: ఉత్కంఠ పోరులో భారత విజయం: చివరి బంతికి సిక్సర్ బాదిన రింకూ
రాజకీయాల కోసం కాళేశ్వరం ప్రాజెక్టును బద్నాం చేయవద్దని ఈ సందర్భంగా కేటీఆర్ కోరారు. కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలు, 20 రిజర్వాయర్లు, 20 లిఫ్టులని చెప్పారు. ప్రాజెక్టుల్లో సమస్యలు రావడం సర్వసాధారణమని; ప్రకాశం, ధవళేశ్వరం, కడెం జలాశయాల్లోనూ సమస్యలు వచ్చాయని తెలిపారు. సాగర్ కట్టిన తర్వాత కూడా లీకేజీ సమస్యలు వచ్చాయని పేర్కొన్నారు. రెండేళ్ల క్రితం శ్రీశైలం పంపులు కూడా నీట మునిగాయన్నారు. కాంగ్రెస్ పార్టీ వస్తే ధరణి తీసేస్తారని... మళ్లీ దళారీ వ్యవస్థను తీసుకొస్తారని అన్నారు. రాష్ట్రంలో కేజీ టు పీజీ విద్యను అందిస్తామని చెప్పారు. జీఎస్డీపీ అత్యంత వేగంగా పెరుగుతున్న రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. తలసరి ఆదాయంలో తెలంగాణ తొలి స్థానంలో ఉందని చెప్పారు.