Telangana: ప్రతిపక్షంలో ఉండగా మేఘా ఇంజనీరింగ్ సంస్థపై దుమ్మెత్తిపోసిన సీఎం రేవంత్ ఇప్పుడు ఎందుకంత ప్రేమ చూపిస్తున్నారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మేఘా ఇంజనీరింగ్ సంస్థపై ముఖ్యమంత్రి రేవంత్ ప్రత్యేక ఔదార్యం చూపుతున్నారని ఆరోపించారు. సుంకిశాల ప్రమాదానికి కారణమైన సంస్థపై చర్యలు తీసుకోవాల్సింది పోయి.. కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌ను అప్పగిస్తారా? అంటూ మండి పడ్డారు. బీర్ఎస్ హయాంలో జరిగిన చిన్న చిన్న తప్పులను కొండత చూపిస్తూ.. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఇదే సంస్థపై రేవంత్ భారీ ఆరోపణలు చేశారని గుర్తు చేశారు. మేఘా సంస్థను వెంటనే బ్లాక్‌లిస్ట్‌లో పెట్టాలని తాము డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవట్లేదని అసహనం వ్యక్తం చేశారు.
Also Read : అధికారం పోయినా బలుపు తగ్గలేదు.. సెక్రటేరియట్ ముందు మీ అయ్య విగ్రహం పెట్టుకుంటావా!
అలాగే సుంకిశాల ఘటనకు కారణమైన కంపెనీని బ్లాక్ లిస్ట్ చేయమని, ప్రమాదంపై న్యాయ విచారణ చేయాలని ప్రధాన ప్రతిపక్షంగా డిమాండ్ చేసినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. రూ. 4,350 కోట్ల కొడంగల్ ఎత్తిపోతల ప్రాజెక్టు అప్పగించేందుకు సిద్ధమయ్యారని కేటీఆర్ ఆరోపించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలంగాణ సంపద దోచుకుంటున్న ఈస్ట్ ఇండియా కంపెనీగా అభివర్ణించిన రేవంత్ రెడ్డి ఇవాళ మేఘా సంస్థపై ఎందుకింత ప్రేమ చూపిస్తున్నారో ప్రజలకు తెలపాలని డిమాండ్ చేశారు. ఆ కంపెనీపై రేవంత్ రెడ్డి ప్రత్యేక ఆసక్తిపై ఆంతర్యం ఏంటో చెప్పాలని కేటీఆర్ అడిగారు.