Karnataka CM Siddaramaiah: కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. గ్రూప్ -C, గ్రూప్- D పోస్టులకు ప్రైవేట్ సంస్థల్లో కన్నడిగులకు (Kannadigas) 100 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు కర్ణాటక మంత్రివర్గం ఆమోదం తెలిపిందని సీఎం సిద్ధరామయ్య తెలిపారు. సోమవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.
కర్ణాటకలో ప్రైవేట్ ఉద్యోగాల్లో కన్నడిగులకు 50% నుంచి 75% రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపిందని కార్మిక శాఖ మంత్రి సంతోష్ లాడ్ తెలిపారు. దీనిపై ఆయన సోషల్ మీడియా ఎక్స్‌లో సందేశాన్ని ప్రచురించారు, ప్రైవేట్ రంగంలో కన్నడిగులకు ఉద్యోగ రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు కేబినెట్ మీటింగ్‌లో ఆమోదం తెలిపిన విషయాన్ని మీ అందరితో పంచుకోవడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు.
రిజర్వేషన్‌కు ఎవరు అర్హులు?
కర్ణాటకలో జన్మించి, 15 ఏళ్లుగా కర్ణాటకలో నివసిస్తున్న, కన్నడ భాషలో మాట్లాడటం, చదవడం, రాయడం, నోడల్ ఏజెన్సీలు నిర్వహించే కన్నడ భాషా పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన వారు ఈ రిజర్వేషన్‌కు అర్హులు.
ఉల్లంఘించిన సంస్థలకు జరిమానాలు
కన్నడిగులకు ఉద్యోగాల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్‌ను ఉల్లంఘించే సంస్థలపై జరిమానా విధించే నిబంధనను కూడా బిల్లులో పొందుపరిచారు, దీనిని రాష్ట్రంలో ఖచ్చితంగా అమలు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.