Komatireddy Raj Gopal Reddy: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డిని (Uttam Kumar Reddy) సీఎం అంటూ సంబోధించారు. ఉత్తమ్ ఎప్పటికైనా సీఎం అవుతారన్నారు. తన నాలుకపై మచ్చలు ఉన్నాయని.. తాను ఏది అంటే అది జరుగుతుందంటూ సంచలన కామెంట్స్ చేశారు. ఇప్పటికే ఉత్తమ్‌కు సీఎం పదవి మిస్ అయిందంటూ వ్యాఖ్యానించారు. దీంతో కోమటిరెడ్డి కామెంట్స్ తెలంగాణ పాలిటిక్స్ లో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. రేవంత్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు, ఆరోపణలు చేస్తూ గతంలో కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎన్నికలకు ముందు మళ్లీ సొంతగూటికి చేరారు. మునుగోడు నుంచి బరిలోకి దిగి ఎమ్మెల్యేగా రెండో సారి విజయం సాధించారు.
ఎన్నికల తర్వాత కాంగ్రెస్ (Congress) అధికారంలోకి రావడంతో ఆయన మంత్రి పదవిని ఆశించారు. కానీ, రేవంత్ రెడ్డి మాత్రం రాజగోపాల్ రెడ్డి సోదరుడు వెంకట్ రెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకున్నారు. అయితే.. మంత్రి పదవిపై తన కోరికను ఎప్పడికప్పుడూ బహిరంగంగానే వ్యక్తం చేస్తూ వస్తున్నారు రాజగోపాల్ రెడ్డి. పార్లమెంట్ ఎన్నికల సమయంలో భువనగిరి నియోజకవర్గ ఇంఛార్జిగా ఆయనను కాంగ్రెస్ నియమించింది. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపిస్తే తాను మంత్రి అవుతానంటూ కార్యకర్తలకు రాజగోపాల్ రెడ్డి పిలుపునిచ్చారు.
అయితే.. అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి విజయం సాధించారు. అనంతరం.. తాను హోంమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారని రాజగోపాల్ రెడ్డి ఓ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. రేవంత్ రెడ్డిపై కోపంతో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారా? లేదా అసమ్మతి రాజకీయాలకు తెరలేపారా? అన్న అంశంపై జోరుగా చర్చ సాగుతోంది.
ఈ వార్త అప్డేట్ అవుతోంది..