West Bengal: ట్రైనీ డాక్టర్‌పై హత్యాచార ఘటన.. పశ్చిమ బెంగాల్‌ పాలనలో చీకటి అధ్యాయం

ట్రైనీ డాక్టర్‌ హత్యాచార ఘటన నేపథ్యంలో పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీపై తీవ్రంగా విమర్శలు వస్తున్నాయి. నిందితులను రక్షించేందుకు ఆమె ప్రయత్నిస్తున్నారంటూ పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఈ ఘటన ప్రస్తుతం మమతా బెనర్జీకి అగ్ని పరీక్షగా మారింది.

New Update
West Bengal: ట్రైనీ డాక్టర్‌పై హత్యాచార ఘటన.. పశ్చిమ బెంగాల్‌ పాలనలో చీకటి అధ్యాయం

కోలకతాలోని ఆర్‌జీ కార్ మెడికల్ కళాశాలలో ఆగస్టు 9న ట్రైనీ డాక్టర్‌పై హత్యాచారం జరగడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా వైద్యులు, వైద్య సిబ్బంది ఈ ఘటనపై పెద్ద ఎత్తున నిరసనలు, ఆందోళనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఘటనను సుప్రీకోర్టు సుమోటోగా స్వీకరించింది మంగళవారం విచారించింది. ఈ ఘటనలో పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం పూర్తిగా చేతులెత్తిసిందంటూ చురకలంటించింది.

సుప్రీంకోర్టు సీరియస్

''ఈ ఉదంతంలో ఎఫ్‌ఐఆర్ దాఖలు చేయడం ఎందుకు ఆలస్యమైంది ? అల్లరి మూకలు ఆర్జీకార్ ఆస్పత్రిలో దాడులు చేసేందుకు వస్తే ప్రభుత్వం ఎలా అనుమతించింది ?. నేరం జరిగిన చోట భద్రతను కట్టుదిట్టం చేయడం పోలీసులు బాధ్యత కదా. నేరం జరిగిన తర్వాత మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ ఇది ఆత్మహత్య ఘటనగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. బాధితురాలి తల్లిదండ్రులకు కూడా ఆమె మృతదేహాన్ని చూపించలేకపోయారు'' అంటూ ఈ ఘటనపై సుప్రీంకోర్టు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంపై, ఆస్పత్రి యాజమాన్యంపై సీరియస్ అయ్యింది.

ఉద్దేశపూర్వకంగా చేశారా ? 

ప్రస్తుతం ఈ హత్యాచార ఘటనపై పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీపై తీవ్రంగా విమర్శలు వస్తున్నాయి. ఆమె రాజీనామా చేయాలంటూ కూడా నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఈ ఘటనపై సీబీఐ రంగంలోకి దిగినప్పటికీ కూడా.. ఆమెపై విమర్శలు తగ్గడం లేదు. సరైన గడువు లేకుండా వెంటనే సీబీఐ దర్యాప్తు జరపాలని మమతా డిమాండ్ చేయడం పొలిటకల్ స్టంట్ అంటూ విమర్శలు చేస్తున్నారు. ట్రైనీ డాక్టర్‌పై హత్యాచారం జరిగిన అనంతరం పెద్దఎత్తున డాక్టర్లు నిరసనలు చేశారు. బాధితురాలికి న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు. కానీ అదే సమయంలో అల్లరి మూకలు ఆస్పత్రిపై దాడులు చేశాయి. దీనివల్ల ఈ కేసుకి సంబంధించి ఉద్దేశపూర్వంగానే ఆధారాలను తొలగించాలని చూశారని.. విచారణకు ఆటంకం కలిగించేలా యత్నించారని కూడా ఆరోపణలు వస్తున్నాయి. ఈ దాడులకు పాల్పడిన వారిలో టీఎంసీ పార్టీ సభ్యలు కూడా ఉన్నట్లు సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డయినట్లు తేలడం మరింత అనుమానాలను రేకెత్తిస్తోంది.

మెడికల్ మాఫియా ఉందా ?

ఈ ఘటనపై ఇప్పటికీ సమాధానం దొరకని ప్రశ్నలు ఉన్నాయి. బాధితురాలి మృతదేహాన్ని ఆమె తల్లిదండ్రులకు వెంటనే ఎందుకు చూపించలేదు ?. ఎవరూ ఇలా ఆలస్యం చేసేలా చేశారు ?. నేరం జరిగిన చోట ఏం జరిగింది ? ఈ దారుణం జరిగిన ప్రదేశం వద్ద ప్రతి డిపార్ట్‌మెంట్‌లో అకస్మాత్తుగా నిర్వహణ పనులు ఎందుకు ప్రారంభించారు, ఇది నేరం జరిగిన స్థలాన్ని తారుమారు చేసే అవకాశం ఉందా ? ఇందులో మెడికల్ మాఫియా ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో ఉన్న పెద్ద తలకాయలు ఈ ఘటనను కంట్రోల్ చేసే అవకాశం కనిపిస్తోంది. ఈ కేసును తప్పుదారి పట్టించేందుకు యత్నించిన కళాశాల ప్రిన్సిపల్‌పై చర్యలు తీసుకునేందుకు నిర్లక్ష్యం వహించడం మరింత అనుమానాలకు దారితీస్తోంది.

మమత బెనర్జీకి అగ్నిపరీక్ష

ప్రస్తుతం ఈ ఘటనపై సీబీఐ విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో.. పశ్చిమ బెంగాల్‌తో సహా.. దేశమొత్తం ఈ వ్యవహారాన్ని దగ్గర నుంచి గమనిస్తోంది. ఈ ఘటన పశ్చిమ బెంగాల్ చట్టాల అమలు, పరిపాలనలో ఉన్న తీవ్రమైన లోపాలను బయటపెట్టింది. ఈ ఘటనపై పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం సరైన సమాధానాలు ఇవ్వకపోవడం, హింసాకాండ జరగడం అనేది మహిళల భద్రతపై ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం ఇది మమతా బెనర్జీకి అగ్ని పరీక్షగా మారింది. చాలామంది ఆమె విఫలమైనట్లు అనుకుంటున్నారు. ఈ కేసులో న్యాయం జరగాలని డిమాండ్ చేయడం కేవలం బాధితురాలు ఆమె కుటుంబం కోసం కాదు. ప్రభుత్వంలో ఉండి బాధితుల కంటే బలవంతులకు రక్షణ కల్పించేలా చూసేవారిని పాలద్రోలడం కూడా.

Advertisment
తాజా కథనాలు