Kishan Reddy: తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ ఇవ్వలేదని, ఆ పార్టీ మెడలు వంచి తెలంగాణ ప్రజలు రాష్ట్రం తెచ్చుకున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నాయకుడు చిదంబరం వ్యాఖ్యలపై ఆయన స్పందిస్తూ, 1969 ఉద్యమ సమయంలో కాంగ్రెస్ 365 మంది అమాయకుల ప్రాణాలు బలిగొన్నదని విమర్శించారు. రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో తాత్సారం చేసి మలిదశ ఉద్యమంలోనూ 1200 మంది ఆత్మ బలిదానాలకు కారణమైందన్నారు. రాష్ట్ర ఏర్పాటు కోసం తెలంగాణ సకల జనులూ ఏకమై పోరాడారని, రాష్ట్ర ఉద్యమానికి బీజేపీ సంపూర్ణంగా మద్దతు ప్రకటించిందని కిషన్ రెడ్డి చెప్పారు. సుష్మాస్వరాజ్ నేతృత్వంలో 160 మంది బీజేపీ ఎంపీలు పార్లమెంటు లోపలా బయటా తెలంగాణకు నిర్ద్వంద్వంగా మద్దతు తెలిపి ప్రజల ఆకాంక్షను గౌరవించారన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో కర్కశంగా వ్యవహరించిన కాంగ్రెస్ ఉద్యమంపైనా నియంతలా వ్యవహరించిందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీని తెలంగాణ ప్రజలు ఎన్నటికీ క్షమించరన్న కిషన్ రెడ్డి తెలంగాణ ప్రజలు బీజేపీని ఆదరిస్తారని ధీమా వ్యక్తం చేశారు.
ఇది కూడా చదవండి: కేసీఆర్, కేటీఆర్ కాళ్ల బేరానికి వచ్చారు!.. కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు