KIA - TESLA : కియా,టెస్లాతోపాటు మరో రెండు కార్ల కంపెనీలు లక్షకు పైగా కార్లను వెనక్కి తీసుకోనున్నట్లు సమాచారం. ఆ కంపెనీల కార్లలో లోపాల వల్ల కంపెనీలు ఆ కార్లను వెనక్కి తీసుకోవాలని నిర్ణయించుకున్నాయి. ఈ విషయాన్ని దక్షిణ కొరియా (South Korea) రవాణా మంత్రిత్వశాఖ బుధవారం తెలిపింది. కార్లను రీకాల్ చేస్తున్న నాలుగు కంపెనీల్లో టెస్లా, కియాతో పాటు ఫోర్డ్ మోటార్, జీఎం ఏసియా పసిఫిక్ కూడా ఉన్నాయి.
నాలుగు కంపెనీలకు సంబంధించిన ఏడు మోడల్స్‌లో 1,03,543 కార్లలో లోపాలు ఉన్నట్లు కంపెనీలు గుర్తించాయి. టెస్లా (TESLA) కంపెనీ కార్లలోని మోడల్ Y లో సాఫ్ట్‌వేర్ లోపం ఉందని నిపుణులు గుర్తించారు. కియా ప్రైడ్ కాంపాక్ట్ కారులోని హైడ్రాలిక్ ఎలక్ట్రిక్ కంట్రోల్ యూనిట్‌లో డ్యూరెబిలిటీ లేకపోవడంతో వాటిని వెనక్కి తీసుకుంటున్నారు.
అదేవిధంగా ఫోర్డ్ కంపెనీకి చెందిన Lincoln MKX SUV కారులో బ్రేక్ బూస్టర్‌లో లోపం ఉన్నట్లు నిపుణులు గుర్తించారు. జీఎం ఏసియా పసిఫిక్ కంపెనీకి చెందిన Cadillac Lyriq All-Electric Sedan కారులో ఎలక్ట్రిక్ బ్రేక్ కంట్రోల్ మాడ్యూల్‌లో లోపం నిర్థారణ అయ్యింది. వాహన యజమానులు www.car.go.kr వెబ్‌సైట్ ద్వారాగానీ, 080-357-2500 నెంబర్‌కు కాల్ చేయడం ద్వారాగానీ తమ కారు రీకాల్ లిస్టులో ఉందో.. లేదో తెలుసుకోవచ్చని దక్షిణ కొరియా రవాణా మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ నెల ఆరంభంలో కూడా బీఎండబ్ల్యూ కొరియా, హుందాయ్ మోటార్, రెండు ఇతర కంపెనీలు తయారీ లోపాల కారణంగా స్వచ్ఛందంగా 1,72,000 వాహనాలను వెనక్కి తీసుకున్న విషయం తెలిసిందే.
Also Read: ఓటు కు నోటు కేసులో చంద్రబాబు కు భారీ ఊరట