Ponguleti Srinivas Reddy: వ్యూహం మార్చిన పొంగులేటి.. అక్కడి నుంచి పోటీకి ఏర్పాట్లు?

ఇన్నాళ్లు కొత్తగూడెం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు సిద్ధమైన ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి తాజాగా వ్యూహాన్ని మార్చారు. పాలేరు నియోజకవర్గంపై ఆయన దృష్టి సారించినట్లు తెలుస్తోంది. పొత్తుల్లో భాగంగా కొత్తగూడెం సీటును సీపీఐకి కేటాయించే అవకాశం ఉందన్న ప్రచారంతోనే ఆయన తన వ్యూహాన్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది.

New Update
Ponguleti Srinivas Reddy: వ్యూహం మార్చిన పొంగులేటి.. అక్కడి నుంచి పోటీకి ఏర్పాట్లు?

ఖమ్మం మాజీ ఎంపీ, కాంగ్రెస్ ప్రచార కమిటీ రాష్ట్ర కో-కన్వీనర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) తాజాగా తన వ్యూహాన్ని మార్చుకున్నారు. ఇన్నాళ్లు కొత్తగూడెం నుంచి పోటీకి సై అన్న పొంగులేటి తాజాగా పాలేరు నియోజకవర్గంపై దృష్టి సారించారు. సడెన్ గా ఆయన వ్యూహం ఎందుకు మారిందన్న అంశంపై ఖమ్మం జిల్లా పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా చర్చ సాగుతోంది. గతంలో కొత్తగూడెం నుంచి ప్రస్తుతం సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న కూనంనేని సాంబశివరావు పోటీ చేసి గెలుపొందారు. అయితే.. సీపీఐ, కాంగ్రెస్ పొత్తు కుదిరితే ఆయన కొత్తగూడెం సీటును అడిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే పొంగులేటి పాలేరులోనూ పోటీకి ఏర్పాట్లు చేస్తుంటున్నారా? అన్న చర్చ కాంగ్రెస్ శ్రేణుల్లో సాగుతోంది. ఒకవేళ పొంగులేటి పాలేరులో పోటీ చేస్తే ఇటీవల పార్టీలో చేరిన తుమ్మల నాగేశ్వరరావు పరిస్థితి ఏంటన్నది కూడా అంతుచిక్కని ప్రశ్నగా మారింది.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కేవలం మూడు జనరల్ స్థానాలు మాత్రమే ఉన్నాయి. అయితే.. పొంగులేటి ఈ మూడు స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థిత్వాన్ని కోరుతూ దరఖాస్తు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఓ వైపు పాలేరుపై దృష్టి సారిస్తూనే మరో వైపు ఈ రోజు ఖమ్మం నియోజకవర్గంలోనూ పొంగులేటి ఈరోజు పర్యటించారు.

దీంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న మూడు జనరల్ స్థానాల్లో ఎక్కడి నుంచైనా పొంగులేటి పోటీ చేసే అవకాశం ఉందన్న చర్చ జోరుగా సాగుతోంది. అయితే.. ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే అంశంపై ఇంత వరకు పొంగులేటి స్పష్టత ఇవ్వడం లేదు. తన అనుచరులకు కూడా ఈ విషయమై ఆయన క్లారిటీ ఇవ్వడం లేదని తెలుస్తోంది. పొంగులేటి ఎత్తుగడలు ఏంటో అర్థం కాక ప్రత్యర్థులతో పాటు సొంత పార్టీ కాంగ్రెస్ ఆశావాహులు కూడా గందరగోళానికి గురవుతున్నారు.

ఇవి కూడా చదవండి: 
TDP New Committee: టీడీపీ పొలిటికల్ యాక్షన్ కమిటీ.. బాలకృష్ణ, లోకేష్ తో పాటు మరో 12 మందికి చోటు.. లిస్ట్ ఇదే!

Advertisment
తాజా కథనాలు