DSC Exam : డిగ్రీ (Degree) లో మార్కులు తక్కువ వచ్చిన కారణంగా డీఎస్సీ (DSC) రాసేందుకు అర్హత కోల్పోయిన అభ్యర్థులకు తెలంగాణ (Telangana) ప్రభుత్వం ఓ గుడ్ న్యూస్ చెప్పింది. 2011కు ముందు డిగ్రీ పాసైన అభ్యర్థులు మార్కులతో సంబంధం లేకుండా డీఎస్సీకి దరఖాస్తు చేసుకోవచ్చని తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది.
ఈ క్రమంలోనే డీఎస్సీ రాయాలంటే డిగ్రీల్లో ఉండాల్సిన కనీస మార్కుల శాతాన్ని ప్రభుత్వం తగ్గించింది. ఇక నుంచి జనరల్ కేటగిరీ అభ్యర్థులకు 45 శాతం, ఇతరులకు 40 శాతం మార్కులు ఉంటే సరిపోతుందని పేర్కొంది. ఇప్పటి వరకు జనరల్ కేటగిరీ అభ్యర్థులకు 50 శాతం, ఇతరులకు 45 శాతం మార్కుల నిబంధన ఉండేది.
కాగా భాషా పండితులు, పీఈటీలకు ఈ కనీస మార్కుల నిబంధన వర్తించదు. వారు డిగ్రీ పాసైతే సరిపోతుంది. ఈ మేరకు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం జీవో నంబర్ 14ను విడుదల చేశారు. ఎన్సీటీఈ నిబంధనల ప్రకారం.. స్కూల్ అసిస్టెంట్, లాంగ్వేజీ పండిట్, పీఈటీ తదితర పోస్టుల మార్కుల శాతాన్ని తగ్గించారు. ఈనెల 20 వరకు డీఎస్సీ దరఖాస్తుకు అవకాశం ఉండడంతో తక్కువ మార్కులున్న అభ్యర్థులు అప్లై చేసుకునేందుకు అవకాశం వచ్చింది.