KCR on Election 2024: తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల ప్రచార సమయం ముగిసింది. దానికి కొద్దిగా ముందుగా మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖర్ రావు ఈ ఎన్నికల తరువాత ప్రాంతీయపార్టీలు కేంద్రంలో చక్రం తిప్పుతాయని చెప్పారు. తెలంగాణ భవన్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన పలు విషయాలపై మాట్లాడారు. దేశంలో బీజేపీ హవా తగ్గిందన్న ఆయన.. జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ కీలక పాత్ర పోషిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. తెలంగాణలో 12-14 లోక్‌సభ స్థానాలను బీఆర్ఎస్ గెలుచుకోబోతోందని ధీమా వ్యక్తం చేశారు.
KCR on Election 2024: తనకున్న అనుభవంతో ఈసారి ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలే దేశాన్నీ పాలించబోయే పరిస్థితి రాబోతోందని చెప్పగలను అని కేసీఆర్ అన్నారు. జాతీయ పార్టీలు ముందుకొస్తే.. బలమైన కూటమి ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇక తెలంగాణలో బీజేపీకి అంత సీన్ లేదని.. ఒక్క సీటు కూడా రావడం కష్టమేనని అన్నారు. అంతేకాకుండా, మొత్తం దక్షిణాదిలో 130 లోక్‌సభ సీట్లు ఉన్నాయని వాటిలో బీజేపీ 10 సీట్లు గెలుచుకోవడం కూడా క్లిష్టమైన విషయమని ఆయన అభిప్రాయపడ్డారు. ఈసారి 400 సీట్లు అనే బీజేపీ నినాదం ఒక చెత్త అని కేసీఆర్ పేర్కొన్నారు. బీజేపీ ఈసారి 220 సీట్లకంటే ఎక్కువ గెలుచుకోలేదని చెప్పిన కేసీఆర్ ఉత్తర భారతదేశంలో బీజేపీ గ్రాఫ్ పడిపోయిందన్నారు. ఆ నిరాశతోనే మోదీ తన ఎన్నికల ప్రచారంలో ముస్లింలు, రిజర్వేషన్లు, మతతత్వ ప్రసంగాలు చేస్తూ వచ్చారని కేసీఆర్ చెప్పారు.
Also Read: వంద శాతం ప్రధాని రేసులో ఉంటాను: కేసీఆర్
KCR on Election 2024: మరోవైపు కాంగ్రెస్ కూడా గడ్డుపరిస్థితిని ఎదుర్కొంటుందని.. ఈసారి లోక్‌సభ ఎన్నికలలో జాతీయస్థాయిలో ఆశ్చర్యకర ఫలితాలను చూడబోతున్నామని కేసీఆర్ అన్నారు. ప్రాంతీయపార్టీల సహకారంతో కూటమిగానే ఈ ఎన్నికల తరువాత ప్రభుత్వం ఏర్పాటు కావచ్చన్నారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత, ఇప్పటికే తనతో టచ్ లో ఉన్న ప్రాంతీయపార్టీలను ఒక్కతాటిపై తెచ్చెదుకు ప్రయత్నాలను ప్రారంభిస్తానని కేసీఆర్ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ఈ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలిస్తే, తెలంగాణ ప్రజల ప్రయోజనాలు కాపేదేందుకు పోరాటం చేయగలుగుతుందని కేసీఆర్ చెప్పారు.