
అస్వస్థతతో కన్నుమూత
రాజ్యసభ మాజీ సభ్యులు సోలిపేట రామచంద్రారెడ్డి ఈ ఉదయం అస్వస్థతతో హైదరాబాద్‌లో కన్నుమూశారు. ఆయన వయసు 92 సంవత్సరాలు. సిద్దిపేట జిల్లా చిట్టాపూర్‌కి చెందిన రామచంద్రారెడ్డి తొలితరం కమ్యూనిస్టు నాయకుల స్ఫూర్తితో తెలంగాణ రైతాంగ పోరాటంలో పాల్గొన్నారు.
రేపటి తరానికి స్ఫూర్తిదాయకం
మాజీ ఎంపీ సోలిపేట రామచంద్రారెడ్డి మరణం పట్ల సీఎం కేసీఆర్ సంతాపాన్ని ప్రకటించారు. తొలితరం కమ్యూనిస్టు నేతగా, నాటి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో పాల్గొన్న సోలిపేట జీవితం ఆదర్శవంతమైనదని సీఎం తెలిపారు. ఆయన రాజకీయ జీవితంలో సర్పంచి స్థాయి నుంచి ఎమ్మెల్యేగా, ఎంపీగా ప్రజా జీవితంలో ఉన్నత స్థాయికి ఎదిగిన క్రమం రేపటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.
ప్రగాఢ సానుభూతి
సిద్దిపేట ప్రాంత వాసిగా, రాజకీయ. సామాజిక రంగాల్లో వారు ఆచరించిన కార్యాచరణ, ప్రజా జీవితంలో కొనసాగుతున్న తమ లాంటి ఎందరో నేతలకు ప్రేరణగా నిలిచారని అన్నారు. సోలిపేట రామచంద్రారెడ్డి మరణంతో తెలంగాణ మరో తొలి తరం ప్రజానేతను కోల్పోయిందన్నారు. వారి కుటుంబ సభ్యులకు సీఎం తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
ఎనలేని సేవలు
సిటీ కాలేజీలో పట్టభద్రులైన రామచంద్రారెడ్డి తర్వాత రాజకీయాల్లో పూర్తి కాలం పనిచేశారు. స్వగ్రామం చిట్టాపూర్ సర్పంచ్‌గా, దుబ్బాక సమితి అధ్యక్షుడిగా, సిద్దిపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా, అప్పటి మెదక్ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు అధ్యక్షుడిగా, దొమ్మాట ఎమ్మెల్యేగా సేవలందించారు.