/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/cbn-1-jpg.webp)
తెలంగాణలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేసే విషయంలో ఎవ్వరికీ ఎలాంటి సందేహం అక్కర్లేదనీ, బరాబర్ పోటీ చేసి తీరతామని టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ భవన్‌లో ఆయన మాట్లాడారు. గెలుపే లక్ష్యంగా మొత్తం 87 స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించామని, ఇప్పటికే బలమైన అభ్యర్థులను సిద్ధం చేశామని పేర్కొన్నారు. చంద్రబాబు ఆమోదముద్ర వేయగానే అభ్యర్థుల జాబితా ప్రకటిస్తామన్నారు. అభ్యర్థుల పేర్లతో పాటు మేనిఫెస్టో కూడా విడుదల చేస్తామన్నారు.
ఇటీవల రాజమహేంద్రవరం జైలులో పార్టీ అధినేత చంద్రబాబును ములాఖత్‌లో కలిసినప్పుడు తెలంగాణలో రాజకీయ పరిస్థితులను ఆయనకు వివరించానన్నారు. ఈ ఎన్నికల్లో తెలంగాణ టీడీపీ ప్రచార సారథిగా హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వ్యవహరించనున్నారని కాసాని వెల్లడించారు. పొత్తుల విషయంలో ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తమతో సంప్రదింపులు జరిపారనీ, తమ అధినేతతో సంప్రదించి జనసేనతో కలిసి ఎన్నికలకు వెళ్లే అంశంపై త్వరలోనే ఒక నిర్ణయం ప్రకటిస్తామని పేర్కొన్నారు. కాగా ఇప్పటికే జనసేన తెలంగాణలో 32 స్థానాల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించడమే కాకుండా, అభ్యర్థులను కూడా ప్రకటించిన విషయం తెలిసిందే.
బీసీలకు పెద్ద పీట
టీడీపీ ఎన్నికల బరిలో ఉండదని జరుగుతున్న ప్రచారంపై కాసాని స్పందించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కన్నా టీడీపీ బలంగా ఉందన్న ఆయన.. వదంతులను నమ్మొద్దని.. తప్పకుండా ఈ ఎన్నికల్లో టీడీపీ బరిలో ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. ఇతర పార్టీల నుండి టీడీపీలోకి వచ్చేందుకు చాలా మంది నేతలు సిద్ధంగా ఉన్నారన్నారు కాసాని జ్ఞానేశ్వర్. మేనిఫెస్టో కూడా సిద్ధంగా ఉందనీ, చంద్రబాబు ఆలోచనల ప్రకారం బీసీలకు పెద్ద పీట వేశామని పేర్కొన్నారు. అలాగే యువతకు మేనిఫెస్టోలో ప్రాధాన్యత ఉంటుందన్నారు. త్వరలోనే అభ్యర్థుల లిస్టు వెల్లడిస్తామని స్పష్టం చేశారు. ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో తమ పార్టీ నేతలు ప్రచారంలో ఉన్నారని చెప్పారు. గ్రేటర్‌లో కాకుండా తెలంగాణలోని అన్ని జిల్లాలకు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రచారంలో పాల్గొంటారని వివరించారు. మంగళవారం నాడు సుప్రీం కోర్టులో కేసు కొలిక్కి వస్తుందని, చంద్రబాబు నిర్ధోషిగా విడుదలై బయటకొస్తారన్న నమ్మకం తమకు ఉందని చెప్పారు.