కర్ణాటక (Karnataka) కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం పై తెలంగాణ ఐటీ మినిస్టర్ కేటీఆర్ (Ktr) సంచలన ఆరోపణలు చేశారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా ఏర్పాటైన విషయం తెలిసిందే..ఆ ప్రభుత్వం పొలిటికల్ ఎలక్షన్ ట్యాక్స్ (Election tax)ను వసూలు చేస్తుందని ఆయన విమర్శించారు. కర్ణాటక రాజధాని నగరంలో బిల్డర్ల నుంచి అడుగుకు రూ. 500 చొప్పున కాంగ్రెస్ ప్రభుత్వం వసూలు చేస్తోందని ఆరోపించారు.
తెలంగాణ (Telangana) రాష్ట్రంలో జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆర్థికంగా సాయం చేయడానికే ఈ వసూళ్లకు కర్ణాటక ప్రభుత్వం పాల్పడుతుందని ఆయన ట్విట్టర్ వేదికగా ఆరోపణలు చేశారు. ఎంతో పాత కాలం నాటి పార్టీ అని చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వానికి పాత కాలపు అలవాట్లు పోలేదని విరుచుకుపడ్డారు.
స్కాములు చేస్తున్న వారి వారసత్వాన్ని కాంగ్రెస్ అలాగే కొనసాగిస్తుందని విమర్శించారు. అందుకే ఎవరైనా కాంగ్రెస్ ను కాంగ్రెస్ అనడం మానేసి స్కామ్‌గ్రెస్ అని కొత్త పేరు పెట్టి పిలుస్తున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రజలకు డబ్బులు ఎరగా వేయాలని చూస్తున్నప్పటికీ ఇక్కడ మోస పోవడానికి ఒక్కరు కూడా సిద్ధంగా లేరని ఆయన అన్నారు.
తెలంగాణ ప్రజలు స్కామ్‌గ్రెస్ ను నమ్మడం ఎప్పుడో మానేశారని ఆయన అన్నారు. తెలంగాణ కాంగ్రెస్ లో ఎవరూ చేరాలని చూసినా కూడా ముందుగా బెంగళూరుకు వెళ్లి డీకే శివ కుమార్ ఆశీస్సులు తీసుకుని రావాలని ఎద్దేవా చేశారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా కీలకమైన నిర్ణయాలు డీకే శివకుమార్‌ను అడిగే తీసుకుంటున్నారని ఆరోపించారు.
ఇప్పుడు తెలంగాణలో ఏదైనా పని జరగాలంటే..బెంగళూరులో పావులు కదపాల్సి వస్తుందని ఆయన విమర్శించారు. ఎందుకంటే తెలంగాణ కాంగ్రెస్ జుట్టు బెంగళూరులోని డీకే చేతిలో ఉందని ఆయన ఆరోపించారు. ఇప్పుడు కర్ణాటకలో అధికారంలో ఉండటంతో తెలంగాణ ఎన్నికల కోసం డీకేనే ఆర్థిక అండ ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.