ఐటీ ఉద్యోగుల మద్దతు
టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును ఖండిస్తూ, ఆయనకు మద్దతుగా ఐటీ ఉద్యోగులు కందుకూరులో శనివారం సాయంత్రం క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ ఇంటూరి నాగేశ్వరరావు కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. కాగడాలు, క్యాండిల్స్ పట్టుకొని నినాదాలు చేసుకుంటూ పోస్ట్ ఆఫీస్ సెంటర్ మీదుగా ఎన్టీఆర్ విగ్రహం వద్దకు చేరుకున్నారు. అక్కడ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
This browser does not support the video element.
ఈ సందర్భంగా పలువురు ఐటీ ఉద్యోగులు మాట్లాడుతూ.. ఈ రోజు కొన్ని కోట్ల మంది ఐటీ రంగంలో స్థిరపడటానికి, ఉన్నత ఉద్యోగ అవకాశాలు పొందడానికి చంద్రబాబు నాయుడు కారణమన్నారు. ప్రతి గ్రామంలో వందల మంది ఐటీ ఉద్యోగులు ఉన్నారని, వారి కుటుంబాలు ఎల్లప్పడూ చంద్రబాబుకి రుణపడి ఉంటాయని అన్నారు. హైదరాబాద్‌లో ప్రముఖ ఐటీ కంపెనీలన్నీ తమ బ్రాంచ్‌లు ఏర్పాటు చేయడానికి, చంద్రబాబు దేశ విదేశాలు తిరిగి ఎంతో కష్టపడ్డారని అన్నారు. ఐటీ ఉద్యోగులందరూ చంద్రబాబు అరెస్టుతో ఆవేదన చెంది రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలుపుతున్నారని, ఆయన జైలు నుంచి విడుదల అయ్యేదాకా తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు హయాంలో ఏర్పాటు చేసిన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లలో ఎంతోమంది శిక్షణ పొంది ఉద్యోగాలు సంపాదించుకున్నారని ఆయన గుర్తు చేశారు.
This browser does not support the video element.
ఇంటూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ.. ఎప్పుడూ రోడ్లపైకి రాని ఐటీ ఉద్యోగులు, ఈరోజు చంద్రబాబుకి అండగా నిలిచేందుకు ముందుకు రావడం అభినందనీయమన్నారు. ఇన్ని కోట్ల మంది గుండెల్లో నిలిచిపోయిన చంద్రబాబు నాయుడు, జైల్లో ఉండటం బాధాకరంగా ఉందన్నారు. స్కిల్ డెవలప్మెంట్ కేసు విషయంలో, ఎలాంటి అవినీతి జరగకపోయినా, కేవలం రాజకీయ కక్షతో ఆయనపై కుట్ర చేసి కేసు పెట్టారని నాగేశ్వరరావు ఆరోపించారు. సీఎం జగన్ ఇకనైనా బుద్ధి తెచ్చుకొని, చంద్రబాబు నాయుడు విషయంలో తప్పు సరిదిద్దుకోవాలని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ ఇంటూరి నాగేశ్వరరావు హెచ్చరించారు.
This browser does not support the video element.