America elections 2024: కమలా హ్యారిస్.. ఈ పేరే ఓ సంచలనం.. అగ్రరాజ్యానికి తొలి మహిళా ఉపాధ్యక్షురాలు ఆమె. ఈ పదవిలో కొనసాగిన తొలి నల్లజాతీయురాలు కూడా కమలనే.. అంతేకాదు సామాన్య కుటుంబం నుంచి వచ్చి అమెరికాకు ఉపాధ్యక్షురాలిగా ఎదిగిన తొలి ప్రవాస భారతీయురాలు కూడా ఆమెనే.. ఇలా ఎన్నో ప్రత్యేకతల్ని సొంతం చేసుకున్న కమలా హ్యారిస్ మరోసారి టాక్ ఆఫ్ ది వరల్డ్‌గా మారారు. ఈ ఏడాది నవంబర్ 5న జరగనున్న అధ్యక్ష ఎన్నికల రేసు నుంచి అమెరికా అధ్యక్షుడు జో బైడన్ తప్పుకున్నారు. ఆ వెంటనే కమలను డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా ప్రకటించారు. దీంతో బైడెన్ వర్సెస్ ట్రంప్ పోరు కాస్త కమల వర్సెస్ ట్రంప్ ఫైట్‌గా మారింది.
భారతీయ మూలానికి చెందిన మహిళ..
కమలా హారిస్ అక్టోబర్ 20, 1964న కాలిఫోర్నియాలో జన్మించారు. కమల తల్లి పేరు శ్యామలా గోపాలన్. ఆమె భారతీయ మూలానికి చెందిన మహిళ.. ఆమె క్యాన్సర్ శాస్త్రవేత్త కూడా. శ్యామలా గోపాలన్ చెన్నైలో పుట్టి, తర్వాత 1960లో అమెరికాకు వెళ్లారు. ఇక కమల తండ్రి పేరు డొనాల్డ్ హారిస్. ఆయన జమైకన్ మూలానికి చెందినవాడు. కమలా హారిస్‌కు ఐదేళ్లు ఉన్నప్పుడు తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నారు. ఇద్దరూ విడివిడిగా జీవించడం ప్రారంభించారు. విడాకుల తర్వాత కమల, ఆమె చెల్లెలు మాయను తల్లి శ్యామల గోపాలన్ పెంచారు.
ఇండియన్ కల్చర్ బాగా తెలుసు..
కమల తల్లి తన ఇద్దరు కూతుళ్లను అప్పుడప్పుడూ ఇండియాకు, తమిళనాడులోని తన స్వగ్రామానికి తీసుకొచ్చేవారు. అందుకే ఇండియన్ కల్చర్ గురించి కమలకు బాగా తెలుసు. ఆమెకు ఇండియన్ ఫుడ్ అంటే చాలా ఇష్టం కూడా. కమల హారిస్ బాల్యం కెనడాలో గడిచింది. పాఠశాల విద్య కూడా అక్కడే జరిగింది. ఇక కమల తల్లి శ్యామలా గోపాలన్‌కి మెక్‌గిల్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ ఉద్యోగం రావడంతో కొన్నాళ్లు అక్కడికి మారాల్సి వచ్చింది. పిల్లలిద్దరినీ కూడా తన వెంట తీసుకెళ్లింది. కమలా హారిస్ హార్వర్డ్ విశ్వవిద్యాలయం నుంచి పట్టభద్రురాలయ్యారు. ఆ తర్వాత ఆమె కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలోని హేస్టింగ్స్ కళాశాల నుంచి న్యాయశాస్త్రం అభ్యసించారు. 2014లో కమల యూదు మూలానికి చెందిన ప్రసిద్ధ న్యాయవాది డగ్లస్ క్రెయిగ్‌ను పెళ్ళి చేసుకున్నారు.
ఇది కూడా చదవండి: UPSC: దివ్యాంగులు కలెక్టర్లు కావొద్దా?.. స్మిత వ్యాఖ్యల్లో వాస్తవం ఉందా?
అటార్నీ నుంచి సెనేటర్ వరకు..
అటు రాజకీయ జీవితానికి వస్తే అటార్నీ నుంచి సెనేటర్ వరకు ఎదిగిన కమలా హారిస్.. తన పొలిటికల్ జర్నీలో ఎన్నో ఎత్తుపల్లాలను చూశారు. 2003లో మొదటిసారి శాన్ ఫ్రాన్సిస్కో జిల్లా అటార్నీగా ఎన్నికయ్యారు కమల. ఆ తర్వాత 2010, 2014 సంవత్సరాలలో కాలిఫోర్నియాకు అటార్నీ జనరల్‌గా ఎన్నికయ్యాను. ఇర ఆ తర్వాత కాలిఫోర్నియా జూనియర్ సెనేటర్‌గా ఎన్నికయ్యారు. ఆమె US సెనేట్‌లో చేరిన రెండో ఆఫ్రికన్-అమెరికన్ వ్యక్తి. అంతేకాదు మొదటి దక్షిణాసియా మహిళ కూడా. కమలా హారిస్ అమెరికాలో తుపాకీ నియంత్రణ కోసం కఠిన చట్టాలు ఉండాలని ప్రచారం చేశారు. అంతేకాదు వలసదారుల పౌరసత్వం అంశాన్ని కూడా గట్టిగా లేవనెత్తారు.
2019 నాటికి, డెమోక్రాట్‌ల తరపున కమలా హారిస్ అధ్యక్ష అభ్యర్థిత్వానికి అప్లై చేసుకున్నారు. అయితే, 2020 అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాట్లు జో బైడెన్‌ను తమ అభ్యర్థిగా చేశారు. కమలను ఉపాధ్యక్షురాలిగా నిలబెట్టారు. పార్టీ నిర్ణయాన్ని గౌరవించిన కమల బైడెన్‌కు వెంటన నిలబడ్డారు. 2020 అమెరికా ఎన్నికల్లో డెమొక్రాట్లు ఘన విజయం సాధించడంతో కమల ఉపాధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. ఇక ఈ ఏడాది డెమొక్రాటిక్ అధ్యక్ష అభ్యర్థిగా నిలిచారు. ఒకవేళ ఎన్నికల్లో డెమొక్రట్లు విజయం సాధింస్తే కమల చరిత్ర సృష్టిస్తారు. ఎందుకంటే 248ఏళ్ల స్వాతంత్ర అమెరికాలో ఇప్పటివరకు ఏ మహిళ కూడా అగ్రరాజ్యం అధ్యక్ష పదవిని చేపట్టలేదు.