Kadapa Result: సార్వత్రిక ఎన్నికల ఫలితాలకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. మరి కొద్దిగంటల్లో విజేతలు ఎవరో తేలిపోతుంది. అయితే, ఏపీలో ఎన్నికలకు సంబంధించి అందరిదృష్టిని ఆకర్షించిన నియోజకవర్గాలు ఉన్నాయి. వాటిలో కడప లోక్ సభ స్థానం ఒకటి. ఇక్కడ త్రిముఖపోటీ నెలకొంది. ఎప్పుడూ లేనివిధంగా ఇప్పుడు ఇక్కడ ఎవరు గెలుస్తారు అనేదానిపై గందరగోళ అంచనాలు వెలువడుతున్నాయి. ఎందుకంటే, వైఎస్ కుటుంబానికి కడప నియోజకవర్గం సొంతమైపోయిన పరిస్థితి చాలా ఏళ్లుగా ఉంది. ఇప్పుడు అక్కడ వైఎస్ కుటుంబం నుంచి ఇద్దరు పోటీలో ఉండడం ఆసక్తి కలిగిస్తోంది.
Kadapa Result: ఈసారి కడప పార్లమెంట్ స్థానానికి జరుగుతున్న ఎన్నికలు పార్టీలు లేదా.. మేనిఫెస్టోలు.. ఇలాంటి ఏ అంశాల మధ్య జరగడం లేదు. కేవలం వైఎస్ వివేకానంద రెడ్డి హత్య చుట్టూనే ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. పోటీచేసిన అభ్యర్థులు ఈ అంశంపైనే ఫోకస్ పెట్టారు. దీనినే హైలైట్ చేస్తూ ప్రచారం సాగించారు. ఇక్కడ వైసీపీ నుంచి అవినాష్ రెడ్డి బరిలో నిలిచారు. కాంగ్రెస్ నుంచి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె షర్మిల పోటీలో ఉన్నారు. ఇక టీడీపీ నుంచి భూపేష్‌రెడ్డి ఇక్కడ పోటీలో నిలిచారు. అయితే, ప్రధాన పోటీ మాత్రం అవినాష్ రెడ్డి, షర్మిల మధ్యనే ఉండొచ్చనే అంచనాలు ఉన్నాయి. సీఎం జగన్మోహన్ రెడ్డి కడప నుంచి అవినాష్ రెడ్డిని గెలిపించాలి అంటూ గట్టిగానే ప్రచారం చేశారు. షర్మిలను గెలిపించాలని వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ సునీత ప్రచారంలో జోరుగా తిరిగారు. ఇదంతా ఒకెత్తు అయితే, అమెరికాలో ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి సతీమణి.. స్వయంగా షర్మిలను గెలిపించాలంటూ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.
Also Read: గెలిచేదెవరు? బద్దలవబోతున్న నిశ్శబ్దం..కౌంటింగ్ లైవ్ అప్ డేట్స్!
Kadapa Result: అవినాష్ రెడ్డి గెలుపు ఇక్కడ నల్లేరుపై నడకే అని మొదట్లో అనుకున్నారు. కానీ, షర్మిల ఎంట్రీతో పరిస్థితి మారింది. దానికి తోడుగా వైఎస్ విజయమ్మ చేసిన విజ్ఞప్తి పరిస్థితిని మార్చేసింది. దీంతో అవినాష్ రెడ్డి.. షర్మిల మధ్య పోటీ నువ్వానేనా అన్నట్టుగా తయారైంది అని చెబుతున్నారు. అవినాష్ రెడ్డి కారణంగానే తన తండ్రి చనిపోయారంటూ వివేకానంద రెడ్డి కుమార్తె పదే, పదే ఆరోపణలు చేస్తూ షర్మిలకు అనుకూలంగా ఓటు వేయాలంటూ నిర్వహించిన ప్రచారం ఇక్కడ గట్టిగా ప్రభావం చూపిస్తుందని అంచనా వేస్తున్నారు.
Kadapa Result: మొత్తమ్మీద కడప గడపలో ఎవరు గెలుస్తారు అనే ఉత్కంఠ రాష్ట్రవ్యాప్తంగా ఉంది. కడపలో వైఎస్ జగన్ ప్రతిష్టకు.. షర్మిల పోరాటానికి మధ్య ఓటరు ఎవరికీ జై కొడతారు అనేది కొద్దిగంటల్లో తేలిపోనుంది.