ప్రజలు బలయ్యారు
కేసీఆర్ అరాచక పాలనను ఇక భరించే ఓపిక ప్రజలకు లేదని, సీఎం కేసీఆర్ దోపిడీకి 4 కోట్ల రాష్ట్ర ప్రజలు బలయ్యారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి విమర్శించారు. శుక్రవారం రేవంత్‌రెడ్డి సమక్షంలో అచ్చంపేట నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, న్యాయవాది గంగాపురం రాజేందర్, మాజీ జడ్పీటీసీ భీముడు నాయక్, అచ్చంపేట, చారగొండ మండలాలకు చెందిన బీఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్‌లో చేరారు. రేవంత్‌రెడ్డి వారికి కండువాకప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
రాష్ట్రాన్ని విముక్తి చేసేందుకే కాంగ్రెస్ పార్టీలో చేరికలు
ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌లో చేరికలు గాలివాటంతో కూడినవి కావన్నారు. ఈ చేరికలు రాష్ట్రాన్ని కేసీఆర్ నుంచి విముక్తి కలిగించేందుకు, తెలంగాణలో కేసీఆర్ వ్యతిరేక రాజకీయ పునరేకీకరణ కోసమేనని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో చేరికలు తెలంగాణ ప్రజల చైతన్యానికి ప్రతీక అని స్పష్టం చేశారు. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను కేసీఆర్ పదేళ్ల పాలనలో నాశనం చేశారని మండిపడ్డారు. ఇక కేసీఆర్ అరాచక పాలనను భరించే ఓపిక ప్రజలకు లేదన్నారు. రాష్ట్రాన్ని పాలించే అర్హత ముఖ్యమంత్రికి లేదని విమర్శలు గుప్పించారు.
కేటీఆర్ పుట్టకముందే తెలంగాణ ఉద్యమం పుట్టింది
కేసీఆర్ పుట్టకపోయుంటే తెలంగాణ వచ్చేది కాదని మంత్రి కేటీఆర్ అన్నారని.. కేటీఆర్ పుట్టకముందే తెలంగాణ ఉద్యమం పుట్టిందని రేవంత్ గుర్తు చేశారు. పాలమూరు బిడ్డ చిన్నారెడ్డి ఆనాడు ఉద్యమానికి నాయకత్వం వహించారని తెలిపారు. ఎలక్షన్లు, కలెక్షన్ల కోసమే 2001లో కేసీఆర్ పార్టీ పెట్టారని రేవంత్ ఆరోపించారు. 22ఏళ్లు జెండా మోసిన గంగాపురం రాజేందర్‌కు న్యాయం జరిగిందా? అని ప్రశ్నించారు. నల్లమల అడవుల్లో అచ్చంపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగరాలని రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావాల్సిన అవసరం రేవంత్ ఉందన్నారు.