AP News: ఏపీ కానిస్టేబుల్ అభ్యర్థులకు ఎట్టకేలకు తీపి కబురు అందింది. పెండింగ్ లో ఉన్న కానిస్టేబుల్ పోస్టుల భర్తీ ప్రక్రియ ప్రారంభించేందుకు రాష్ట్ర పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు చర్యలు చేపట్టబోతున్నట్లు ఇన్‌ఛార్జి ఛైర్మన్ ఆకే రవికృష్ణ అధికారిక ప్రకటన చేశారు. ఈ 2024 డిసెంబరు చివరి వారంలో ఫిజికల్ టెస్ట్ నిర్వహించనున్నట్లు తెలిపారు.
అభ్యర్థులకు మరోసారి అవకాశం..
ఈ మేరకు వైసీపీ ప్రభుత్వం 6,100 కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి 2022లో నోటిఫికేషన్ జారీ చేసింది. అభ్యర్థులకు 2024 జనవరిలో ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించారు. దీనికి 4,59,182 మంది హాజరయ్యారు. 95,208 మంది అభ్యర్థులు ఈ పరీక్షలో అర్హత సాధించగా 91,507 మంది అభ్యర్ధులు మాత్రమే ఫిజికల్ టెస్ట్‌కు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నారు. అయితే ప్రిలిమినరీ పరీక్ష అనంతరం కానిస్టేబుల్ భర్తీ ప్రక్రియ పలు కారణాల వల్ల నిలిచిపోగా.. కూటమి ప్రభుత్వం భర్తీ ప్రక్రియను తాజాగా ప్రారంభించేందుకు చర్యలు చేపట్టింది. ఈ క్రమంలోనే ఫిజికల్ టెస్ట్‌కు దరఖాస్తు చేసుకోని అభ్యర్థులకు మరోసారి అవకాశం ఇస్తున్నట్లు పోలీసు రిక్రూట్ మెంట్ బోర్డు ఛైర్మన్ చెప్పారు. నవంబర్ 11న సాయంత్రం 3గంటల నుంచి 21వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు slrb.ap.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.