జార్ఖండ్ ముఖ్య మంత్రి హేమంత్ సోరెన్‌కు ఈడీ సమన్లు పంపింది. మనీలాండరింగ్ కేసులో ఈ నెల 14న విచారణకు హాజరు కావాలని ఆయన్ని ఈడీ ఆదేశించింది. అక్రమ మైనింగ్ కేసులో ఆయన్ని ఈడీ విచారణకు పిలిచినట్టు తెలుస్తోంది. ఈ కేసులో రాంచీలోని ఈడీ కార్యాయలంలో ఆయన వాంగ్మూలాన్ని రికార్డు చేయనున్నట్టు నోటీసుల్లో పేర్కొంది.
గతేడాది నవంబర్‌లో కూడా ఆయనకు ఈడీ నోటీసులు పంపింది. ముందుగా ఫిక్స్ చేసుకున్న షెడ్యూల్ ప్రకారం తాను పలు కార్యక్రమాలకు హాజరు కావాల్సి వుందని ఆయన తెలిపారు. అందుకే తాను విచారణకు హాజరు కాలేనని ఈడీకి ఆయన లేఖ రాశారు. విచారణకు హాజరయ్యేందుకు తాను చాలా తక్కువ సమయం ఇచ్చారని ఆయన తెలిపారు.
తామేమైనా దొంగలమా లేదా సంఘ వ్యతిరేక శక్తులమా ఆయన మండిపడ్డారు. జార్ఖండ్ లోని సాహెబ్ గంజ్ లో అక్రమ మైనింగ్ కేసులో హేమంత్ సోరెన్ పై మనీలాండరింగ్ ఆరోపణలు వచ్చాయి. ఆ సమయంలో ముఖ్య మంత్రి పదవితో పాటు రాష్ట్ర గనుల మంత్రిగా కూడా పనిచేశారు. దీంతో ఆయనపై కేసు నమోదు చేసి ఈడీ దర్యాప్తు చేస్తోంది.
తనపై వచ్చిన ఆరోపణలను సోరెన్ ఖండించారు. ఇది ఇలా వుంటే తమ పట్ల కేంద్రం కక్ష పూరిత ధోరణిలో వ్యవహరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పిస్తున్నాయి. ప్రతిపక్షాలను అణచి వేసేందుకు సీబీఐ, ఈడీలను కేంద్రం పావులుగా వాడుకుంటోందని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నాయి. దర్యాప్తు సంస్థలను అడ్డం పెట్టుకుని ప్రతిపక్షాలను కేంద్రం వేధిస్తోందని మండిపడుతున్నాయి.