ఏపీ రాజకీయాలు (AP Politics) రోజురోజుకి వేడెక్కుతున్నాయి. గత శుక్రవారం రాత్రి నుంచి ఈ పరిస్థితులు మరీ దారుణంగా తయారయ్యాయని చెప్పవచ్చు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడ్ని (CBN) అరెస్ట్ చేయడంతో తీవ్ర పరిస్థితులు నెలకొంటున్నాయి. ఆయన అరెస్ట్ గురించి ఇప్పటికే పలువురు రాజకీయ నాయకులు ఇతర రాష్ట్రాల రాజకీయ నాయకులు కూడా స్పందించారు.
ఆయన అరెస్ట్ చాలా దారుణమని అన్నారు. ఈ క్రమంలో తెలుగు హీరోలను చూస్తుంటే సిగ్గేస్తుందని టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి(JC prabhakar reddy) అన్నారు. ఆయన్ని కావాలని అక్రమ కేసులో అరెస్ట్ చేసి జైల్లో పెట్టినట్లు ఆయన ఆరోపించారు. దీని గురించి ఎవరు స్పందించడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏపీలో బతికే రోజులు పోయాయని అన్నారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం కూడా రాష్ట్రాన్ని గురించి మర్చిపోవాల్సిందే అన్నారు. ఒక్క గ్రామానికి కూడా సరైన రోడ్లు లేవు. పరిశ్రమలు లేవు. ఉద్యోగాలు చేద్దామంటే కనీసం పని లేదు. కనీస సౌకర్యాలు అనేవి ఏవి కూడా లేవని ఆయన విమర్శించారు.
రాష్ట్రం ఇంత దారుణంగా ఉంటే కనీసం బాగుచేయాలనే కనీస జ్ఙానం కూడా మీకు లేదా అని ప్రశ్నించారు. ఇది కేవలం రాష్ట్రానికి పట్టిన దుస్థితి మాత్రమే కాదు. చిత్రపరిశ్రమకు పట్టిన దౌర్భగ్యం కూడా. చిత్రసీమ విషయంలో కూడా జగన్ ఎంత దారుణంగా ప్రవర్తించారో మీకు తెలియదా? అంటూ ప్రశ్నించారు.
ప్రస్తుత రోజుల్లో పది రూపాయలకు ఒక టీ కూడా రావడం లేదు. అలాంటిది సినిమా టికెట్ ను పది రూపాయలు చేశారు. నిర్మాతలను, డిస్ట్రిబ్యూటర్స్ ను ఎంత ఆర్థికంగా నష్టపరిచినప్పటికీ మీలో ఒక్కరు కూడా స్పందించారేంటి అని ఆయన ప్రశ్నించారు. మరి ఆనాడు ప్రత్యేక విమానాల్లో వచ్చి జగన్ కాళ్ల దగ్గర పడ్డారు కదా...మరీ ఈరోజు రాష్ట్రం ఇంత దారుణంగా తయారు అయితే ఒక్కరు కూడా మాట్లాడరేంటి అని ఆయన ప్రశ్నించారు.
అసలు మీరు హీరోలేనా అంటూ ఆయన ఫైర్ అయ్యారు. ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో నిజమైన హీరో ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం పవన్ కల్యాణ్ మాత్రమే అని అన్నారు. ఆయన సినిమాలు చేస్తే వేల కోట్లు వస్తాయి. అయినప్పటికీ అవన్నీ పక్కకు పెట్టి రాష్ట్రం కోసం వచ్చి ప్రజల ముందు నిలబడ్డాడు. అది రియల్ హీరో అంటే అని ఆయన పేర్కొన్నారు.
చిత్ర పరిశ్రమలో ఉన్న హీరోలందరూ కూడా ఇలా సైలెంట్ గా ఉంటే ఇక ఎప్పటికీ మీరు అలాగే ఉంటారు..మీరు ఏపీకి రాలేరు..ఏపీ తిరగలేరని హెచ్చరించారు.ప్రస్తుతం జేసీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియా లో వైరల్ గా మారుతున్నాయి.