నేను ఎన్డీయేలో ఉంటే ఏంటి.. బయట ఉంటే ఏంటి.. మీకు ఎందుకు భయం అంటూ పవన్ కళ్యాణ్ హాట్ కామెంట్స్ చేశారు. 'నీ సంగతి చూస్తాం కొడకా అంటూ మెసేజ్‌లు వచ్చాయి' అని పవన్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. జనసేన పార్టీ వారాహి విజయ యాత్రలో భాగంగా నేడు కృష్ణా జిల్లా కైకలూరు నియోజకవర్గం పరిధిలోని ముదినేపల్లి గురజా రోడ్డులో పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. నువ్వెంత నీ బతుకెంత జగన్ అంటూ పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
చాలాసార్లు చెప్పి చూశాను:
ఎన్డీఏలో ఉన్నప్పటి నుంచి కేంద్ర పెద్దలకు ఒకే విషయాన్ని చాలాసార్లు చెప్పాను. 2014లో ఎలాగైతే జనసేన-టీడీపీ-బీజేపీ కలిసి ముందుకు వెళ్లాయో... అలా చేస్తేనే.. జగన్ ను ఓడించగలమని చాలాసార్లు చెప్పానన్నారు పవన్. రాష్ట్రాన్ని జగన్ అడ్డగోలుగా దోచేస్తున్నాడని కేంద్రానికి చాలాసార్లు చెప్పి చూశానాన్నారు. అమిత్ షాకు ఇదే మాట చెప్పాను, నడ్డాకు ఇదే మాట చెప్పానని.. బిజెపి పెద్దలందరికీ ఇదే చెప్పానన్నారు పవన్. నేను సనాతన ధర్మాన్ని ఆరాధిస్తానని.. ఎందుకంటే నా మతం ఇతర మతాలను గౌరవిస్తుందన్నారు. ఓవైపు వైసీపీ దేవాలయాలను కూల్చేస్తోందని.. రధాలు తగలబెట్టేస్తుంటే.. ఇప్పటివరకు జగన్ ప్రభుత్వం ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదని ఆరోపించారు పవన్.
తన ఆఫీసుపై వైసీపీ గుండాలు దాడికి సిద్ధంగా ఉంటే తాను ఆపీసులోనే ఉన్నానని.. రేపు మేం గెలిస్తే మీరు మీ ఆఫీసుల్లో, ఇళ్ళలో ఉండాలో లేదో నిర్ణయించుకోండంటూ పవన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. దళితులను చంపేసిన ఎమ్మెల్సీకి ఊరేగింపులు చేసేది వైసీపీ నేతలేనంటూ ఫైర్ అయ్యారు. పెద్దింట్లమ్మ ఆలయం దగ్గర వంతెన వేయలేరని.. వచ్చి ఎన్నికలకు ఓట్లు ఎలా అడుగుతావు అంటూ జగన్‌పై పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు ఎన్డీయేకు జనసేన అధినేత పవన్ కటీఫ్ చెప్పేశారు. బీజేపీ సారథ్యంలోని నేషనల్ డెమొక్రటిక్ అలయెన్స్ (NDA) నుంచి బయటకు వచ్చినట్టు జనసేన ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే టీడీపీ లాంటి బలీయమైన శక్తి అవసరమని పవన్ పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం సవాళ్లు ఎదుర్కొంటోందని, ఈ పరిస్థితుల్లో ఆ పార్టీకి జనసేన మద్దతు అవసరమని స్పష్టం చేశారు. జనసేన, టీడీపీ కలిస్తే ఆ ప్రభావం అధికార వైసీపీపై తీవ్రంగా పడుతుందని వివరించారు. జనసేనలాంటి యువరక్తం టీడీపీకి అవసరమని నొక్కి చెప్పారు.
ALSO READ: ఎన్డీయేకు గుడ్‌బై..జనసేనాని కీలక నిర్ణయం.!