రాజకీయాల్లో శత్రువులు, మిత్రులు అంటూ ఉండరన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ప్రస్తుత పొత్తు ధర్మం ప్రకారం జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పరస్పరం ఒకరినొకరు గౌరవించుకుంటూ ముందుకు వెళ్లాలని సూచించారు. పాత విషయాలను మనసులో పెట్టుకొని మనలో మనం గొడవలుపడితే కచ్చితంగా మళ్ళీ జగన్ అధికారంలోకి వస్తాడని.. మన మధ్య లేనిపోని చిచ్చుపెట్టడానికి వైసీపీ సిద్ధంగా ఉందన్నారు. వారికి ఎట్టి పరిస్థితుల్లో అవకాశం ఇవ్వకూడదన్నారు పవన్. లోక కళ్యాణం కోసం గరళం కంఠంలో నింపుకున్న పరమశివుడిలా ఇరు పార్టీల నాయకులు, కార్యకర్తలు రాష్ట్ర శ్రేయస్సు కోసం పరస్పరం సహకరించుకుంటూ పనిచేయాలని తెలిపారు. నేను కూడా సభ వేదికలపై జనసేన – తెలుగుదేశం అని సంబోధిస్తానని.. తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా వాళ్ల వేదికలపై తెలుగుదేశం- జనసేన అని చెబుతారన్నారు. ఇరువురి గౌరవాలకు ఏ మాత్రం భంగం కలగకుండా పొత్తును ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని తెలిపారు. 40 ఏళ్ల చరిత్ర ఉన్న తెలుగుదేశం పార్టీని జనసేన కార్యకర్తలు తక్కువ అంచనా వేయకండని సూచించారు. వారి పార్టీ ప్రస్తుతం కష్టకాలం ఎదుర్కొంటుందని.. ఈ సమయంలో మిత్రధర్మం పాటిద్దామని పవన్ తెలిపారు. అలాగే పోరాటాలకు వేదిక అయిన జనసేన పార్టీని సైతం తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు సముచితంగా గౌరవించాలని ఆకాంక్షిస్తున్నానని చెప్పారు.
సినిమాలు ఎందుకు చేస్తున్నాను అంటే..?
150 మంది క్రియాశీలక కార్యకర్తలతో మొదలైన జనసేన ప్రస్థానం నేడు 6 లక్షల 60 వేల క్రియాశీలక కార్యకర్తలుగా మారిందని గుర్తు చేసుకున్నారు పవన్ కళ్యాణ్. మనందరినీ బలమైన భావజాలం కలిపిందని. అంచలంచెలుగా మనం ఎదుగుతున్నామన్నారు. అదే పద్ధతిలోనే అధికారంలోకి వస్తామని పవన్ ధీమా వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో సుమారు 7 శాతం ఓటింగ్ శాతం వస్తే ఇప్పుడు పార్టీ గ్రాఫ్ పెరిగినట్లు వైసీపీ నాయకులే చెబుతున్నారన్నారు. చాలా నియోజకవర్గాల్లో గెలిచే స్థాయికి పార్టీ ఓటింగ్ పెరిగింది. జగన్ నడిచాడు, ముద్దులు పెట్టాడు, మాయమాటలు చెప్పి నమ్మించాడు. దేవుడని నమ్మి అధికారం ఇస్తే ఇప్పుడు దెయ్యమై పీడుస్తున్నాడన్నారు.
'మనల్ని జనం నమ్మాలంటే వారి తరఫున మనం బలంగా నిలబడాలి. వారి సమస్యలు తీర్చేందుకు పోరాడాలి. ప్రతికూల పరిస్థితుల్లో ఒత్తిడి తట్టుకోవాలి. మన కోసం వీళ్లు నిలబడారు అనే నమ్మకం ప్రజల్లో రావాలి. నేను పార్టీని ప్రజల కోసం పెట్టాను. ఎవరి దగ్గర చేయి చాచి దేహీ అని అనకుండా బలంగా ఆత్మగౌరవంతో పార్టీ నడపాలంటే కచ్చితంగా నేను సినిమాలు చేయాలి. పార్టీని వేరే వ్యక్తుల దగ్గర తీసుకున్న డబ్బుతో నడపడం నా ఆత్మగౌరవానికి నచ్చదు. నాది చాలా చిన్న జీవితం. నా ఇష్టాలు కూడా స్వలంగా ఉంటాయి.' అని వ్యాఖ్యానించారు.
ALSO READ: ‘ఐసీయూలో ఉన్న వైసీపీని చూస్తే జాలేస్తోంది’.. పవన్ కళ్యాణ్‌తో టీడీపీ నేతల భేటీ..!