2019 ఎన్నికల్లో నెల్లూరు సిటీ నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన కేతంరెడ్డి వినోద్‌రెడ్డి, ఎన్నికల్లో ఓడినా అనతికాలంలోనే తన పోరాట కార్యక్రమాలతో జనసైనికుల్లో రాష్ట్ర వ్యాప్త గుర్తింపు తెచ్చుకున్నారు. "కాబోయే సీఎం పవన్ కళ్యాణ్" అంటూ 300 రోజులకుపైగా నెల్లూరు నగరంలోని ఇంటింటికీ చాటింపు వేసేలా పవనన్న ప్రజాబాట చేపట్టారు. ప్రతి ఇంటికీ సీఎం పవన్ కళ్యాణ్ అంటూ స్టిక్కర్లు అంటించారు. నిలువెత్తు కరపత్రాలు పంచారు. నెల్లూరు మొత్తం సీఎం పవన్‌కళ్యాణ్ అంటూ పోస్టర్లతో నింపారు. ఆఖరికి సీఎం పవన్ కళ్యాణ్ అంటూ నగరంలో శిలాఫలకం కూడా పెట్టారు. పార్టీ కోసం నిరంతరం సైనికుడిలా సేవ చేస్తున్నా తనకు పార్టీలో అవమానాలే ఎదురవుతున్నాయని ఆయన గత కొంతకాలంగా మదనపడుతున్నారు. తాను పార్టీలో ఎంత కష్టపడుతున్నా.. గుర్తించక తన నియోజకవర్గంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు మనుక్రాంత్‌రెడ్డి చేత పార్టీలోని పలువురు పెద్దలు చిల్లర రాజకీయాలు చేయిస్తున్నారని ఆయన ఇటీవల పవన్ కళ్యాణ్ దగ్గర వాపోయినట్లు సమాచారం.
పెద్దలు చిల్లర రాజకీయాలు
ప్రస్తుతం పొత్తుల నేపథ్యంలో సిటీ సీటుని మూడు నెలల క్రిందటే టీడీపీ మాజీమంత్రి నారాయణకి కేటాయించిందని ఆయన ఆరోపిస్తున్నారు. తాను సీటు ఆశించట్లేదని, గతంలో కాంగ్రెస్ పార్టీలో యూత్ కాంగ్రెస్‌కి తాను రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్నానని చెబుతున్నారు. కానీ.. ఇక్కడ కనీస గుర్తింపు లేక పోగా.. పార్టీ కార్యక్రమాలకు కూడా పిలవకుండా తనను అవమానిస్తున్నారని, కనీసం తన నియోజకవర్గానికి తనకు ఇన్‌ఛార్జ్‌గా ఇచ్చి రాజకీయంగా భవిష్యత్ కోసం భరోసా ఇవ్వాలని పార్టీ అధిష్టానాన్ని కోరినట్లు సమాచారం.
అయితే వారి నుంచి సరైన భరోసా లేని కారణంగా.. ఆయన కొద్దిరోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. కేతంరెడ్డి మౌనాన్ని గ్రహించిన నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షులు, రాజ్యసభ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, మాజీమంత్రి నారాయణ తమ పార్టీలో చేరాల్సిందిగా కోరినట్లు సమాచారం. వైసీపీలోకి వస్తే కేతంరెడ్డికి ఉన్నతమైన రాజకీయ భవిష్యత్ ఉంటుందని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి సమక్షంలో కేతంరెడ్డి వైసీపీలో చేరుతున్నారనే అంశం ప్రస్తుతం నెల్లూరు జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.