Janasena in Telangana: తెలంగాణ ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్టే జరిగింది. కాంగ్రెస్ అధికార పగ్గాలు అందేసుకుంది. హస్తం చేతిలోకి తెలంగాణ రాష్ట్రం చేరిపోయింది. తెలంగాణ ఎన్నికలు బీజేపీ ఒకరకమైన పాఠం నేర్పిస్తే.. అధికార బీఆర్ఎస్ కు అసలైన ప్రజానాడిని పరిచయం చేశాయి. ఇక తెలంగాణ రాజకీయాల్లో చెప్పుకోవాల్సిన ఒక పార్టీ ఈ ఎన్నికల్లో ఉంది. అది జనసేన. సినిమాల నుంచి రాజకీయాల్లోకి వచ్చి.. ఫాన్ ఫాలోయింగ్ ని ప్రజా స్పందనగా అంచనా వేసుకుని పదిహేనేళ్లుగా రాజకీయాలలో తలమునకలై ఉన్నారు జనసేనాని పవన్ కళ్యాణ్. పార్టీ పెట్టి పదేళ్లయినా.. ఏపీ రాజకీయాల్లో ఓట్లు.. సీట్ల పరంగా ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయిన పవన్.. ఇప్పుడు అక్కడ తెలుగుదేశంకు నమ్మదగిన మిత్రుడిగా మారిపోయారు. అయితే, విచిత్రంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు అంటే మండిపడే బీజేపీ అధిష్టానానికి ఇష్టుడిగా ముద్ర వేసుకున్నారు. ఇటు బీజేపీతోనూ దోస్తీ.. అటు టీడీపీతో పొత్తు అంటూ ఏపీలో కన్ఫ్యూజన్ రాజకీయాలు చేస్తున్నారు. ఇక తెలంగాణ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ బరిలోకి దిగకుండానే చేతులెత్తేసిన సందర్భంలో.. నేనున్నాను అంటూ బీజేపీతో కల్సి తెలంగాణ రాష్ట్ర ఎన్నికల్లో పోటీకి దిగారు పవన్ కళ్యాణ్. పొత్తు ప్రతిపాదన ఈయనే చేశారో.. బీజేపీ కోరుకుందో కానీ.. అటూ ఇటూ చేసి 8 స్థానాలలో బీజేపీ పొత్తుతో పోటీ చేయడానికి రెడీ అయిపొయింది.
ప్రధాని నరేంద్ర మోదీతో హైదరాబాద్ లో(Janasena in Telangana) నిర్వహించిన బీజేపీ అతిపెద్ద బహిరంగ సభలో ఆయన పక్కన సీటు ఇచ్చారు. ప్రధాని కూడా పవన్ కళ్యాణ్ ని పొగిడి దగ్గర చేర్చుకున్నారు. తరువాత పవన్ కళ్యాణ్ స్వయంగా ఐదు నియోజక వర్గాల్లో కొత్తగూడెం, సూర్యాపేట, దుబ్బాక, వరంగల్, కూకట్ పల్లి లో ర్యాలీలు, బహిరంగ సభలు నిర్వహించారు. పెద్ద ఎత్తున ప్రజలు కూడా ఈ సమావేశాల్లో పాల్గొన్నారు. కానీ, ఓటు వేసే సమయం వచ్చేసరికి అందరూ మొహం చాటేశారు. పవన్ కళ్యాణ్ చూడటానికి ఓకే కానీ.. ఓటుకు మాత్రం నో అని నిష్కర్షగా చెప్పేశారు. దీంతో డిపాజిట్లు కూడా రాని పరిస్థితి జనసేన అభ్యర్థులది.
సరే.. జనసేన గెలవలేదు.. మరి జనసేన(Janasena in Telangana) పొత్తుతో బీజేపీకి ఏదైనా ఫలితం దక్కిందా అంటే అది కూడా ఏమీ కనిపించలేదు. ఇది పక్కన పెడితే.. అసలు జనసేన తెలంగాణలో ఎందుకు పోటీచేసింది? ఇది ఇప్పుడు పవన్ అభిమానులతో పాటు ఏపీ ప్రజలందరి మదినీ తొలిచేస్తున్న ప్రశ్న. పదేళ్లుగా రాజకీయాల్లో ఉన్నా రాజకీయ పరిణితి ఇప్పటికీ సాధించలేదా? అనే ఆవేదన వారిది. జనసేన తెలంగాణలో పోటీచేస్తున్న సందర్భంలో గ్రేటర్ పరిధిలోని కూకట్ పల్లిలో గెలుస్తుంది అని అంచనా వేశారు. దానికి కారణాలు ఉన్నాయి. ఎక్కువగా అక్కడ సెటిలర్స్ ఉండడం.. తెలుగుదేశం పార్టీకి అక్కడ కొంత పట్టు ఉండడం.. అలాగే, గతంలో జయప్రకాష్ నారాయణ గెలిచిన ఉదాహరణ కూడా ఉండడంతో చాలా మంది ఆ సీటుపై కొంత నమ్మకం పెట్టుకున్నారు. కానీ.. అక్కడ కూడా డిపాజిట్లు దక్కలేదు జనసేనకు. ఇందుకు కారణం చాలా స్పష్టం.. తెలుగుదేశం ఓటర్లు చాలామంది ఓటింగ్ కు దూరంగా ఉన్నారు. ఓటు వేసినవారు కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చారు. పవన్ కళ్యాణ్ కి టీడీపీ తో దోస్తీ ఉన్నాసరే అది ఇక్కడ పనిచేయదు అనుకున్నారు. జనసేనకు ఓటు వేసే వారు అక్కడ ఉన్నారు అనుకున్న సెటిలర్స్ లో చాలామంది సాఫ్ట్ వేర్ ఉద్యోగులే.. వారంతా ఓటు పక్కన పెట్టి సెలవులు పెట్టుకుని ఊర్లకు జంప్ అయిపోయారు. దీంతో డిపాజిట్ ఓట్లు కూడా దక్కలేదు.
పరువు పోయింది..
అవును ఇప్పుడు జనసేన(Janasena in Telangana) ఇక్కడ ఒక్కసీటు గెలుచుకోలేకపోవడం ద్వారా ఏపీలో పరువు పోయినట్లయింది. అక్కడ టీడీపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసేస్తాను.. వైసీపీని ఓడించేస్తాను అని చెబుతున్న.. పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏం చేస్తారు? అసలే బీజేపీ టీడీపీతో దోస్తీకి విముఖంగా ఉంది. ఇక ఇక్కడ ఏదో చేసేస్తాడు అనుకున్న పవన్ వల్ల ఫలితం దక్కలేదు.. ఇప్పుడు ఏపీలో పవన్ తో కలిసి వస్తారా? అది అనుమానమే. అయినా, ఇంతకుముందులా పవన్ కల్యాణ్ ని మోదీ దగ్గరకు రానిస్తారా అనేది కూడా డౌటే. సినిమాలు వేరు.. రాజకీయాలు వేరు.. అది పవన్ కి స్పష్టంగా తెలుసు కానీ.. ఇలాంటి తప్పటడుగులు వేస్తున్నారు. పవన్ కళ్యాణ్ తెలంగాణలో పోటీచేసినపుడు.. రాజకీయంగా ఎవరినీ విమ చకుండా ఉండడమూ పెద్ద తప్పిదమే. కేసీఆర్ ను పల్లెత్తి మాట కూడా పవన్ అనలేదు. తన అభ్యర్థులను గెలిపించామని మాత్రేమే కోరారు. రాజకీయాల్లో ప్రత్యర్థుల లోపాలను చెప్పకుండా.. తమకు ఓటు వేయమని అడిగితే అది జరిగే పై కాదు. ఏపీలో జగన్ మీద ప్రతి సభలోనూ ఒంటికాలుమీద లేచే పవన్ ఇక్కడ కేసీఆర్ ను ఏ మాత్రం విమర్శించకపోవడం కూడా విమర్శల పాలయ్యింది.
Also Read: మోదీ మేనియా.. బీసీ కార్డు కూడా పనిచేయలేదు.. బీజేపీ పరాభవానికి కారణాలివే!
ఇక్కడ ఒక ప్రశ్న కూడా తలెత్తుతుంది. ఏపీలో జగన్ ను అవినీతి అంటూ.. దుష్టపాలన అంటూ చెరిగి పారేసే పవన్.. ప్రజల్లో కాస్త ఇమేజ్ సృష్టించుకున్నారు. కనీసం జగన్ వ్యతిరేకుల్లో అయినా కొద్దిగా తన స్థాయి పెంచుకున్నారు. ఇక్కడ కేసీఆర్ ను ఏమీ అనకపోవడంలో అర్ధం ఏమిటి? ఒకవేళ కేసీఆర్ పాలన అంత బావుంటే జనసేన(Janasena in Telangana) ఇక్కడ పోటీచేయాల్సిన అవసరం ఏముంది? తప్పు చేస్తే వదలను అని చెప్పే పవన్.. ఇక్కడ కేసీఆర్ లేదా బీఆర్ఎస్ నాయకులు ఎవరూ తప్పు చేయలేదని చెప్పడానికి పోటీ చేశారా? అసలు పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రస్థానం ఎటు పోతోంది? ఇప్పుడు ఏ విధంగా ఏపీ ప్రజల దగ్గర తెలంగాణ ఓటమిని సమర్ధించుకుంటారు? బీజేపీ టీడీపీని వదిలి పోటీచేయాలని అడిగితే ఏమి చేస్తారు? ఎందుకంటే.. తెలంగాణలానే.. ఏపీలో కూడా బీజేపీకి మొదటి శత్రువు చంద్రబాబే. అది బహిరంగ రహస్యం.
మొత్తమ్మీద రాజకీయ పరిణితి లేకపోవడం.. దుందుడుకు విధానాలతో పవన్ జనసేన పార్టీని చుక్కాని లేని నావలా చేస్తున్నట్టు కనిపిస్తోందని రాజకీయ పండితులు భావిస్తున్నారు. తనకు ఒక్కడికీ ఇమేజ్ ఉంటె చాలదు.. రాజకీయం అంటే ప్రజల్లో నమ్మకం కలిగించాలి.. సరిగ్గా ఆ నమ్మకం కలుగుతున్న సమయంలో పవన్ కళ్యాణ్.. తెలంగాణలో పోటీ ద్వారా రాజకీయంగా రిస్క్ చేశారని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏమి చేయబోతున్నారనేది అందరిలోనూ ఆసక్తి కలిగిస్తోంది.
Watch this interesting Video: