Janasena in Telangana: ఓటర్లు.. నమ్మితే నేల మీద ఉన్నవారిని నెత్తిమీద పెట్టుకోగలరు. ఆ నమ్మకం వమ్మయిందా..నెత్తిన పెట్టుకున్నవారిని పాతాళంలో పడేయగలరు. చాలాసార్లు ఈ విషయం రుజువైంది. అప్పటి ఎమర్జెన్సీ సమయంలో కాంగ్రెస్ ఓటమి నుంచి మొన్నటి ఏపీలో వైసీపీ ఓటమి దాకా ఇలా పాతాళాన్ని చూపించిన సంఘటనలు దేశవ్యాప్తంగా కోకొల్లలు. ఒక్కోసారి ఉనికే లేకుండా పోయిన పార్టీలను.. నాయకులను సింహాసనం మీదకు తీసుకువచ్చిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. ఇదిగో సరిగ్గా ఈ పరిస్థితులను.. ప్రజల ఈ విధానాన్ని చూసే రాజకీయ నాయకులు.. పార్టీలు ఓటమికి పెద్దగా భయపడరు. మళ్ళీ అవకాశం కోసం ఎదో ఒక ప్రయత్నం చేస్తూనే ఉంటారు. ప్రజాజీవితంలో ఒడిదుడుకులను చూడలేక కాడి పాడేశిన పార్టీలు ఉండవచ్చు గాక. అవి ఆ పార్టీనేత స్వయంకృతాపరాధంతో జరిగిందే కానీ, ప్రజల వలన జరిగింది కాదు. ఇప్పుడు ఈ ఉపోద్ఘాతం అంతా ఎందుకు అంటే..
Janasena in Telangana: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండు ముక్కలుగా విడిపోయాకా.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రాజకీయ పరిణామాలు చాలా చోటుచేసుకున్నాయి. అప్పటిదాకా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో ఉనికిని కోల్పోయింది. తెలంగాణలో చావు తప్పి కన్ను లొట్టబోయి మిగిలింది. బలమైన ప్రాంతీయ పార్టీ తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చింది. తెలంగాణలో పిల్లిమొగ్గ వేసింది. అప్పటి టీఆర్ఎస్.. ఇప్పటి బీఆర్ఎస్ ధాటికి తెలంగాణలో టీడీపీకి నాయకులనేవారు దాదాపుగా మిగలని పరిస్థితి వచ్చింది. విచిత్రంగా కొన్నిప్రాంతాల్లో క్యాడర్ మాత్రం టీడీపీకి నిలబడే ఉంది. కానీ, వాటికి దిశానిర్దేశం చేయగలిగిన నాయకత్వం కనుమరుగైపోయింది. ఇక ఈ నేపథ్యంలో రాష్ట్ర విభజనకు కొద్దిగా ముందుగా పుట్టుకొచ్చిన జనసేన పార్టీ రెండు చోట్లా రాజకీయం చేయలేక లేదా అవకాశం కనిపించక ఏపీలో రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టింది. కానీ, 2014, 2019లో అక్కడ ఏ మాత్రం దారిదొరకక దిక్కుతోచకుండా మిగిలింది. దాదాపుగా విభజన సమయానికి మరికాస్త ముందుగా పుట్టిన వైసీపీది కూడా అదే పరిస్థితి. తెలంగాణలో పార్టీ ఉనికే లేకుండా పోయింది. ( ఆ పార్టీ నాయకత్వం దానికోసం పెద్దగా ప్రయత్నాలు చేయలేదు. దాని కారణాలు ఒక పెద్ద కథ) ఏపీలో 2014లో ఓటమి పాలై.. 2019లో ఎదురులేని విధంగా విజయకేతనం ఎగురవేసింది. ఇక తెలంగాణలో 2014 నుంచి రెండు ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ దే అధికారం. రెండోస్థానంలో కాంగ్రెస్ కొట్టుమిట్టాడింది. ఇదంతా గతం.
Janasena in Telangana: వర్తమానం మారింది. 2024 వచ్చేసరికి అన్ని పార్టీల జాతకాలు తిరగబడ్డాయి. ముందుగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు. పదేళ్లలో టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ గా పరిణితి చెందిన కేసీఆర్ పార్టీ ప్రజల్లో ఆదరణ కోల్పోయింది. అటు ఏపీలో వైనాట్ 175 అన్న వైసీపీ అధినేత జగన్ కు ప్రజలు 11 సీట్లిచ్చి పక్కన పెట్టేశారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి అనూహ్యంగా అత్యధిక మెజార్టీతో పట్టం కట్టారు.
ముందుగా చెప్పింది. అదే.. ప్రజలు ఎప్పుడు ఎవరిని ఎక్కడకి తీసుకువెళతారో ఊహించడం ఎవరివల్లా కాదు. సరే.. ఇక టీడీపీ, జనసేన, బీజేపీ ఏపీలో సాధించిన ఘనవిజయంతో ఫుల్ జోష్ లో ఉన్నాయి. అందులోనూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మరింత ఉత్సాహంగా ఉన్నారు. పదేళ్ల పాటు అవమానాలు భరించి.. చివరికి ఏపీలో కూటమి రాజకీయాలను ఒక గాడిలో పెట్టి.. కూటమి విజయాన్ని తన భుజాల మీద మోసిన పవన్.. ఇప్పుడు దేశ రాజకీయాల్లో బలమైన నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. దీంతో ఆయన బీజేపీతో కలసి తెలంగాణలోనూ రాజకీయ ప్రయాణం ఉంటుందని చెబుతున్నారు. మరోవైపు కూటమిలో ప్రధాన పార్టీ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా తెలంగాణలో మళ్ళీ చక్రం తిప్పాలని భావిస్తున్నట్టు ఇప్పటికే సంకేతాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఏపీ ఫార్ములా వర్కౌట్ చేసే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నట్టు కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణలోనూ మూడు పార్టీల కూటమి..
Janasena in Telangana: తెలంగాణలో ఇటీవల పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ 8 సీట్లను సాధించింది. దీంతో బీజేపీలోనూ వచ్చే ఎన్నికల్లో అధికారం సాధించాలనే తపన స్పష్టంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ను ఎదుర్కోవడం కోసం ఏపీలో విజయవంతమైన ఫార్ములానే.. తెలంగాణలోనూ తీసుకువచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషకుల అంచనా. బీఆర్ఎస్ ప్రస్తుతం ఉనికిని నిలబెట్టుకునే ప్రయత్నాల్లో ఉంది. అసలే కష్టకాలం నడుస్తుండడంతో పార్టీని నిలబెట్టుకోవడంపైనే ఎక్కువగా దృష్టి పెట్టాల్సిన పరిస్థితిలో బీఆర్ఎస్ నాయకత్వం పడిపోయింది.
ఇక కాంగ్రెస్-బీజేపీ అన్నట్టుగానే తెలంగాణ రాజకీయాలు నడిచే అవకాశాలున్నాయనే భావన కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీకి ప్రజాకర్షక నాయకుడు కావాలి. అలాగే బలమైన ఓటు బ్యాంకు కావాలి. ఎటూ తమకు మొదటి నుంచి మిత్రుడు పవన్ కళ్యాణ్ ఉన్నారు. ఆయన ప్రజాకర్షణ గురించి సందేహమే అవసరం లేదు. క్రౌడ్ పుల్లింగ్ కోసం పవన్ ను మించిన నాయకుడు లేడని దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయ నాయకులకు తెలుసు. ఇక తెలుగుదేశం పార్టీలో ముందే చెప్పినట్టు నాయకత్వ లేమి ఉంది కానీ.. కిందిస్థాయిలో పార్టీ క్యాడర్ చాలా ప్రాంతాల్లో ఇప్పటికీ అలానే ఉంది. ఇప్పుడు ఏపీలో లానే మూడు పార్టీలు కూటమిగా ప్రయత్నం చేస్తే.. కాంగ్రెస్ ను ఎదుర్కోవడం పెద్ద కష్టం కాదని పరిశీలకులు అంటున్నారు.
పవన్ కళ్యాణ్ కొండగట్టు పర్యటన కోసం వచ్చి చేసిన వ్యాఖ్యలు ఆ దిశలోనే వారి ఆలోచనలు ఉన్నట్టు స్పష్టం చేస్తున్నాయని భావిస్తున్నారు. బీజేపీ, జనసేన కలిసే ఉన్నాయనీ.. తెలంగాణలో కలిసే ముందుకు వెళతామని ఆయన స్పష్టం చేశారు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ పేరు ఎత్తకపోయినా.. ఏపీలో పొత్తులో ఉన్నపార్టీలను కాదని తెలుగుదేశం నాయకత్వం వ్యవహరించే పరిస్థితి లేదని చెప్పవచ్చు.
తెలంగాణ బీజేపీ - జనసేన కలిసే నడిచే ఛాన్స్ ఉందా?
Janasena in Telangana: ఈ అనుమానం సహజంగానే వస్తుంది. ఎందుకంటే, గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, జనసేన కలిసి పోటీచేశాయి. అప్పుడు 8 స్థానాల్లో జనసేన అభ్యర్థులను నిలబెట్టింది. రాష్ట్రం అంతటా జనసేనాని కలియతిరిగి ప్రచారం చేశారు. కానీ, ఆ పార్టీ పోటీచేసిన ఎనిమిది స్థానాల్లో ఏడు చోట్ల డిపాజిట్లు కూడా రాలేదు. ఒక్క చోట మాత్రమే డిపాజిట్లు దక్కించుకోగలిగారు జనసేన అభ్యర్థి. ఈ నేపథ్యంలో కొన్నిరోజుల క్రితం వరకూ బీజేపీ నేతలు పవన్ కళ్యాణ్ వైపు చూడడం కూడా మానేశారు. మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కూడా బీజేపీ, జనసేన కలిసి ఉన్నట్టుగా ఎక్కడా ప్రచారం చేసుకోలేదు. పవన్ కూడా ఆ ఎన్నికల సమయంలో పూర్తిగా తన దృష్టి ఏపీ రాజకీయాలపైనే పెట్టారు. ఆ సమయంలో బీజేపీ నేతలు జనసేన విషయంలో పెద్దగా ఆసక్తిగా లేరనే ప్రచారమూ గట్టిగా జరిగింది.
అయితే, ఇప్పుడు పరిస్థితులు మారాయి. జనసేనాని పవన్ కళ్యాణ్ ఇప్పుడు బలమైన నాయకుడిగా ప్రొజెక్ట్ అయ్యారు. ఏపీలో ప్రజలు ఆయనకు, ఆయన మాటలకూ బ్రహ్మరథం పట్టారు. తిరుగులేని ఆధిక్యాన్ని కూటమికి ఇచ్చారు. అంతేకాదు.. జనసేన 100 శాతం స్ట్రైక్ రేట్ తో పోటీచేసిన 21 అసెంబ్లీ, 2 ఎంపీ స్థానాలను గెలుచుకుంది. దీంతో ప్రధాని మోదీ స్వయంగా పవన్ ను తుపాన్ అంటూ వర్ణించి అభినందించారు. అందువల్ల ఇప్పుడు తెలంగాణలో పవన్ జనసేన - బీజేపీ కలిసి వెళ్లడంలో ఎవరూ అభ్యంతరం వ్యక్తం చేసే అవకాశమే ఉండదని రాజకీయ పరిశీలకుల అంచనా.
టీడీపీతో కలిసి వెళ్ళడానికి బీజేపీ నేతలు రెడీనా?
Janasena in Telangana: ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో బీజేపీకి టీడీపీతో కలిసి వెళ్ళడానికి కూడా అభ్యంతరాలు చెప్పే అవకాశం లేదనే చెప్పాలి. ఎందుకంటే, ఇప్పటికే ఏపీలో మూడుపార్టీల కూటమి బలమైన విజయాన్ని నమోదు చేసింది. తెలంగాణలో కూడా మూడు పార్టీల కలయిక మేజిక్ చేసే అవకాశం ఉందనే దిశలోనే వారి ఆలోచనలు ఉంటాయని భావిస్తున్నారు. అందుకే.. ఏపీ సీన్ తెలంగాణలో రిపీట్ అయ్యే ఛాన్స్ లు ఎక్కువగానే ఉన్నాయనేది విశ్లేషకుల లెక్క. పవన్ ఒక మాట చెబితే.. దానికోసం చివరివరకూ ప్రయత్నిస్తారు.. ప్రయత్నంలో విజయం సాధిస్తారు.. దానికోసం తగ్గడానికైనా వెనుకాడరనే విషయం ఇప్పటికే స్పష్టం అయింది. ఇప్పుడు తెలంగాణలోనూ మేమున్నాం అనే మాట ద్వారా కూటమి ప్రయోగం ఇక్కడా జరుగుతుంది అని చెప్పకనే చెప్పినట్టు అయిందని పరిశీలకులు అంటున్న మాట.
Janasena in Telangana: ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ చేసిన ఒక్క ప్రకటన.. ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో తీవ్రమైన చర్చకు దారితీసిందనే చెప్పాలి. పవన్ కళ్యాణ్ కూటమి రాజకీయాలను తెలంగాణలోనూ విజయవంతంగా ఇంప్లిమెంట్ చేసే అవకాశాలున్నాయనే అనుకోవచ్చు. రాబోయే రోజుల్లో తెలంగాణా రాజకీయ చిత్రంలో మార్పులు కనిపించే అవకాశం ఉందనే సంకేతాలు పవన్ ఇచ్చినట్లయింది. అందుకే తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఏపీ రాజకీయ పరిణామాలపై చర్చ జోరందుకుంది. అదేవిధంగా రాబోయే రోజుల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి తెలంగాణలో తన ప్రభావం చూపించే ప్రయత్నాలు జరగొచ్చనేది అందరూ నమ్ముతున్న మాట! రాజకీయాల్లో ఏదీ అసాధ్యం కాదు. ప్రజల చేతిలో ఓటు ఆయుధం ఎప్పుడు ఎవరిని ఎలా కూలుస్తుందో.. ఎవరికి ఎటువంటి ప్రాణదానం చేస్తుందో చెప్పలేం కానీ..తెలంగాణ రాజకీయ పరిణామాలను మాత్రం గమనిస్తున్న వారికి కూటమి రాజకీయాలు త్వరలో ఇక్కడ మొదలవుతాయనే విషయం అర్ధం అవుతోందని చెప్పవచ్చు.